- ఏఐ ముసుగులో శాశ్వత ఉద్యోగాల ఊచకోత
- ఉబర్, జొమాటో మాదిరిగా కాంట్రాక్ట్ వర్కర్స్
- ఎన్ని గంటలు చేస్తే అన్ని గంటలే జీతం
- ఇన్సూరెన్స్, సెలవులుండని సాఫ్ట్‌వేర్ రంగం
- ఆఫీస్ ఖర్చులు, మెయింటెనెన్స్ లేని వ్యవస్థ
- సాంకేతిక మార్పుతో సామాజిక సంక్షోభం
- మెటా, గూగుల్ లాంటి కంపెనీల్లోనూ ఇదే స్థితి
సహనం వందే, హైదరాబాద్:
సాంకేతిక విప్లవం ముసుగులో సామాన్యుడి కడుపు కొట్టేందుకు టెక్ ది’గ్గజ’ దొంగలు సిద్ధమయ్యారు. కంప్యూటర్ల మేధస్సు పెరిగితే మనిషికి విలువ పడిపోతుందా అన్న అనుమానం నిజమవుతోంది. ఏఐ వస్తోంది… అంతా మారిపోతుంది అంటూ భయపెడుతూ తెర వెనుక ఖర్చు తగ్గించుకునే నాటకానికి తెర లేపారు. ఇది సాంకేతికత తెచ్చిన వినాశనం కాదు.. కేవలం సాఫ్ట్‌వేర్ కార్పొరేట్ శక్తులు ఆడుతున్న ఒక తెలివైన జూదం.
లాభాల కోసమే ఉద్యోగ కోతలు
టెక్ దిగ్గజాలు గెనెరేటివ్ ఏఐ పందెంలో గెలవాలని చూస్తూ ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నాయి. మెటా గత వారం వందల మందిని వీధిలోకి నెట్టింది. ఒరాకిల్ వేల మందిని తీసేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అట్లాసియన్ 10 శాతం మందిని పక్కన పెట్టింది. బ్లాక్ సంస్థ ఫిబ్రవరిలో 4 వేల మందిని అంటే 40 శాతం సిబ్బందిని తొలగించింది. చాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ నివేదిక ప్రకారం 2023 నుంచి అమెరికాలో 92 వేల ఉద్యోగ కోతలకు ఏఐ కారణమైంది. ఇందులో మూడింట రెండు వంతులు అంటే అత్యధిక భాగం 2025లోనే జరగడం గమనార్హం.

డబుల్ గేమ్ ఆడుతున్న కంపెనీలు…
కంపెనీలు పాత ఉద్యోగులను తీసేసి మళ్ళీ తక్కువ జీతాలకే కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నాయి. 2025 చివరలో జరిపిన సర్వేలో 29 శాతం మేనేజర్లు పాత పోస్టులను మళ్ళీ తెరిచారు. 55 శాతం మంది 2026 మొదటి ఆరు నెలల్లో తాత్కాలిక సిబ్బందిని పెంచుతామని చెప్పారు. కస్టమర్ సర్వీస్ విభాగాల్లో 50 శాతం మందిని మళ్ళీ తక్కువ జీతాలకే తీసుకునే అవకాశం ఉంది. గరిష్ట లాభాల కోసం కంపెనీలు ఆడుతున్న వింత నాటకం ఇది. పూర్తిస్థాయి ఉద్యోగికి ఇచ్చే సదుపాయాలు ఎగ్గొట్టడమే వీరి అసలు ప్లాన్.
ఉబర్ తరహా బానిసత్వం
టెక్ సంస్థలు ఇప్పుడు ఉబర్, అమెజాన్ డెలివరీ భాగస్వాముల తరహాలో ఉద్యోగులను వాడుకుంటున్నాయి. కంపెనీకి మీతో ఎలాంటి సంబంధం ఉండదు. క్లార్నా సీఈఓ సెబాస్టియన్ దీన్నే ఉబెర్ సెటప్ అని పిలుస్తున్నారు. సాధారణంగా ఉబెర్ డ్రైవర్లకు ఎలాగైతే ఇన్సూరెన్స్ లేదా సెలవులు ఉండవో సాఫ్ట్‌వేర్, కస్టమర్ కేర్ ఉద్యోగులను కూడా అలాగే మారుస్తున్నారు. అవసరమైనప్పుడు యాప్ ద్వారా లాగిన్ అయ్యి పని చేయాలి. పని అయిపోగానే లాగౌట్ అవ్వాలి. దీనివల్ల కంపెనీకి ఆఫీస్ ఖర్చులు, సామాజిక భద్రత కల్పించే బాధ్యత తప్పుతుంది. పని చేసిన గంటలకే జీతం ఇచ్చే ఈ పద్ధతి వల్ల కంపెనీలు కోట్లు మిగిల్చుకుంటున్నాయి.
చరిత్ర పునరావృతమవుతోంది
టెక్ రంగం మొదటి నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థ మీదే నడుస్తోంది. 1990లో మైక్రోసాఫ్ట్ టెంపరరీ వ్యవస్థను తెచ్చింది. దీనిపై అప్పట్లో 815 కోట్లకు పైగా రూపాయల నష్టపరిహారం కూడా చెల్లించింది. 2019 నాటికి గూగుల్‌లో శాశ్వత ఉద్యోగుల కంటే కాంట్రాక్ట్ వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు అప్‌వర్క్ సర్వే ప్రకారం 77 శాతం కంపెనీలు కాంట్రాక్టర్ల కోసమే చూస్తున్నాయి. బాధ్యత లేని పనిని యజమానులు ఇష్టపడుతున్నారు. మౌరీన్ విలే క్లాఫ్ చెప్పినట్లు ఇది కంపెనీలు డబ్బు సంపాదించుకోవడానికి ఆడుతున్న డ్రామా మాత్రమే.
మైక్రోసాఫ్ట్ బాధితుడి ఆవేదన
ఉద్యోగుల పట్ల కంపెనీలకు కనికరం లేకుండా పోతోంది. మైక్రోసాఫ్ట్‌లో గతంలో పనిచేసిన ఒక వ్యక్తి అనుభవం దీనికి నిదర్శనం. అతడిని తీసేసిన వెంటనే అదే టీమ్‌లో కాంట్రాక్ట్ పని కోసం పిలిచారు. ఏడాది పాటు వెతికి మళ్ళీ అదే కంపెనీలో చేరాడు. కానీ ఇప్పుడు అతడికి పాత జీతంలో మూడో వంతు కంటే తక్కువ దక్కుతోంది. 2025లో మైక్రోసాఫ్ట్ 15,000 మందిని రోడ్డున పడేసింది.
పడిపోతున్న జీతాల గ్రాఫ్
ఒకప్పుడు టెక్ ఉద్యోగం అంటే విలాసం. ఉచిత భోజనం, భారీ జీతాలు ఉండేవి. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. 2025 చివరలో ఉద్యోగాలు మారిన వారిలో 40 శాతం మంది జీతం తగ్గించుకున్నారు. ఒకవైపు మెటా లాంటి సంస్థలు ఏఐ నిపుణులకు వందల కోట్ల ప్యాకేజీలు ఇస్తున్నాయి. మరోవైపు సాధారణ ఉద్యోగులకు పని భారం పెంచుతున్నాయి. యజమాని, ఉద్యోగి మధ్య ఉండాల్సిన కనీస సామాజిక ఒప్పందం పూర్తిగా దెబ్బతింటోంది. ఇది కేవలం సాంకేతిక మార్పు కాదు… ఒక సామాజిక సంక్షోభం.
బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్