- భక్తి ముసుగులో కామ పిశాచాల వేట
- నమ్మకం ముంచిన బతుకులు
- అత్యాచారం… గర్భస్రావం… ఘోరకృత్యం
సహనం వందే, నాసిక్:
మనుషుల నమ్మకం ఒక అగాధమైతే అందులో దొంగ బాబా విసిరే వల ఒక విషాదం. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు కనిపిస్తాడో లేదో తెలియదు కానీ దేవుడి పేరిట వేషగాళ్లు మాత్రం వేటగాళ్లలా తారసపడతారు. మూఢనమ్మకం కళ్లకు గంతలు కట్టినప్పుడు పవిత్రమైన మంత్రాల సాక్షిగా అపవిత్రమైన పాడు పనులు ఎలా జరుగుతాయో చెప్పే పచ్చి నిజమే ఈ కథనం.
సూపర్ నేచురల్ శక్తుల మోసం
తనకు అలౌకిక శక్తులు ఉన్నాయని అశోక్ ఖరాత్ ప్రచారం చేసుకున్నాడు. ఈ మాయ మాటలను నమ్మి తల్లిదండ్రులు తమ బిడ్డలను అతని వద్దకు పంపారు. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం… మంత్రాలు చదువుతూనే అతను అసభ్యంగా ప్రవర్తించేవాడు. మహిళల ప్రైవేట్ భాగాలను తాకుతూ లైంగిక దాడికి పాల్పడేవాడు. దీనిని ఒక స్వస్థత ప్రక్రియగా నమ్మించేవాడు. ఇలాంటి మాయగాళ్ల ఉచ్చులో పడి ఎంతోమంది మహిళలు తమ మానాన్ని పోగొట్టుకున్నారు.
చితికిన కలలు
అశోక్ ఖరాత్ పై వస్తున్న ఆరోపణలు వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. గర్భిణీ అని కూడా చూడకుండా ఒక మహిళపై అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా ఆమెను గర్భస్రావం చేయించుకోవాలని బలవంతం చేశాడు. హత్యలు చేసినట్లు కూడా అతనిపై కేసులు ఉన్నాయి. దర్యాప్తు తీవ్రతరం కావడంతో అతని అసలు స్వరూపం బయటపడింది. ఆ భయంకరమైన దొంగ బాబా చెరలో ఎంతోమంది నలిగిపోయారు. ప్రతి ఫిర్యాదు వెనుక ఒక కన్నీటి గాథ దాగి ఉంది.

ఫిర్యాదుల వెల్లువ
కేసు నమోదైన కేవలం 5 రోజుల్లోనే పోలీసులకు 50కి పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. అవన్నీ అశోక్ ఖరాత్ చేసిన అత్యాచారాలు, దోపిడీకి సంబంధించినవే. నిందితుడు మహిళల నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసేవాడు. అసభ్యకరమైన వీడియోలను అడ్డం పెట్టుకుని డబ్బులు వసూలు చేశాడు. ఇంతకాలం మౌనంగా ఉన్న బాధితులు ఇప్పుడు రోడ్డుపైకి వస్తున్నారు.
మౌనం వెనుక మర్మం
మహిళలు ఇంతకాలం ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారనేది పెద్ద ప్రశ్న. సమాజం ఏమనుకుంటుందో అనే భయం ఒక కారణం. తల్లిదండ్రుల అతి నమ్మకం కూడా వారిని బలిపీఠం ఎక్కించింది. బాబాలు ప్రజల మెదళ్లలో భయాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారు. దైవ ద్రోహం జరుగుతుందనే భయంతో మహిళలు కుమిలిపోయారు. ఆ నిశ్శబ్దాన్నే అశోక్ ఖరాత్ తన రక్షణ కవచంగా మార్చుకున్నాడు. ఇప్పుడు ఆ నిశ్శబ్దం బద్ధలై నిప్పులా మండుతోంది.
ఆత్మహత్యాయత్నాల హెచ్చరిక
భక్తికి మూర్ఖత్వానికి మధ్య ఉన్న గీత చాలా సన్ననిది. ఆ గీత దాటితే జీవితాలు నాశనమవుతాయి. ప్రజల బలహీనతలే బాబాలకు పెట్టుబడి. నమ్మకం పేరుతో జరిగే ఈ వ్యభిచారాన్ని అరికట్టాలి. కన్నవారే తమ పిల్లలను ఇటువంటి కామాంధుల వద్దకు పంపిస్తున్నారు. ఇది సమాజానికి పట్టిన చీడ పురుగు. ఎవరినో నమ్మే ముందు విచక్షణతో ఆలోచించడం చాలా అవసరం. లేదంటే మరిన్ని ప్రాణాలు బలికాక తప్పదు.