మొస్సాద్‌కే తాత ‘యూనిట్ 8200’ – ఇరాన్ యుద్ధంలో ‘ఇజ్రాయిల్ అదృశ్య సైన్యం’

Israel Unit 8200 Hacking Hunters
  • కంటికి చిక్కని కాలయముడు ఈ ఫోర్స్
  • హ్యాకింగ్ హంటర్స్… సైలెంట్ మర్డర్స్
  • టెక్నాలజీయే ఆయుధంగా శత్రువులపై దాడి
  • అలీ ఖమేనీ ‌సహా 40 మంది నేతల హతం
  • ‘యూనిట్ 8200’పై వాషింగ్టన్ పోస్ట్ కథనం

సహనం వందే, హైదరాబాద్:

నిశ్శబ్దంగా వచ్చే మరణం ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు యుద్ధంలో కనబడుతుంది. యుద్ధం అంటే కేవలం తుపాకుల మోత కాదు. రక్తపు సిరాతో రాసే మరణశాసనం అసలే కాదు. అది ఒక నిశ్శబ్దపు నీడ. కంటికి కనిపించని ఆ నీడ పేరే ‘యూనిట్ 8200’. మనం జీవిస్తున్న ఈ డిజిటల్ ప్రపంచంలో ఒక చిన్న క్లిక్ ఒక సామ్రాజ్యాన్ని ఎలా కూల్చగలదో ఇజ్రాయెల్ ప్రపంచానికి చూపిస్తోంది. ఇది కేవలం గూఢచారి విభాగం కాదు… ఒక జాతి మనుగడ కోసం ఆడే చదరంగం.

మొస్సాద్‌ను మించిన వేగం…
ప్రపంచానికి మొస్సాద్ గురించి తెలుసు. కానీ మొస్సాద్‌కే తాత లాంటిది ఈ యూనిట్ 8200. ఇది ఇజ్రాయెల్ రక్షణ దళాల వ్యక్తిగత గూఢచార సంస్థ. రహస్య ఆపరేషన్లకు ఇది కేరాఫ్ అడ్రస్. అమెరికా ఎన్‌ఎస్‌ఏ లేదా బ్రిటన్ జీసీహెచ్‌క్యూతో దీనిని పోలుస్తారు. ఇజ్రాయెల్ సైన్యంలోనే ఇది అతిపెద్ద విభాగం. సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ నుంచి డేటా మైనింగ్ వరకు వీరు ఆరితేరారు. టెక్నాలజీని ఆయుధంగా మార్చుకుని శత్రువుల గుండెల్లో నిద్రపోతున్నారు. ఈ అదృశ్య సైన్యంపై అమెరికా ప్రముఖ పత్రిక ‘వాషింగ్టన్ పోస్ట్’ సంచలనాత్మక స్టోరీ రాసింది.

Israel Unit 8200

అగ్రనేతలే ప్రధాన లక్ష్యం
ఇరాన్ అగ్రనాయకులు ఇప్పుడు భయం నీడలో బతుకుతున్నారు. అయతోల్లా అలీ ఖమేనీ, ఐఆర్‌జీసీ అధిపతి మహమ్మద్ పక్‌పూర్ వంటి వారిని ఈ యూనిట్ టార్గెట్ చేసింది. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం వీరి హత్యల వెనుక యూనిట్ 8200 హస్తం ఉంది. కేవలం ఒక కెమెరాను హ్యాక్ చేయడం ద్వారా అలీ ఖమేనీ ఎక్కడున్నారో పసిగట్టారు. టెక్నాలజీని వాడి శత్రువుల కదలికలను సెకన్లలో పట్టేస్తున్నారు.

నిశ్శబ్దంగా 40 మంది హతం…
ఈ విభాగం విధ్వంసం మామూలుగా లేదు. సైబర్ సెక్యూరిటీ, సోషల్ మీడియా ద్వారా ఇరాన్ అంతటా వీరు నెట్‌వర్క్ నిర్మించారు. ఇప్పటివరకు కనీసం 40 మంది ఇరాన్ ప్రముఖ నాయకులు ఈ యూనిట్ ఆపరేషన్ల వల్ల ప్రాణాలు కోల్పోయారు. గతంలో హిజ్బుల్లా అగ్రనేతలను సైతం వీరు మట్టుబెట్టారు. మొస్సాద్‌ కంటే అత్యంత ప్రమాదకరమైన దళంగా దీనిని పరిగణించడానికి కారణం ఇదే. వీరి దాడులు శత్రువుకు తెలిసేలోపే జరిగిపోతాయి.

అణ్వాయుధాలకు చెక్
2005 నుంచి 2010 మధ్య ఇరాన్ అణు సౌకర్యాలను ధ్వంసం చేయడంలో ఈ యూనిట్ కీలక పాత్ర పోషించింది. ఇరాన్ యురేనియంను సుసంపన్నం చేస్తూ అణ్వాయుధాలు తయారు చేస్తోందని ఇజ్రాయెల్ పసిగట్టింది. వెంటనే రంగంలోకి దిగిన యూనిట్ 8200 అక్కడి సెంట్రిఫ్యూజ్‌లను సునాయాసంగా ధ్వంసం చేసింది. ఒక్క తూటా కూడా పేల్చకుండా శత్రువు అణు ఆశలను ఆవిరి చేసింది. సాంకేతిక దాడుల ద్వారా భారీ నష్టాన్ని కలిగించడంలో వీరు దిట్ట.

యువతరం మెరుపు దాడులు
ఈ యూనిట్ ప్రత్యేకత అందులోని సిబ్బంది. ఇక్కడ పనిచేసే వారి వయస్సు కేవలం 20 నుంచి 25 ఏళ్లు మాత్రమే. ఇజ్రాయెల్‌లోని అత్యంత యువ యూనిట్లలో ఇది ఒకటి. చిన్న చిన్న బృందాలుగా విడిపోయి వీరు ఆపరేషన్లు చేస్తారు. సాధ్యమైనంత వరకు ప్రాణనష్టం జరగకుండా టార్గెట్‌ను పూర్తి చేస్తారు. 1948లో స్థాపించిన ఈ విభాగం నేడు ఇజ్రాయెల్ అదృశ్య సైన్యంలా మారింది. దీన్నే అక్కడ ష్మోనే మటైమ్ అని పిలుస్తారు.

ప్రపంచ యుద్ధ సమీకరణాలు
ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రతి దేశం దీనివల్ల ఏదో ఒక రకంగా ప్రభావితమవుతోంది. ఇలాంటి సమయంలో యూనిట్ 8200 పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. ఇజ్రాయెల్ దగ్గర ఇంతటి శక్తివంతమైన దళం ఉందని చాలా దేశాలకు తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ గూఢచారి విభాగం గురించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది ఇజ్రాయెల్ రక్షణ కవచంలా పనిచేస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *