- దాని రాతనే మార్చిన ఆ నాలుగు గీతలు
- స్టీవ్ జాబ్స్ గీసిన మంత్రదండం లాంటి గీత
- అందం… మేధస్సుల అపురూప కలయిక
- జేబులో ఇమిడిపోయిన వెయ్యి పాటలు
- మనిషి స్పర్శతో మారిన ఐ-ఫోన్ ప్రపంచం
సహనం వందే, హైదరాబాద్:
జీవితంలో ఒక్కోసారి మనం అన్నీ కోల్పోయామని అనుకుంటాం. కానీ సరిగ్గా అప్పుడే ఒక చిన్న ఆలోచన మన రాతను మారుస్తుంది. యాపిల్ సంస్థ 50 ఏళ్ల పండుగ చేసుకుంటున్న వేళ ఒకప్పుడు ఆ సంస్థ చనిపోవడానికి కేవలం 90 రోజుల దూరంలో ఉందంటే ఎవరూ నమ్మలేరు. కానీ అది నిజం. స్టీవ్ జాబ్స్ అనే ఒక యోధుడు తిరిగి వచ్చి కేవలం ఒక తెల్ల కాగితం మీద గీసిన నాలుగు గీతలు ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిలబెట్టాయో చెప్పే అద్భుత గాథ ఇది.
గందరగోళం నుంచి స్పష్టత వరకు
యాపిల్ సంస్థ 1976 ఏప్రిల్ 1వ తేదీన కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో ఏర్పాటయింది. అంటే సరిగ్గా 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. దాని ఏర్పాటులో స్టీవ్ జాబ్స్ ఉన్నప్పటికీ మధ్యలో ఆయనను బహిష్కరించారు. అయితే ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆ సంస్థ దశా దిశా లేకుండా ఉండిపోయింది. స్టీవ్ జాబ్స్ మళ్లీ 1997లో అడుగుపెట్టారు. క్వాడ్రా, స్టైల్‌రైటర్, ఆడియోవిజన్, పిప్పిన్ లాంటి డజన్ల కొద్దీ అర్థం లేని వస్తువులను తయారు చేస్తూ కంపెనీ గందరగోళంలో పడింది. జాబ్స్ రాగానే ఒకటే పని చేశారు. అనవసరమైన చెత్తనంతా తీసిపారేశారు. ఆ బోర్డు మీద ఒక ప్లస్ గుర్తు (+) గీశారు. వినియోగదారులు, నిపుణులు.. డెస్క్‌టాప్, పోర్టబుల్… ఈ నాలుగు గళ్లు ఉంటే చాలని తేల్చి చెప్పారు. ఆ స్పష్టతే యాపిల్ పునర్జన్మకు తొలి అడుగు.
యంత్రానికి ప్రాణం పోస్తే..
జాబ్స్ నమ్మిన సూత్రం ఒక్కటే.. వస్తువు కేవలం పని చేస్తే సరిపోదు. దాన్ని చూడగానే ప్రేమలో పడేలా ఉండాలి. అందుకే జోనీ ఐవ్ లాంటి డిజైన్ మేధావులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఫలితమే రంగుల ఐమ్యాక్. 1998లో వచ్చిన ఈ పారదర్శక కంప్యూటర్ అంతకుముందు ఉన్న బేజ్ రంగు డబ్బాలను మాయం చేసింది. చూస్తేనే ముట్టుకోవాలనిపించేంత అందంగా దానిని తీర్చిదిద్దారు. ఫిలిప్ షిల్లర్ లాంటి వారు తోడవడంతో యాపిల్ వస్తువులు కేవలం యంత్రాలుగా కాకుండా మనిషి భావోద్వేగాల ప్రతిబింబాలుగా మారాయి. టెక్నాలజీకి ఒక ‘సెక్స్ అప్పీల్’ ఉంటుందని ప్రపంచానికి చాటిచెప్పింది.

వైర్ లేకుండా నెట్‌వర్కింగ్…
1999లో వచ్చిన ఐబుక్ అదే పట్టుదలకు నిదర్శనం. వైర్ లేకుండా నెట్‌వర్కింగ్ చేయడమనే వింతను ఫిలిప్ షిల్లర్ వేదికపై నుంచి దూకి నిరూపించారు. ఆ తర్వాత పవర్‌బుక్ జీ4 టైటానియం, పవర్‌మ్యాక్ జీ4 క్యూబ్ వంటి అద్భుతాలు వచ్చాయి. యంత్రం లోపల ఉండే భాగాలు కూడా అందంగా అమర్చాలని జాబ్స్ పట్టుబట్టేవారు. కంటికి కనిపించని చోట కూడా నాణ్యత ఉండాలన్నదే ఆయన ఫిలాసఫీ. జాబ్స్ కేవలం వస్తువులను అమ్మలేదు… ఒక అనుభూతిని అమ్మారు.
వెయ్యి పాటల ఓదార్పు
2001లో ప్రపంచం ఒక అద్భుతాన్ని చూసింది. అదే ఐపాడ్. మ్యాక్ ఓఎస్ ఎక్స్ సాఫ్ట్‌వేర్ పునాదిగా వచ్చిన ఈ చిన్ని పరికరం వెయ్యి పాటలను మనిషి జేబులో పదిలంగా దాచింది. సంగీతం వినే పద్ధతినే ఇది మార్చేసింది. 2003లో ఐమ్యూజిక్ సాఫ్ట్‌వేర్, ఆన్‌లైన్ మ్యూజిక్ సర్వీసులతో సరికొత్త విప్లవం వచ్చింది. విండోస్ లోనూ పనిచేసేలా చేయడంతో ఐపాడ్ అమ్మకాలు కోట్లకు చేరాయి. 2005 నాటికి ఐపాడ్ నానో, ఐపాడ్ షఫుల్ వంటి పరికరాలు ప్రతి మనిషి చేతిలో మెరిశాయి.
చరిత్రను తిరగరాసిన ఐఫోన్
2007లో ఐఫోన్ విడుదలతో జాబ్స్ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. అప్పటివరకు ఫోన్ అంటే బటన్ల మయం. కానీ జాబ్స్ వాటన్నింటినీ తీసేసి కేవలం గ్లాస్, టచ్‌తో అద్భుతం చేశారు. మల్టీటచ్ అనే మంత్రంతో ఫోన్ అంటే కేవలం మాట్లాడే పరికరం కాదని అది మన ప్రపంచమని జాబ్స్ నిరూపించారు. ఇవన్నీ కేవలం వస్తువులు కావు ఒక మనిషి పట్టుదల నుంచి పుట్టిన అద్భుతాలు. ఆ తర్వాత ఐప్యాడ్, ఎయిర్‌పాడ్స్ వచ్చాయి. జాబ్స్ మూల సూత్రం ఒక్కటే: “అతి తక్కువలో అత్యంత అందాన్ని చూడటం”. జాబ్స్ గీసిన ఆ నాలుగు గీతలే నేటి యాపిల్ సామ్రాజ్యానికి మూలస్తంభాలు.
బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్