- మోక్షజ్ఞకు జోడీగా శ్రీలీల నటించే అవకాశం
- వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ కథ
సహనం వందే, హైదరాబాద్:
నందమూరి అభిమానులకు ఇది పూనకాలు తెప్పించే వార్త. మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాతోనే సరికొత్త సంచలనాలకు తెరలేపబోతున్నారా? బాలకృష్ణ తనయుడి తొలి సినిమాపై రోజుకో ఆసక్తికరమైన ప్రచారం బయటకు వస్తూ నెట్టింట రచ్చ లేపుతోంది. బింబిసార డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
బాలయ్య ముద్దుగుమ్మలే మోక్షజ్ఞకు తోడు
ఈ సినిమాలో బాలకృష్ణతో గతంలో జతకట్టిన స్టార్ హీరోయిన్లు కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. బంగారు బుల్లోడులో బాలయ్య సరసన మెరిసిన రవీనా టాండన్, నారీ నారీ నడుమ మురారిలో కలిసి నటించిన శోభన ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపిస్తారట. రవీనా టాండన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తుండగా, శోభన మోక్షజ్ఞ తల్లిగా కనిపించనున్నారనే ప్రచారం గట్టిగా సాగుతోంది.
శ్రీలీలతో మోక్షజ్ఞ క్రేజీ కాంబో
మరోవైపు కథానాయికగా యంగ్ సెన్సేషన్ శ్రీలీల పేరును మేకర్స్ పరిశీలిస్తున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. భగవంత్ కేసరిలో బాలయ్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న శ్రీలీల… ఇప్పుడు మోక్షజ్ఞతో జోడీ కడితే ఈ కాంబినేషన్‌కు ఎక్కడలేని క్రేజ్ వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ కాంబోపై నందమూరి అభిమానుల్లో కూడా విపరీతమైన ఆసక్తి వ్యక్తమవుతోంది.
సెకండాఫ్‌లో బాలకృష్ణ మాస్ ఎంట్రీ
ఇది చాలదన్నట్లు ఈ సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో మెరవబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో మోక్షజ్ఞ తండ్రిగా బాలయ్య ఇచ్చే ఎంట్రీ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక రవీనా టాండన్ ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగం కావడంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సోషల్ మీడియాలో వస్తున్న లీకులు, రూమర్స్లోనే ఆమె పేరు వచ్చిందా లేక నిజంగానే ఓకే అయ్యారా అనేది మేకర్స్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే.
భారీ సోషియో ఫాంటసీ ఫిల్మ్…
రొటీన్ కమర్షియల్ మాస్ సినిమాతో కాకుండా… మోక్షజ్ఞను ఓ విలక్షణమైన కాన్సెప్ట్‌తో పరిచయం చేయాలని భావిస్తున్నారు. మల్టిపుల్ టైమ్‌లైన్స్, పునర్జన్మల కథాంశంతో భారీ సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కనుంది. విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యం ఉన్న ఈ కథ మోక్షజ్ఞకు మొదటి సినిమాతోనే డిఫరెంట్ ఇమేజ్ తీసుకువస్తుందని గట్టిగా నమ్ముతున్నారు.