ఆమడ దూరంలో ‘అల్లా’ రాజ్యం – పదేళ్లలో ప్రపంచంలో పెద్ద మతంగా ముస్లిం

Muslims domination
  • క్రిస్టియన్ జనాభాను మించిపోనున్న ఇస్లాం
  • దీనికి ప్రధాన కారణం జననాల రేటే
  • ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ అంచనాల సంచలనం
  • ఇండియా, యూరప్, అమెరికాలలో ముస్లిం సునామీ
  • గత ఐదేళ్లలో 25 కోట్ల మంది ముస్లిం పిల్లలు పుట్టారు

సహనం వందే, హైదరాబాద్:

ప్రపంచ జనాభా లెక్కల్లో రాబోయే దశాబ్దాల్లో భారీ మార్పులు రాబోతున్నాయని ప్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా వేసింది. ఇప్పటివరకు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మతంగా క్రైస్తవం అగ్రస్థానంలో ఉండగా, రాబోయే పదేళ్లలో ఆ స్థానాన్ని ఇస్లాం చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. కేవలం సంఖ్యల పరంగానే కాకుండా, వివిధ ప్రాంతాల్లో మతాల నిష్పత్తి కూడా మారనుంది.

ముస్లింలే కింగ్స్…
2020 నాటి గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 227 కోట్ల మంది క్రైస్తవులు ఉండగా, ముస్లింల సంఖ్య 202 కోట్లుగా ఉంది. అప్పట్లో ఈ రెండు మతాల మధ్య 25 కోట్ల తేడా ఉండేది. అయితే జనాభా పెరుగుదల వేగం ఇస్లాంలో ఎక్కువగా ఉండటంతో ఈ అంతరం క్రమంగా తగ్గుతోంది. 2035 నాటికి ముస్లింల జనాభా 257 కోట్లకు చేరవచ్చని, క్రైస్తవుల సంఖ్య 252 కోట్ల వద్ద నిలవవచ్చని ప్యూ అంచనా చెబుతోంది. అంటే సుమారు ఐదు కోట్లు ఎక్కువగా ముస్లింలు మొదటి స్థానానికి రావచ్చు. ఈ మార్పు ఒక్కసారిగా జరిగేది కాదని, దశాబ్దాలుగా కొనసాగుతున్న జనాభా ధోరణుల వల్ల వస్తోందని పరిశోధకులు వివరిస్తున్నారు.

Muslims Domination

జననాల రేటే అసలు కారణం..
ఈ మార్పుకు మత మార్పిడుల కంటే పిల్లల జననాలే ప్రధాన కారణమని ప్యూ సీనియర్ జనాభా పరిశోధకుడు కాన్రాడ్ హ్యాకెట్ స్పష్టం చేశారు. 2020 నుంచి 2025 మధ్య కాలంలో ముస్లిం మహిళలు సగటున 3.1 మంది పిల్లలకు జన్మనివ్వగా, క్రైస్తవ మహిళల్లో ఈ సగటు 2.5గా ఉంది. ఇతర మతాల మహిళల్లో ఇది 1.6 మాత్రమే. ఒక తరం నుంచి మరో తరానికి జనాభా స్థిరంగా ఉండటానికి అవసరమైన భర్తీ స్థాయి సగటు 2.1గా ఉంటుంది. ముస్లిం తల్లులకు 2020–2025 మధ్య సుమారు 25.2 కోట్ల మంది పిల్లలు పుట్టగా, క్రైస్తవ తల్లులకు 20.8 కోట్ల మంది పుట్టారు. కుటుంబంలో పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల యువ జనాభా పెరిగి, భవిష్యత్తులో జనాభా లెక్కలను మారుస్తోంది.

ప్రాంతాల వారీగా మారుతున్న చిత్రం
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఈ మార్పులు భిన్నంగా కనిపిస్తున్నాయి. 2070 నాటికి సబ్ సహారా ఆఫ్రికా జనాభా పెరుగుదలలో కీలకంగా మారనుంది. ఆ నాటికి ప్రపంచంలోని క్రైస్తవుల్లో సగానికి పైగా అక్కడే ఉండొచ్చని, కాంగోలో క్రైస్తవుల సంఖ్య మూడు రెట్లు పెరిగి 27 కోట్లకు చేరవచ్చని అంచనా. మరోవైపు యూరప్ మొత్తం జనాభా 2070 నాటికి 17 శాతం తగ్గవచ్చని, అక్కడ క్రైస్తవుల సంఖ్య 50.5 కోట్ల నుంచి 32.4 కోట్లకు పడిపోవచ్చని ప్యూ చెబుతోంది. అమెరికాలోనూ క్రైస్తవుల వాటా 2065 నాటికి 50 శాతం కంటే తక్కువకు రావచ్చని, కెనడాలో 2030 నాటికే సగం కంటే తగ్గొచ్చని అంచనా. 2070 నాటికి ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు 360 కోట్లు దాటవచ్చని, క్రైస్తవులు 300 కోట్లకు కొద్దిగా తక్కువగా ఉండొచ్చని పరిశోధన చెబుతోంది.

మిగిలిన మతాలు… దేశాల లెక్కలు
హిందువులు, యూదుల జనాభా సంఖ్య పెరిగినా, ప్రపంచ మొత్తం జనాభాలో వారి శాతం తగ్గవచ్చని ప్యూ అంచనా వేస్తోంది. చైనా, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాల్లో జనాభా తగ్గుదల కారణంగా బౌద్ధుల సంఖ్యతో పాటు వారి వాటా కూడా తగ్గవచ్చు. చైనా మినహా ఇతర దేశాల్లో ఏ మతాన్నీ పాటించని వారి సంఖ్య 2070 నాటికి 18 కోట్లకు పైగా పెరగవచ్చని, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాల్లోనూ వీరు మెజారిటీ కావచ్చు. ఇక దేశాల వారీగా చూస్తే, 2070 నాటికి అత్యధిక ముస్లింలు ఉన్న దేశంగా పాకిస్థాన్ మారవచ్చని, ఆ తర్వాత భారత్, నైజీరియా, ఇండోనేషియా నిలవవచ్చని అంచనా. భారత్‌లో ముస్లిం జనాభా వాటా పెద్దగానే ఉంటుంది.

ఘర్షణ కాదు.. అవగాహన అవసరం
జనాభా లెక్కల్లో వస్తున్న ఈ మార్పులను ఆధిపత్య పోరుగా లేదా నాగరికతల ఘర్షణగా చూడకూడదని హార్వర్డ్ స్కూల్ పరిశోధకురాలు గినా జుర్లో అభిప్రాయపడ్డారు. అలా భావిస్తే సమాజంలో అనవసరమైన ఆందోళనలు పెరిగే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. జనాభా పెరుగుదల అనేది జననాల రేటు, ఆయుర్దాయం, వలసలు వంటి సామాజిక అంశాల వల్ల జరిగే సహజ ప్రక్రియ. ఏ మతంలో ఎక్కువ మంది ఉన్నారన్న దానితో మనుషుల విలువను కొలవలేం. సంఖ్యల లెక్కలు ఎలా మారినా, మతాల మధ్య పరస్పర గౌరవం, అవగాహన, మానవ సంబంధాలు మాత్రం చెక్కుచెదరకుండా ఉండటమే సమాజానికి మేలు చేస్తుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *