- తెలంగాణకు బీసీ సీఎం ఖాయమని ధీమా
- అందుకు రేవంత్ కూడా మద్దతు ఇస్తారట
- రాహుల్ గాంధీ నినాదమే స్ఫూర్తి అని వ్యాఖ్య
సహనం వందే, హైదరాబాద్:
రాష్ట్ర రాజకీయాల్లో ఒకే ఒక్క ప్రకటన ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతోంది. తెలంగాణకు త్వరలోనే ఒక బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కాబోతున్నారా? ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అసలు ఆయన ఏమన్నారు? ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటి? అనేది ఇప్పుడు చూద్దాం.
రేవంత్‌కు చెక్ పెట్టే వ్యూహమా?
ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను మరో 10 ఏళ్లు సీఎం పదవిలోనే ఉంటానని చెప్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాత్రం తెలంగాణకు ఖచ్చితంగా బీసీ వ్యక్తే సీఎం అవుతారని చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ సహకారం కూడా ఉంటుందని ఆయన అనడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ మధ్య మంచి సంబంధాలే ఉన్నప్పటికీ, ఈ వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఆయన ఏకంగా సీఎంతోనే పెట్టుకోవడం వెనుక ఆంతర్యం ఏంటనేది అర్థం కావడం లేదు.

రాహుల్ గాంధీ ఇచ్చిన ధైర్యంతోనే!
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మాట్లాడిన మహేష్ గౌడ్… రాహుల్ గాంధీ ఇచ్చిన ధైర్యంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఇచ్చిన ప్రోత్సాహం కూడా దీనికి ఉందన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఎవరి వాటా ఎంత ఉందో వారికి అంత ప్రాతినిధ్యం లభించాలనే నినాదాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ మాటకే కట్టుబడి బీసీలకు రావాల్సిన న్యాయమైన వాటాను తీసుకుంటామని స్పష్టం చేశారు.
కుల సర్వేతో కొత్త చరిత్ర
రాష్ట్రంలో నిర్వహించిన కుల సర్వే గురించి కూడా ఆయన వివరంగా మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల సహకారంతో కుల సర్వేను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఈ సర్వే డాక్యుమెంట్ కూడా సిద్ధమైందని, ఇది గనుక పూర్తిగా సాకారమైతే యావత్ దేశానికే తెలంగాణ ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు హక్కులు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
మోదీపై విమర్శలు… కాంగ్రెస్ లెక్కలు
ప్రధాని నరేంద్ర మోదీపై మహేష్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం బీసీలను వంచనకు గురిచేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలోనే బీసీలకు నిజమైన రాజకీయ ప్రాతినిధ్యం దక్కిందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 55 శాతానికి పైగా సర్పంచ్ పదవులను, మున్సిపల్ ఎన్నికల్లో 58 శాతం సీట్లను బీసీలకే కేటాయించామని లెక్కలతో సహా వివరించారు. రాబోయే రోజుల్లో మంత్రివర్గంలో, ఎమ్మెల్యే స్థానాల్లో, కార్పొరేషన్లలో బీసీల సంఖ్యను మరింత పెంచుతామని హామీ ఇచ్చారు.
బీసీల ఐక్యతకు పిలుపు…
కేంద్రంలో త్వరలోనే అధికారం మారుతుందని, మోదీ దిగిపోయి రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని మహేష్ గౌడ్ జోస్యం చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కుల సర్వే నిర్వహిస్తామన్నారు. బీసీ వర్గాలన్నీ చిన్న చిన్న కుల భేదాలను పక్కనపెట్టి ఏకం కావాలని, ఐక్యంగా పోరాడితేనే రాజకీయ సాధికారత సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాల బాగు కోసం ఈ పోరాటం తప్పనిసరి అని ఉద్ఘాటించారు.