- లక్షతో పట్టుబడిన రంగారెడ్డి డీఎంహెచ్ఓ
- 4 లక్షలతో దొరికిన జీహెచ్ఎంసీ సునీత
- జీతాలు లక్షల్లో… బుద్ధి మురికి గుంటలో!
సహనం వందే, హైదరాబాద్:
కష్టపడి చదివి ఉద్యోగాలు సాధిస్తే కన్నవాళ్ళు ఎంతో మురిసిపోతారు. ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుని ప్రమోషన్లు సాధిస్తే ఉన్నత స్థానాలకు వెళ్తారు, సమాజంలో గొప్ప గౌరవం పొందుతారు. కానీ అదే డబ్బు యావలో దిగజారిపోతే తమ కింద పనిచేసే అటెండర్లు కూడా కనీసం మనుషులుగా చూడరు. లక్షల్లో జీతాలు, అదనపు సౌకర్యాలు అనుభవిస్తూ లంచాలకు కక్కుర్తిపడి ఏసీబీకి పట్టుబడిన ఇద్దరు మహిళా అధికారుల తీరు చూస్తే ఎవరికైనా అసహ్యం వేయక మానదు.
జిల్లా అధికారికి పైసల పిచ్చి…
రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య అధికారి స్వర్ణకుమారి కథే చూద్దాం. జిల్లా పెద్ద అధికారి అయిన ఈమె కక్కుర్తి చూస్తే మతిపోవాల్సిందే. తన వద్ద పనిచేసే హెల్త్ ఇన్స్పెక్టర్, డ్రైవర్‌తో చేతులు కలిపి అవినీతి అక్రమాలకు తెరలేపింది. మూతపడిన ఒక ఫిజియోథెరపీ కేంద్రాన్ని తిరిగి తెరిచేందుకు లంచం డిమాండ్ చేసి చివరికి ఏసీబీ అధికారుల వలలో చిక్కుకుంది. హోదాకు తగ్గట్టు నడుచుకోవాల్సిన అధికారిణి ఇలా దిగజారిపోవడం ఘోరం.

4 లక్షలు లంచం తీసుకుంటూ…
ఇక మరో అధికారిణి జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్న తులసీరామ్ సునీత. ఈమె ప్రస్తుతం జోనల్ కార్యాలయంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భవన నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించిన ఒక బిల్డర్‌కు అనుకూలంగా పనిచేసేందుకు ఈమె లంచం డిమాండ్ చేశారు. అందులో అడ్వాన్స్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
చివరికి మిగిలింది కన్నీళ్లే
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన మరుక్షణంలో సునీత షాక్‌కు గురై బోరున విలపించారు. తలెత్తుకుని దర్జాగా ఉద్యోగం చేస్తూ సమాజంలో బతకాల్సిన చోట, ఇలాంటి అధికారులు లంచాలకు అలవాటు పడి తమ పరువును తామే తీసుకుంటున్నారు. చివరకు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంటున్నారు.
అటెండర్ కూడా గౌరవించని బతుకులు
ప్రభుత్వం నెలకు జీతాలు ఇస్తున్నా, సౌకర్యాలు కల్పిస్తున్నా ఈ అధికారులకు ఆశ చావడం లేదు. వృత్తిపరంగా అవినీతికి అలవాటు పడి అక్రమార్జన బాట పట్టడం వల్ల చివరికి జైలు పాలవుతున్నారు. సమాజంలో పరువు పోవడమే కాకుండా, కనీసం పనిచేసే చోట అటెండర్లు కూడా గౌరవించని స్థితికి చేరుకుంటున్నారు.