- వినీత్ జోషిపై వేటు… గంగ్వార్ నియామకం
- విద్యార్థి ఉద్యమంపై నీళ్లు చల్లే ప్రయత్నం
- విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సీటుకు భద్రత
సహనం వందే, న్యూఢిల్లీ:
దేశాన్ని కుదిపేస్తున్న నీట్ పేపర్ లీక్ వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను తొలగించాలని నిరసనకారులు గొంతుకలు చించుకుంటుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం అనూహ్య రీతిలో చక్రం తిప్పింది. మంత్రిని అలాగే ఉంచి, తెరవెనుక ఉండే విద్యాశాఖ కార్యదర్శిపై వేటు వేసింది. విద్యార్థులు, యువజన సంఘాలు, సీజేపీ ఆందోళనలతో దేశ రాజధానితో సహా దేశవ్యాప్తంగా నిప్పులు చెరుగుతున్న తరుణంలో ఈ పరిణామం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వంలోని పెద్దల మెడకు చుట్టుకుంటున్న ఈ కుంభకోణం ఉచ్చును తప్పుదోవ పట్టించేందుకే ఈ ఎత్తుగడ వేశారన్న విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి.
విద్యాశాఖలో భారీ ప్రక్షాళన అస్త్రం
దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇప్పుడు నీట్ పరీక్షల లీకేజీ అంశమే హాట్ టాపిక్ అయిపోయింది. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కావడంతో లక్షలాది మంది రోడ్ల మీదకు వచ్చి ఆందోళన బాట పట్టారు. పరీక్షా వ్యవస్థలోని లోపాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ తీరును నిలదీస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. నిరసనకారులు కేవలం ఆందోళనలకే పరిమితం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సరిగ్గా ఈ సున్నితమైన సమయంలోనే కేంద్ర ప్రభుత్వం పరిపాలనా పరంగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది.
కదలకుండా కూర్చున్న మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
నీట్ అక్రమాలు, పేపర్ లీకేజీల కారణంగా విద్యార్థులు, యువజన సంఘాల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. నిరసనకారులు కేవలం ప్రదర్శనలతో ఆగకుండా ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల జవాబుదారీతనాన్ని నిలదీస్తున్నారు. ఎగ్జామినేషన్ సిస్టమ్‌లో సమూల ప్రక్షాళన జరగాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ విద్యాసంక్షోభానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలని లేదా ఆయన్ని బర్తరఫ్ చేయాలని అందరూ గట్టిగా కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం మంత్రిని కాపాడుతూనే దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇందులో భాగంగానే ఇప్పటివరకు విద్యాశాఖ కార్యదర్శిగా కొనసాగిన వినీత్ జోషిని ఆ బాధ్యతల నుంచి తప్పించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
తెరపైకి నరేష్ గంగ్వార్
వినీత్ జోషి స్థానంలో 1994 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నరేష్ గంగ్వార్ ను కేంద్రం కొత్త విద్యాశాఖ కార్యదర్శిగా నియమించింది. రాజస్థాన్ కేడర్‌కు చెందిన గంగ్వార్ ఇప్పటివరకు కేంద్రంలోని మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ మంత్రిత్వ శాఖలో పశుసంవర్ధక విభాగానికి కార్యదర్శిగా సేవలు అందించారు. ఇప్పుడు ఆయన్ను నేరుగా అత్యంత సున్నితమైన, ప్రతిష్టాత్మకమైన శాఖకు కార్యదర్శిగా బదిలీ చేశారు. దేశం మొత్తం ఇప్పుడు విద్యావ్యవస్థ వైపు చూస్తున్న సమయంలో నరేష్ గంగ్వార్ భుజాలపై భారీ బాధ్యత పడింది.
ఇదొక తూతూ మంత్రమేనా?
ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న ఈ చర్యలు ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కేవలం కార్యదర్శులను మార్చడం వల్ల దశాబ్దాలుగా పాతుకుపోయిన అవినీతి వేర్లు తొలగిపోతాయా లేక ఇదొక తంతు మాత్రమేనా అని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నిరసనకారులు మాత్రం పేపర్ లీకేజీలకు పాల్పడిన అసలు సూత్రధారులను పట్టుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుండటంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది.