- స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు కారణం
- ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
- దళిత స్పీకర్ పై కుల దురహంకారమా?
- తెలంగాణలో రాజకీయ దుమారం
సహనం వందే, హైదరాబాద్:
హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ నాటకీయ పరిణామం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అరెస్ట్ తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉద్రిక్తత వాతావరణం…
ఎమ్మెల్సీ తాత మధు సోమవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. పత్రికలో రాయలేని భాషలో ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. దీంతో అధికార పార్టీ ఆగ్రహంతో ఉంది. ఈ నేపద్యంలో మంగళవారం తెల్లవారుజాము నుంచే ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రాంతంలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం అలుముకుంది. పోలీసుల మోహరింపుతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. భద్రతా బలగాల వలయాల మధ్య ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. అరెస్ట్ సమయంలో జరిగిన తోపులాటతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. నిరసన తెలుపుతున్న నాయకులను సైతం పోలీసులు ఈడ్చిపారేసినట్లు గులాబీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
రాజకీయ దుమారం
తాతా మధును అరెస్టు చేసిన పోలీసులు… అనంతరం ఆయనను నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరు పరుస్తారు. తాతా మధు అరెస్ట్‌తో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రతిపక్ష గొంతును నొక్కే ప్రయత్నంలో భాగంగానే పోలీసులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఈ ఘటనపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. రాబోయే రోజుల్లో ఈ అంశం మరింత పెద్ద ఉద్యమానికి దారితీసే అవకాశం ఉంది.
భవిష్యత్ పరిణామాలు
ఈ మొత్తం ఉదంతంపై న్యాయపోరాటం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధమవుతున్నారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగే అవకాశం ఉంది. అధికార పార్టీ అరాచకాలను ఎండగట్టడంలో ఈ సంఘటన ఒక మైలురాయిగా మారుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వానికి తగిన మూల్యం తప్పదని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి.