ఎస్‌బీఐలో 12 వేల కొత్త ఉద్యోగాలు – దేశంలోనే అత్యంత భారీ రిక్రూట్మెంట్

SBI Recruitment
  • కొత్తగా 250 బ్రాంచ్‌ల ఏర్పాటు
  • వినియోగదారులకు మరిన్ని సేవలే లక్ష్యం
  • ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి వెల్లడి

సహనం వందే, న్యూఢిల్లీ:

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఇప్పుడు తన సర్వీసులను మరింత వేగవంతం చేయడానికి నడుం బిగించింది. భారీగా కొత్త ఉద్యోగాలు కల్పించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ఆ వివరాలను వెల్లడించారు.

12 వేల కొత్త ఉద్యోగాలు…
ఎస్‌బీఐ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 12 వేల మంది కొత్త ఉద్యోగులను తీసుకోవాలని ప్రణాళిక సిద్ధం చేసింది. నిరుద్యోగులకు ఇది నిజంగానే అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. క్లరికల్, ఆఫీసర్ కేడర్లలో ఈ నియామకాలు భారీగా ఉండబోతున్నాయి.

SBI Notification

ప్రతి ఏడాది కొత్త ఉద్యోగాలు…
గతేడాది ఎస్‌బీఐ ఏకంగా 25 వేలకు పైగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. అందులో 4,640 మంది ఆఫీసర్లు, 19,340 మంది అసోసియేట్లు, 1,653 మంది కాంట్రాక్ట్ సిబ్బంది ఉన్నారు. అయితే ఆ సమయంలో దాదాపు 1,500 మంది స్పెషలిస్ట్ ఐటీ అధికారులను ప్రత్యేకంగా తీసుకున్నారు. కానీ ఈ ఏడాది ఐటీ విభాగంలో అంత భారీ సంఖ్యలో నియామకాల అవసరం లేదని చైర్మన్ స్పష్టం చేశారు.

ఇప్పటికే 2.45 లక్షల ఉద్యోగులు…
ప్రస్తుతం ఎస్‌బీఐలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య రెండున్నర లక్షలకు పైమాటే. సరిగ్గా చెప్పాలంటే 2026 మార్చి నాటికి బ్యాంక్ లో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య 2.45 లక్షలు ఉన్నారు. ఇంతటి విశాలమైన నెట్‌వర్క్ ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ఇంకా కొన్ని ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు అందాల్సిన అవసరం ఉంది. కొత్తగా ఏర్పడుతున్న కాలనీలు, రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతాలలో వినియోగదారులకు మరింత చేరువ కావాలని బ్యాంక్ భావిస్తోంది.

250 కొత్త బ్రాంచ్‌లు…
ఈ విస్తరణలో భాగంగానే కొత్త ఆర్థిక సంవత్సరంలో మరో 250 కొత్త బ్రాంచ్‌లను ప్రారంభించనున్నారు. కేవలం కొత్త శాఖలను తెరవడమే కాకుండా ఇప్పటికే ఉన్న బ్రాంచ్‌ల పనితీరును కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. కొన్ని శాఖలను రేషనలైజ్ చేస్తూ, నికరంగా ప్రతి సంవత్సరం 200 నుండి 250 బ్రాంచ్‌లు కొత్తగా ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు. దీనివల్ల సామాన్య ప్రజలకు బ్యాంక్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయి. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎంతో పారదర్శకంగా ఉంటుందని, అర్హులైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశమని చైర్మన్ తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ వెన్నెముకగా ఉన్న ఎస్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం నిరుద్యోగ యువతలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.

పది లక్షల కోట్ల హౌసింగ్ లోన్…
కేవలం ఉద్యోగాలు, బ్రాంచ్‌ల పెంపు మాత్రమే కాకుండా ఎస్‌బీఐ ఇతర వ్యాపార రంగాల్లోనూ దూసుకుపోతోంది. ముఖ్యంగా గృహ రుణాల విభాగంలో ఎస్‌బీఐ ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతోంది. త్వరలోనే ఈ హౌసింగ్ లోన్ పోర్ట్‌ఫోలియో పది లక్షల కోట్ల రూపాయల మైలురాయిని దాటబోతుండటం విశేషం. గృహ రుణ మార్కెట్లో దాదాపు 28 శాతం వాటాను కలిగి ఉంటూ వినియోగదారుల మొదటి ఎంపికగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా 400 పైగా ప్రత్యేక హోమ్ లోన్ ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా రుణాలు మంజూరు చేయడాన్ని చాలా సులభం చేశారు. ఒకవైపు ఉద్యోగాల కల్పన, మరోవైపు దేశవ్యాప్తంగా బ్రాంచ్‌ల విస్తరణతో ఎస్‌బీఐ దూసుకుపోతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగానికి ఇది నిజంగా ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *