ఇంట్లో రోబోల దొంగ చూపులు – గూఢచర్యం చేస్తున్న ఏఐ వాక్యూమ్ క్లీనర్

Robo(AI) Vacuum Cleaners
  • ముంచుకొస్తున్న ముప్పు… గోప్యత గల్లంతు
  • భద్రత గాలికి… ఇంటిని శాసించే యంత్రాలు
  • భౌతిక ప్రపంచంలోకి ఏఐ… జాగ్రత్త సుమా!

సహనం వందే, హైదరాబాద్:

ఇంట్లోని రోబో వాక్యూమ్ క్లీనర్ లేదా ఆటోమేటిక్ మిషన్ మనుషులను క్షణక్షణమూ గమనిస్తున్నాయి. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించే ఈ భయానక నిజం ఇప్పుడు ఇళ్లలోకి, ఆఫీసుల్లోకి ప్రమాదాలను తెస్తోంది. టెక్నాలజీ ముసుగులో వస్తున్న ఈ పెను ముప్పును ముందుగానే పసిగట్టి అప్రమత్తం కాకపోతే మనలను మనమే ప్రమాదంలోకి నెట్టుకున్నట్టవుతుంది.

భౌతిక ప్రపంచంలోకి ఏఐ
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ వేగంగా మారుతోంది. ఏఐ అనేది కేవలం కంప్యూటర్ స్క్రీన్లకే పరిమితం కాకుండా నేరుగా భౌతిక ప్రపంచంలోకి వచ్చింది. రోబోలు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, డ్రోన్లు వంటి ఫిజికల్ ఏఐ ఉత్పత్తులు మార్కెట్లోకి పెద్ద ఎత్తున వస్తున్నాయి. రీసెర్చ్ లేబరేటరీలలో ఒక సరికొత్త రోబోను తెరిచి చూస్తే అందులో ఎవరికీ అంతుచిక్కని రహస్య కంప్యూటర్లు, విదేశీ సర్వర్లతో నిరంతరం కనెక్షన్లు ఉండటం వెలుగుచూసింది. డబ్బులు పెట్టి కొనుక్కున్న మెషీన్ లోపల ఏం చేస్తోందనే కనీస సమాచారం కూడా వినియోగదారుడికి దక్కడం లేదు.

చిన్న పొరపాటే పెద్ద ప్రమాదం
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లేదా స్మార్ట్ డివైజెస్‌లో భద్రతా సమస్యలు కొత్తేమీ కావు. కానీ ఫిజికల్ ఏఐ విషయానికి వచ్చేసరికి పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు ఒక పనిని చేసేటప్పుడు ప్రతి దశలోనూ చిన్న చిన్న తప్పులు చేసే అవకాశం ఉంటుంది. టెక్స్ట్ బేస్డ్ ఏఐ తప్పు చేస్తే కేవలం సమయం వృధా అవుతుంది. కానీ ఫిజికల్ ఏఐలో ఈ చిన్న తప్పు ఒక రోబో అదుపుతప్పి మనుషులను ఢీకొనేలా లేదా ప్రమాదంలో పడేసేలా చేస్తుంది.

సాఫ్ట్‌వేర్ ఫ్రేమ్‌వర్క్‌లో రంధ్రాలు
ఆధునిక రోబోటిక్స్‌లో ఎక్కువగా వాడుతున్న రోస్2 అనే సాఫ్ట్‌వేర్ ఫ్రేమ్‌వర్క్‌లో ఎన్నో ప్రమాదకరమైన లోపాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. రోబోలోని వివిధ భాగాలు, సెన్సార్లు, మోటార్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకునే కమ్యూనికేషన్ లేయర్‌లోనే భద్రతా లోపాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిగా ఇండస్ట్రియల్ రోబోలు, హాస్పిటల్ సిస్టమ్స్, మిలిటరీ ప్లాట్‌ఫారమ్‌లు ఈ సాఫ్ట్‌వేర్ మీదే నడుస్తున్నాయి. ఏఐ ఏజెంట్లు ఒక కనెక్ట్ చేసిన సిస్టమ్ నుంచి మరో సిస్టమ్‌లోకి సులభంగా దూసుకెళ్లగలవని సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొరవడిన సమగ్ర పర్యవేక్షణ
ఫిజికల్ ఏఐ సెక్యూరిటీ అనేది ప్రస్తుతం ఎవరికీ అంతుచిక్కని ఒక క్లిష్టమైన సమస్యగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ పరిశోధకులు కేవలం సాఫ్ట్‌వేర్ ప్రవర్తనపై దృష్టి పెడతారు. సైబర్ సెక్యూరిటీ నిపుణులు నెట్‌వర్క్‌ల గురించి ఆలోచిస్తారు. రోబోటిక్స్ ఇంజనీర్లు మెకానికల్ పనితీరుపై మాత్రమే శ్రద్ధ పెడతారు. ఈ మూడూ కలిసే చోట ఒకే ఒక ఏఐ మోడల్ ఉండి రోబోను నడిపిస్తుంది. కానీ ఏ సంస్థలోనూ ఈ మూడింటిని కలిపి పర్యవేక్షించే ఒక సమగ్రమైన ప్రత్యేక బృందం ఉండదు. ఫలితంగా భద్రతా పరమైన లోపాలన్నీ నేరుగా సాధారణ వినియోగదారుడి నెత్తిమీద పడుతున్నాయి.

హ్యాకర్ల చేతికి సెన్సార్లు
ఈ ఫిజికల్ ఏఐ వ్యవస్థలో అత్యంత కీలకమైన, ప్రమాదకరమైన భాగం సెన్సర్లు. జీపీఎస్, లైడార్, కెమెరాలు, మైక్రోఫోన్లు వంటి సెన్సార్లు రోబోకు కళ్ళు, చెవులుగా పనిచేస్తాయి. ఏఐ మోడల్‌ను నేరుగా తాకకుండానే కేవలం ఈ సెన్సర్లను మాత్రమే హ్యాక్ చేయడం లేదా తప్పుదారి పట్టించడం చాలా సులభం. విజన్ లాంగ్వేజ్ యాక్షన్ సిస్టమ్స్‌లో దాగి ఉండే హిడెన్ బ్యాక్‌డోర్స్ సాధారణంగా పైకి ఏమాత్రం కనిపించవు. రోబో ఎంతో ఆరోగ్యంగా, సరిగ్గా పనిచేస్తున్నట్లు నటిస్తూనే హ్యాకర్లు కోరుకున్న సమయంలో రహస్యంగా ప్రమాదకరమైన పనులను చేసే అవకాశం ఉంటుంది.

రిమోట్ ఆపరేటర్ల ముప్పు
ఆటోమేటెడ్ వెహికల్స్, రోబోలు పూర్తిగా స్వతంత్రంగా పనిచేస్తాయని నమ్మడం అబద్ధం. మార్కెట్లో ఉన్న చాలా ఫిజికల్ ఏఐ డివైజ్‌ల వెనుక రిమోట్ ఆపరేటర్లు ఉంటారు. ఎక్కడైనా రోబో ఆగిపోయినా లేదా సమస్య వచ్చినా వేల కిలోమీటర్ల దూరంలో మరో దేశంలో కూర్చున్న మనుషులు వాటిని రిమోట్ ద్వారా కంట్రోల్ చేస్తుంటారు. టెస్లా, వేమో వంటి పెద్ద సంస్థలకు చెందిన రిమోట్ ఆపరేటర్లలో కొందరు విదేశాలలో ఉంటూ ఆపరేట్ చేస్తారు. రిమోట్ ఆపరేటర్ కనెక్షన్ కనుక హ్యాక్ అయితే, ఆ రోబో కెమెరా ద్వారా ఇళ్లలోని ప్రైవసీ మొత్తం హ్యాకర్ల చేతికి వెళ్ళిపోతుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *