- నేరాలపై షో చేసి అడ్డంగా బుక్కైన యాంకర్
- 750 కేజీల మత్తు పదార్థాలు స్వాధీనం
- ఈజిప్ట్ తీర్పు… అంతర్జాతీయ సంచలనం
సహనం వందే, ఈజిప్ట్:
టీవీ స్క్రీన్ మీద నేరస్థుల గుట్టు రట్టు చేస్తూ క్రైమ్ స్టోరీలతో ప్రజలను అలర్ట్ చేసిన ఒక పాపులర్ యాంకర్ నిజ జీవితంలోనే ఒక పెద్ద డ్రగ్ క్వీన్ గా మారితే ఎలా ఉంటుంది? వినడానికి ఏదో సినిమా కథలా ఉంది కదూ! కానీ ఇది నిజంగా జరిగిన సంఘటన. ఈజిప్ట్ దేశంలో ఎంతో ఫేమస్ అయిన ఒక టీవీ ప్రెజెంటర్ కి అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించి అందరినీ షాక్ కి గురిచేసింది. అసలు ఆమె ఎవరు, ఏం చేసింది, టీవీ స్టార్ నుండి ఉరిశిక్ష పడే వరకు కథ ఎలా మారింది?
పెద్ద డ్రగ్స్ గ్యాంగ్‌కు లీడర్…
ఈజిప్ట్ దేశంలో సారా ఖలీఫా అంటే తెలియని వారు ఉండరు. 39 ఏళ్ల సారా ఖలీఫా మిషన్ ఇంపాజిబుల్ అనే ఒక క్రైమ్ షో ద్వారా ఎంతో ప్రసిద్ధి చెందింది. సమాజంలో జరిగే నేరాలు, క్రైమ్ నెట్‌వర్క్‌ల గురించి ఈమె తన ప్రోగ్రామ్‌లో ఎంతో ధైర్యంగా చెప్పేది. బుల్లితెరపై నేరస్థులను హెచ్చరించే ఈమె, తెర వెనుక మాత్రం ఒక పెద్ద డ్రగ్స్ గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరించిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. టీవీ ప్రాఫిట్‌తో పాటు గ్లామర్ ప్రపంచంలో వెలిగిపోయిన సారా ఇప్పుడు ఉరితాడు ముందుకు వచ్చి నిలబడింది.

11 మందికి ఈజిప్ట్ కోర్టు ఉరిశిక్ష…
సారా ఖలీఫాతో పాటు మొత్తం 11 మందికి ఈజిప్ట్ కోర్టు ఉరిశిక్ష విధించింది. విదేశాల నుంచి అత్యంత ప్రమాదకరమైన మత్తు పదార్థాల ముడి సరుకును దిగుమతి చేసుకుని స్థానికంగా డ్రగ్స్ తయారు చేసి విక్రయించడమే వీరి ప్రధాన వ్యాపారం. ఈ గ్యాంగ్ అత్యంత పగడ్బందీగా నెట్వర్క్ నడుపుతూ కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు అలవాటు పడింది. ఈ రాకెట్లో సారా ఖలీఫా కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. నిఘా వర్గాల పక్కా సమాచారంతో దాడులు చేసిన అధికారులు, వీరి వద్ద నుంచి ఏకంగా 750 కిలోల మత్తు పదార్థాలను, వాటి తయారీకి వాడే రా మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో వందల కోట్లలో ఉంటుంది.
మరణశిక్ష అమలుకు ప్రత్యేక ప్రక్రియ…
ఈజిప్ట్ చట్టాల ప్రకారం మరణశిక్ష అమలు చేయాలంటే ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఉంటుంది. కోర్టు తీర్పు ఇచ్చినా, ఆ దేశపు అత్యున్నత మత గురువు ‘గ్రాండ్ ముఫ్తీ’ అనుమతి తప్పనిసరి. కిందటి నెలలోనే ఈ తీర్పు వచ్చినప్పటికీ గ్రాండ్ ముఫ్తీ నుంచి లీగల్ ఒపీనియన్ వచ్చే వరకు వేచి చూసి ఆయన ఆమోదం తెలిపిన తర్వాతే కోర్టు మరణశిక్షను అధికారికంగా ధృవీకరించింది.
గతేడాది 492 మందికి మరణశిక్షలు…
ఈజిప్ట్ దేశంలో డ్రగ్స్, తీవ్రమైన నేరాలపై చాలా కఠినమైన చట్టాలు ఉంటాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం గత సంవత్సరం ఈజిప్ట్‌లో 492 మందికి మరణశిక్షలు పడ్డాయి. వాటిలో 23 శిక్షలను అధికారులు ఇప్పటికే అమలు చేశారు. డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి నేరాలను అక్కడ ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తుంది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు మాత్రం ఈ శిక్షలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రాణనష్టం లేని డ్రగ్స్, రేప్ వంటి కేసులలో ఉరిశిక్షలు విధించడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వాదిస్తోంది. అయితే తమ దేశ భద్రత, యువత భవిష్యత్తు దృష్ట్యా డ్రగ్ రాకెట్లపై ఉక్కుపాదం మోపుతామని ఈజిప్ట్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఎంతటి స్టార్ హోదా ఉన్నా చట్టం ముందు అందరూ సమానులే అని ఈ ఈజిప్ట్ ఘటన నిరూపించింది.