- దివ్యదర్శనానికి పోటెత్తుతున్న భక్తులు
- ఈ ఏడాది ఇప్పటికే 24 వేల మంది రాక
- ఆకాశ మార్గంలో సుందర ప్రయాణం
- కఠినమైన హిమాలయ బాటలో పయనం
- వసతులు కల్పిస్తున్న భారత్, చైనా దేశాలు
- మహాశివుడి దివ్య ధామంతో జీవితం ధన్యం
సహనం వందే, టిబెట్:
మహాశివుడి దివ్య ధామమైన కైలాస మానససరోవరం వైపు భక్తులు పోటెత్తుతున్నారు. కఠినమైన హిమాలయాల ప్రయాణానికి ఈ ఏడాది వేల సంఖ్యలో భక్తులు క్యూ కడుతున్నారు. కోవిడ్ విరామం తర్వాత గత ఏడాది పునఃప్రారంభమైన ఈ యాత్రలో రికార్డు స్థాయిలో భక్తులు పాల్గొంటూ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు.
కైలాస మానససరోవర యాత్ర విశేషాలు…
చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఉన్న పవిత్రమైన కైలాస మానససరోవర యాత్ర ప్రతి హిందువు జీవితంలో ఒకసారైనా చేయాలని కలలు కనే అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం. సముద్ర మట్టానికి దాదాపు 15 వేల అడుగుల ఎత్తులో సాగే ఈ ప్రయాణం కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో పరీక్షగా ఉంటుంది. ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటివరకు సుమారు 24 వేల మందికి పైగా భారతీయ భక్తులు ఈ పవిత్ర యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. గత ఐదేళ్ల పాటు కోవిడ్, ఇతర కారణాల వల్ల నిలిచిపోయిన ఈ యాత్ర గత ఏడాది పునఃప్రారంభం కాగా అప్పట్లో 20,750 మంది మాత్రమే పాల్గొన్నారు. కానీ ఈసారి ఆ సంఖ్య మరింత పెరగడం విశేషం.
ఆకాశ మార్గంలో సుందర ప్రయాణం
ఈ సుదూర ప్రాంతానికి చేరుకోవడానికి భక్తులు ప్రధానంగా లసా మీదుగా అలీపులాన్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి బస్సుల ద్వారా మానససరోవర లేక్ వైపు ప్రయాణం సాగుతుంది. టిబెటన్ పీఠభూమి మీదుగా సాగే ఈ విమాన ప్రయాణం ప్రపంచంలోనే అత్యంత సుందరమైన, కఠినమైన మార్గాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. కిటికీ గుండా కనిపించే మంచుతో కప్పబడిన సుందరమైన పర్వతాలు నీటి కొలనులు చూసేవారికి కనువిందు చేస్తాయి. చైనా, భారత ప్రభుత్వాలు భక్తుల కోసం ఈసారి అనేక కొత్త వసతులను, మెరుగైన ఏర్పాట్లను అందుబాటులోకి తెచ్చాయి.
రాక్షస తాల్ ఆధ్యాత్మిక రహస్యం
కైలాస యాత్ర మార్గంలో అత్యంత ఆసక్తికరమైన ప్రదేశాలలో రాక్షస తాల్ ఒకటి. ఇది మానససరోవర లేక్‌కు సరిగ్గా పక్కనే ఉండి ఒక చిన్న నేలపట్టీ చేత వేరు చేసి ఉంటుంది. మానససరోవర నీరు ఎంతో పవిత్రమైనదైనప్పటికీ రాక్షస తాల్ నీరు మాత్రం ఉప్పు నీటితో కూడి ఉంటుంది. హిందూ, బౌద్ధ మతాలలో ఈ రెండు జలాశయాలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఇక్కడి గాలి చాలా పల్చగా ఉండటం ఈదురు గాలులు తీవ్రంగా వీయడం వల్ల వాతావరణం చాలా కఠినంగా మారుతుంది. అయినప్పటికీ భక్తులు తమ భక్తి శ్రద్ధలతో ఈ అసాధ్యమైన సవాల్‌ను సులువుగా ఎదుర్కొంటారు.
మంచినీటి కొలను వద్ద తన్మయత్వం
సముద్ర మట్టానికి 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న టర్కోయిజ్ రంగు నీటితో కూడిన మానససరోవర లేక్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మంచినీటి కొలనులలో ఒకటి. ఈ పవిత్ర జలాల వద్దకు భారతదేశం నలుమూలల నుంచి విభిన్న వయసుల భక్తులు వచ్చి తమ తన్మయత్నాన్ని చాటుకుంటున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ రాజేంద్ర రాజ్ పాల్ తన పుట్టినరోజును మానససరోవరం వద్దే జరుపుకోవడం తన జీవితంలో మరువలేని అనుభూతి అని తెలిపారు. దివ్యమైన అనుభూతిని ఇక్కడ అనుభవించామని భక్తులు ఎంతో భావోద్వేగంతో చెప్తున్నారు.
రికార్డుల కల సాకారం
కైలాస పర్వత చుట్టూ చేసే ప్రదక్షిణ లేదా పరిక్రమ సాధారణంగా రెండున్నర నుంచి మూడు రోజుల్లో పూర్తవుతుంది. భక్తులు నడవలేని పరిస్థితులలో పోనీ లేదా గుర్రాల సేవలను కూడా ఉపయోగించుకుంటారు. ఈ ప్రయాణంలో వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపిస్తూ అనేక మంది వృద్ధులు కూడా పాల్గొంటున్నారు. బెంగళూరు నుంచి వచ్చిన 68 ఏళ్ల కవలలు రాజశ్రీ జయంతి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ యాత్రను పూర్తి చేయడం ద్వారా తమ ఆరేళ్ల కల నిజమైందని ఆనందం వ్యక్తం చేశారు. కఠినమైన ఈ మార్గం కోసం వారు ముందుగానే ప్రాణాయామం, మానసిక శిక్షణ తీసుకోవడం విశేషం. ఈ ఏడాది మే నెల చివరి నుంచే యాత్ర ప్రారంభం కావడం వల్ల గత ఏడాది కంటే ఎక్కువ మంది భక్తులు పాల్గొంటున్నారు. హిమాలయాల మంచు శిఖరాల మధ్య భక్తులు సాగిస్తున్న ఈ ప్రయాణం సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుతోంది.