- ముస్లింను చేసుకున్నాక లెఫ్టిస్ట్ అయ్యిందట
- సోనాక్షి డ్రెస్సింగ్ జేబు దొంగలా ఉందని వ్యాఖ్య
- సెలబ్రిటీల పెళ్లిళ్లపై కంగనా వివాదాస్పదం
- సోషల్ మీడియాలో దుమారం… ఫ్యాన్స్ ఫైర్
సహనం వందే, న్యూఢిల్లీ:
సినిమా ఇండస్ట్రీలో వివాదాలు ఎప్పుడూ ఉండేవే అయినా కొందరు మాత్రం నిత్యం ఏదో ఒక బాంబు పేలుస్తూనే ఉంటారు. అందులో నటి కంగనా రనౌత్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆమె తోటి నటుల వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ నుంచి సోషల్ మీడియా వరకు పెద్ద దుమారమే రేపుతున్నాయి. హిందూ అమ్మాయిల వివాహాలు, రాజకీయాలపై ఆమె చేసిన కామెంట్లు తీవ్ర చర్చకు దారితీశాయి.
నటి కంగనా వివాదాస్పద వీడియో
నటిగా ఎంత పేరు తెచ్చుకున్నారో వివాదాస్పద వ్యాఖ్యలతో అంతకంటే ఎక్కువగా వార్తల్లో నిలిచే నటి కంగనా రనౌత్ తాజాగా విడుదల చేసిన ఒక కొత్త వీడియో నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వీడియోలో ఆమె నేరుగా పేర్లు చెప్పకపోయినా ఆమె చేసిన కామెంట్లు ఎవరిని ఉద్దేశించి ఉన్నాయనేది నెటిజన్లు ఇట్టే కనిపెట్టేశారు. సరిగ్గా నటి సోనాక్షి సిన్హా పెళ్లి జరిగిన తీరును ఆమె భర్త నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకునే కంగనా ఈ వ్యాఖ్యలు చేశారని అంతా గుసగుసలాడుతున్నారు.

ఇస్లామిస్ట్ వివాహాలపై సంచలన కామెంట్లు
ఆ వీడియోలో కంగనా రనౌత్ మాట్లాడుతూ ఇండస్ట్రీలోని కొందరు హిందూ మహిళలు మొదట్లో ఎంతో మోడరన్‌గా ఉంటారని… రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోరని అన్నారు. కానీ ఎప్పుడైతే వారు వేరే మతానికి చెందిన ఇస్లామిస్ట్ పురుషులను వివాహం చేసుకుంటారో అప్పుడే వారిలో సడన్‌గా రాజకీయ పరిజ్ఞానం వచ్చి పడుతుందని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా పెళ్లికి ముందు సాధారణంగా ఉండే ఆ అమ్మాయిలు పెళ్లయ్యాక పూర్తిగా లెఫ్టిస్ట్ భావజాలం వైపు ఎలా మారుతున్నారనే దానిపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముస్లింలను పెళ్లి చేసుకున్న తర్వాత కమ్యూనిస్టులుగా మారుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
హాఫ్ ప్యాంట్లపై జేబుదొంగ విమర్శలు
ఈ వీడియో విడుదల కావడానికి కొన్ని గంటల ముందే కంగనా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో మరో పోస్ట్ పెట్టి మరింత ఆజ్యం పోశారు. ఇండస్ట్రీలో ఉండే ఒక హిందూ మహిళ వేసుకునే బట్టల తీరును, ఆమె స్టైల్‌ను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సదరు నటి హాఫ్ ప్యాంట్లు తలకిందులుగా క్యాప్ పెట్టుకుని అచ్చం జేబుదొంగలా తిరుగుతుంటూ ఆమె చాలా ఘాటుగానే విమర్శించారు. ఈ పోస్ట్ చూసిన వెంటనే అందరూ ఇది సోనాక్షి సిన్హా గురించేనని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే సోనాక్షి ట్రెండ్‌కు తగినట్లుగా అలాంటి క్యాజువల్ వేర్స్ ఎక్కువగా వేస్తుంటారు.
రాజకీయ హిందూత్వ భావజాలం ప్రచారం
కంగనా రనౌత్ కేవలం సినిమాలతోనే కాకుండా రాజకీయాల్లోకి వచ్చాక తన హిందూత్వ భావజాలాన్ని మరింత గట్టిగా వినిపిస్తున్నారు. ఒక రాజకీయ నాయకురాలిగా మారిన తర్వాత ఆమె ప్రతి విషయాన్ని మతం రాజకీయాల కోణంలో చూడటం అలవాట్లు చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తోటి నటీమణుల వ్యక్తిగత జీవితాలను వారి వివాహాలను పబ్లిక్‌గా ఇలా టార్గెట్ చేయడం పట్ల సినీ వర్గాల నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా వేరే వారి పెళ్లిళ్ల గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో చెలరేగిన పెద్ద యుద్ధం
మరోవైపు సోనాక్షి సిన్హా అభిమానులు మాత్రం కంగనా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి వ్యక్తిగత జీవితం వారి ఇష్టమని ఇలా పబ్లిగ్గా వేరే వాళ్ళ పెళ్లిళ్ల గురించి నెగెటివ్‌గా మాట్లాడటం అనవసరమైన పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని వారు కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా కంగనా చేసిన ఈ తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక పెద్ద యుద్ధానికే తెరలేపాయి.