ఎల్‌నినో డెత్ అలర్ట్ – ఆరు నెలల్లో 4.5 లక్షల మంది బలి

El nino Effect - Climate Impact Lab Chicago Report
  • చికాగో వర్సిటీ క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ వెల్లడి
  • భూగోళాన్ని భయపెడుతున్న సూపర్ ఎల్‌నినో
  • ఇండియాలో 16 వేల మందికి మరణ శాసనం
  • రాబోయే రోజుల్లో 1.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత

సహనం వందే, హైదరాబాద్:

వాతావరణం రోజురోజుకూ ఎలా మారిపోతుందో గమనిస్తున్నారా? ఉన్నట్టుండి వర్షం పడుతుంది, అంతలోనే ఎండ మండిపోతుంది! రాబోయే ఆరు నెలల్లో వాతావరణ మార్పులు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ‘సూపర్ ఎల్ నినో’ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పెను విధ్వంసం సంభవించే ప్రమాదం ఉందంట! ఇది మన భారత్‌పై ఎలా ప్రభావం చూపబోతోందో చూద్దాం.

4.5 లక్షల మంది బలి…
అమెరికాకు చెందిన చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ సరికొత్త సంచలన నివేదికను విడుదల చేసింది. సాధారణ సంవత్సరంతో పోలిస్తే రాబోయే ఫిబ్రవరి నాటికి అధిక వేడి కారణంగా సుమారు నాలుగున్నర లక్షల మందికి పైగా అదనంగా మరణించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది కేవలం వేడి వల్ల వచ్చే ముప్పు మాత్రమే కాదని, మునుపెన్నడూ లేనంత తీవ్రమైన వాతావరణ మార్పులకు సంకేతమని హెచ్చరిస్తున్నారు.

El Nino Effect - Climate Impact Lab Report Chicago University Report

44 శాతం ఎండలు…
ఈసారి వస్తున్నది మామూలు ఎల్ నినో కాదు, దీనిని శాస్త్రవేత్తలు ‘సూపర్ ఎల్ నినో’ అని పిలుస్తున్నారు. భూ ఉపరితల సగటు ఉష్ణోగ్రత సాధారణం కంటే 1.2 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందంటున్నారు. దీంతో తీవ్రమైన ఎండలు ఉండే రోజుల సంఖ్య సాధారణం కంటే ఏకంగా 44 శాతం పెరుగుతుంది. ఇది కేవలం వేసవికి పరిమితం కాకుండా, రాబోయే శీతాకాలంలో కూడా తన ప్రతాపాన్ని చూపుతుంది. నేపాల్‌ను ముంచెత్తిన భయంకరమైన వరదల్లో చనిపోయిన వారి సంఖ్య కంటే దాదాపు 65 రెట్లు ఎక్కువ మంది చనిపోయే ప్రమాదం ఉంది.

ఇండియాలో 15,800 మరణాలు
ఈ విపత్తు ప్రభావం మన భారతదేశంపైనా తీవ్రంగా పడనుంది. చికాగో నివేదిక ప్రకారం మన దేశంలో దాదాపు 15,800 అదనపు మరణాలు నమోదయ్యే ప్రమాదం ఉంది. ప్రత్యేకించి డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు చలికాలంలోనే సగానికి పైగా మరణాలు సంభవించే ప్రమాదం ఉందట. చలికాలం ముగిసిన తర్వాత వచ్చే వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు మరింత తీవ్రమై ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

వివిధ దేశాల్లో దారుణాలు…
ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతంలో ఈ పరిస్థితి అత్యంత దారుణంగా మారే అవకాశం ఉంది. నైజీరియా, సూడాన్, నైజర్, చాద్ వంటి దేశాల్లో సుమారు 66,800 మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. నైజీరియా ఒక్క దేశంలోనే 31,400 మరణాలు సంభవించవచ్చని అంచనా వేశారు. ఇక ఇండోనేషియాలో 19,300 మరణాలు, బ్రెజిల్‌లో 13,300, ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయిలాండ్, కాంబోడియాలలో దాదాపు 19,400 అదనపు మరణాలు సంభవిస్తాయని అంచనా వేస్తున్నారు. మరో 20 సంవత్సరాల తర్వాత భూమిపై ఎలాంటి భయంకరమైన ఉష్ణోగ్రతలు ఉంటాయో, ఆ భవిష్యత్తు రూపాన్ని ఈ సూపర్ ఎల్ నినో మనకి ఇప్పుడే ప్రత్యక్షంగా చూపిస్తోందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

పేద దేశాలపై ప్రభావం…
గ్లోబల్ సౌత్ లేదా పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకే ఈ ఎల్ నినో వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. తీవ్రమైన వేడిని తట్టుకోవడానికి అవసరమైన ఎయిర్ కండిషనింగ్, చల్లని తాగునీరు, మెరుగైన వైద్య సదుపాయాలు అక్కడ సరిగ్గా ఉండవు. బయట కష్టపడి పనిచేసే కూలీలు, రైతులు, వృద్ధులు, చిన్న పిల్లలు ఈ ఎండ దెబ్బకు ఎక్కువగా బలవుతుంటారు. కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో మంచినీటి కేంద్రాలు, చల్లదనంతో కూడిన రిఫ్రెష్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో ఉపాధి హామీ, నిర్మాణ రంగానికి చెందిన కార్మికులకు పనివేళల్లో మినహాయింపులు లేదా విరామాలు ఇవ్వడం చాలా అత్యవసరం. ఆసుపత్రుల్లో ఎండదెబ్బ, డీహైడ్రేషన్ బాధితులకు తక్షణమే చికిత్స అందించేలా అత్యవసర వైద్య విభాగాలు సిద్ధంగా ఉండాలి.

ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ వార్నింగ్…
మనం ఎన్ని వేడి హెచ్చరికలు జారీ చేశామనేది ముఖ్యం కాదు, ప్రజల ప్రాణాలను ఎంత సమర్థవంతంగా కాపాడగలిగామనేదే అసలైన సిద్ధత అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ లో ప్రారంభమైన ఈ ఎల్ నినో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు 100 శాతం కొనసాగుతుందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ చెప్తోంది. కానీ దీని తీవ్రత, ప్రమాదాలు మాత్రం వచ్చే ఏడాది మధ్య వరకు వెంటాడుతూనే ఉంటాయి. ప్రకృతి ఇచ్చే హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తే మానవాళి ఎంత పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో ఈ రిపోర్ట్ చెప్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *