బీహారులో భగ్గుమన్న విద్యార్థి లోకం – జైళ్లలోని విద్యార్థుల విడుదలకు డిమాండ్

Students Protest at Bihar
  • నీట్ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై వేధింపు
  • పాట్నా వీధుల్లో హోరెత్తిన నినాదాలు
  • పోలీసుల అత్యుత్సాహం బట్టబయలు

సహనం వందే, పాట్నా:

నీట్ పేపర్ లీక్ కుంభకోణానికి వ్యతిరేకంగా గతంలో అరెస్టయిన విద్యార్థుల విడుదల కోసం పాట్నా వీధుల్లో వందలాది మంది మరోసారి రోడ్డెక్కడంతో బీహార్ రాజకీయం వేడెక్కింది. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడుతూ సీఎం నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించిన నిరసనకారులపై పోలీసులు నీటి ఫిరంగులను ప్రయోగించి అణచివేసే ప్రయత్నం చేశారు.

సీఎం నివాసం వద్ద ఉద్రిక్తత
నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తదితర సంఘాల జెండాలు పట్టుకున్న ఆందోళనకారులు మొదట గాంధీ మైదాన్‌లో భారీగా గుమిగూడారు. అక్కడి నుంచి నేరుగా ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి నివాసాన్ని ముట్టడించడానికి దూసుకెళ్లారు. గమ్యస్థానానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు భారీ బారికేడ్లను ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. జైళ్లలో మగ్గుతున్న విద్యార్థులందరినీ వెంటనే విడుదల చేయాలని, వారిపై నమోదు చేసిన క్రిమినల్ కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జైళ్ల నుంచి విడుదలైన వారి జాబితాతో పాటు ఇంకా లోపల ఉన్న వారి వివరాలతో కూడిన జాబితాను తమకు చూపించాలని నిరసనకారులు అధికారులను నిలదీశారు.

Bihar Students Protest

బంద్ నాటి అణచివేత…
గత నెలలో నాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ నిర్వహించిన రాష్ట్రవ్యాప్త బంద్ సమయంలో బీహార్ పోలీసులు దాదాపు 600 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో మైనర్లుగా తేలిన దాదాపు సగం మందిని వదిలిపెట్టగా… మిగిలిన వారిని నేరుగా జైళ్లకు తరలించారు. ఈ అరెస్టులపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు నేహా నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ వినయ్ కుమార్‌ను కలిసింది. ఆ భేటీ తర్వాత విద్యార్థులపై ఉన్న అన్ని క్రిమినల్ కేసులను ఉపసంహరిస్తామని, జైళ్లలో ఉన్న వారిని విడుదల చేస్తామని రాష్ట్ర హోంశాఖ అధికారికంగా ప్రకటించింది. కానీ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పడంతో విద్యార్థుల్లో అసంతృప్తి కట్టలు తెంచుకుంది.

ఇళ్లకు తిరిగి రాని విద్యార్థులు
ప్రభుత్వం ఇచ్చిన హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, తమ స్నేహితులు ఇంకా ఇళ్లకు తిరిగి రాలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల మాటలు పచ్చి అబద్ధమని, జైళ్లలో ఉన్న తమ సహచరుల భద్రతపై తీవ్ర ఆందోళన చెందుతున్నామని ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఏకే 47 రైఫిల్‌తో విద్యార్థులపై కాల్పులు జరిపిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారని, అయితే తన కింది సిబ్బందిని ఉన్మాదులుగా మార్చిన ఎస్పీపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆ కార్యకర్త డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకు పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్, బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ రామ్ మద్దతు తెలిపారు.

పోలీసుల జోక్యం అరెస్టుల పర్వం
నిరసనకారులను అణచివేసే క్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ రామ్‌తో పాటు పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని తరలించారు. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఒకవైపు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై నీటి ఫిరంగులు ప్రయోగించడం, మరోవైపు హామీలిచ్చి మోసం చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శకులు మండిపడుతున్నారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *