గూగుల్‌కు గూబగుయ్ – టెక్ దిగ్గజంలో ఉద్యోగుల పోరాటం

Google Employees Protest against AI
  • సీఈఓ సుందర్ పిచాయ్ కు షాక్
  • టెక్ రంగంలో ఉద్యోగ భద్రతపై నీలినీడలు
  • ఏఐ మోజులో పొట్టగొడుతున్న కంపెనీ
  • ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ అగ్రహం

సహనం వందే, అమెరికా:

కృత్రిమ మేధస్సు పేరుతో టెక్ ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న సంస్థ తన సొంత కార్మికులనే రోడ్డున పడేస్తున్న వైనంపై ఇప్పుడు తీవ్ర చర్చ సాగుతోంది. యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరిని ఎండగడుతూ కార్మిక సంఘాలు నేరుగా రణరంగంలోకి దిగాయి.

ఏఐ అనర్థాలు… ఉద్యోగాల కోత
ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. అన్ని కంపెనీలు ఏఐ టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్నాయి. కానీ ఈ మార్పు టెక్ ఉద్యోగులకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ లో గత కొంతకాలంగా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కంపెనీ లాభాల్లో దూసుకుపోతున్నప్పటికీ… ఖర్చులను తగ్గించుకునే పేరుతో ఉద్యోగులపై వేటు వేస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఆల్ఫాబెట్ వర్కర్స్ చారిత్రక పోరాటం
ఈ క్రమంలోనే ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ రంగంలోకి దిగింది. గూగుల్ చరిత్రలోనే ఉద్యోగుల భద్రత కోసం జరిగిన అత్యంత పెద్ద నిరసన ఇదే కావడం విశేషం. సుమారు 100 మంది ఉద్యోగులు నేరుగా గూగుల్ క్యాంపస్ వెలుపుల నిరసనకు దిగారు. నల్లటి టీషర్టులు ధరించి తమ డిమాండ్లతో కూడిన పెద్ద బ్యానర్లను ప్రదర్శించారు. కంపెనీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన తమకు ఈ రోజు ఉద్యోగ భద్రత లేకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సుందర్ పిచాయ్ ఆఫీసులో ఫిర్యాదు
ఈ నిరసన కేవలం ప్రదర్శనలతోనే ఆగిపోలేదు. నేరుగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆఫీసుకే వెళ్లి ఆ పిటిషన్ ను అందించారు. గూగుల్ లో పనిచేస్తున్న 4,500 మందికి పైగా ఉద్యోగులు ఈ పిటిషన్ పై సంతకాలు చేయడం గమనార్హం. ఏఐ టెక్నాలజీ పేరుతో కంపెనీ చేస్తున్న మార్పుల భారాన్ని ఉద్యోగులు ఎందుకు మోయాలని యూనియన్ గట్టిగా ప్రశ్నిస్తోంది. కంపెనీ సంపాదిస్తున్న భారీ లాభాల ఫలాలు ఉద్యోగులకు కూడా దక్కాలని డిమాండ్ చేస్తున్నారు.

కార్మికుల ప్రధాన డిమాండ్లు ఏంటంటే…?
ఉద్యోగులు ప్రధానంగా కొన్ని కీలక డిమాండ్లను సుందర్ పిచాయ్ ముందుంచారు. మొదటిది… ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తే వారికి అందే సెవరెన్స్ ప్యాకేజీలకు పక్కా గ్యారంటీ ఉండాలి. రెండోది, ఎవరినైనా బలవంతంగా తొలగించే బదులు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసే బైఅవుట్ ఆప్షన్లను ఇవ్వాలని కోరుతున్నారు. అంతేకాకుండా పెర్ఫార్మెన్స్ పేరుతో వేధింపులు ఆపాలని, ఉద్యోగం పోయిన వెంటనే రోడ్డున పడకుండా ఆ సమయాన్ని పొడిగించిన పెయిడ్ లీవ్స్ రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. టెక్నాలజీ అభివృద్ధి చెందడం మంచిదే కానీ, ఆ అభివృద్ధి సామాన్యుడి జీవితాన్ని బలిగొనేలా ఉండకూడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలోనే ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారితే ఇక సాధారణ ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది.

యాజమాన్యం మొండి వైఖరి…
గూగుల్ లాంటి టెక్ దిగ్గజం ఇరుకున పడటం వెనుక కేవలం మార్కెట్ ఒత్తిళ్లే కాకుండా యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరే ప్రధాన కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులను కేవలం వస్తువులుగా చూస్తూ లాభాల కోసం అర్ధంతరంగా రోడ్డున పడేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. టెక్ ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న కంపెనీయే తన ఉద్యోగులకు భద్రత కల్పించలేకపోతే ఇక డిజిటల్ భవిష్యత్తుపై నమ్మకం ఎక్కడ ఉంటుంది? సుందర్ పిచాయ్ అండ్ కో ఇప్పటికైనా తమ వ్యాపార దాహాన్ని పక్కనపెట్టి మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే రాబోయే రోజుల్లో గూగుల్‌కు వ్యతిరేకంగా ఈ నిరసనలు మరింత ఉధృతమయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. టెక్నాలజీని సృష్టించిన మనుషులకే ఇప్పుడు టెక్నాలజీ రూపంలోనే ఉపాధి గండం ముంచుకొస్తోందంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *