- మండిపడుతున్న దేశం… రోడ్డెక్కిన జనం
- విద్యార్థులు, రైతులు, గిరిజనుల ఉద్యమాలు
- దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాల వెల్లువ
- ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వాలు
సహనం వందే, హైదరాబాద్:
దేశవ్యాప్తంగా నిప్పులు కక్కుతున్న ప్రజాగ్రహం పాలకుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. విద్య, వ్యవసాయం, పర్యావరణం కోసం సాగుతున్న ఈ పోరాటాలు అణచివేతను ఎదిరిస్తున్నాయి. సీజేపీ ఉద్యమం నుంచి రైతుల కవాతు వరకు… జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ రాష్ట్ర ఉద్యమ ర్యాలీ నుంచి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య సాగుతున్న కేన్ బెత్వా నదుల అనుసంధాన వ్యతిరేక పోరు వరకు ప్రతి గొంతు ప్రభుత్వాలను నిలదీస్తున్న వైనంపై ప్రత్యేక కథనం.
ఉద్యమాల ఉనికి…
దేశీయ గడ్డపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. వివిధ వర్గాలు తమ హక్కుల కోసం నేరుగా పోరుబాట పట్టాయి. రాజధాని వీధుల నుంచి మారుమూల గ్రామాల వరకు అశాంతి అలుముకుంది. ప్రభుత్వాల విధానాలపై ప్రజలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు, మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ సరిహద్దుల వరకు ఈ నిరసనలు పాలకుల కుర్చీలను కదిలిస్తున్నాయి. పాలక వర్గాల అణచివేత చర్యలను ఈ ఉద్యమాలు తిప్పికొడుతున్నాయి.
రైతుల రణభూమి
అన్నదాతల కవాతు దేశ రాజధాని ఢిల్లీని తాకింది. అమెరికాతో ఇండియా చేసుకున్న ఒప్పందాలు, వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తున్న తీరుపై పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన రైతులు భగ్గుమంటున్నారు. నల్ల చట్టాల గాయాలు మానకముందే కొత్త ముప్పులు ముంచుకొస్తున్నాయని రైతాంగం మండిపడుతోంది. గిట్టుబాటు ధరలు లేక అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు రోడ్డెక్కారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారిన వ్యవసాయ విధానాలను అడ్డుకుంటామని దేశ రాజధాని వేదికగా హెచ్చరిస్తున్నారు. దేశానికి అన్నం పెట్టే చేతులకు బేడీలు వేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నారు.
విద్యార్థుల తిరుగుబాటు
నీట్ పేపర్ లీక్, విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న తీరుపై దేశవ్యాప్తంగా సీజేపీ ఆధ్వర్యంలో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడింది. ముఖ్యంగా జేఎన్ యూ, డీయూ లాంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి రాష్ట్ర స్థాయి క్యాంపస్ ల వరకు చదువును దూరం చేసే కుట్రలపై యువత కన్నెర్రజేసింది. నిరుద్యోగం, ప్రశ్నించే గొంతులను నొక్కివేస్తున్న తీరుపై విద్యార్థులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. క్యాంపస్ ల నుంచి పార్లమెంట్ వీధుల వరకు విద్యార్థుల నినాదాలతో హోరెత్తుతోంది. ప్రభుత్వాల నియంతృత్వ విధానాలకు చరమగీతం పాడుతామని యువత శపథం చేస్తోంది.
రాష్ట్రాల ఆక్రోశం
ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు మళ్లీ జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా తెరపైకి వచ్చాయి. నేషనల్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో శ్రీనగర్ లో నిర్వహించిన భారీ రాష్ట్ర ఉద్యమ ర్యాలీ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ప్రాంతీయ ఆకాంక్షలను కాలరాస్తూ కేంద్రం అనుసరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దశాబ్దాల ఆశలను నెరవేర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హక్కుల సాధన కోసం సాగుతున్న ఈ పోరులో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పాలకుల మొండివైఖరి కారణంగానే ఈ ప్రాంతీయ ఉద్యమాలు ఉద్ధృతమవుతున్నాయి.
ప్రకృతి విలయం
మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో కేన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టును స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం సాగుతున్న ఈ పోరాటం ఉధృత రూపం దాల్చుతోంది. పచ్చని అడవులను, జీవవైవిధ్యాన్ని నాశనం చేస్తూ చేపడుతున్న ఈ ప్రాజెక్టుల వల్ల కోట్లాది మంది జీవనం ప్రశ్నార్థకమవుతోంది. అభివృద్ధి పేరుతో ప్రకృతిని బలిపెడుతున్న తీరును పర్యావరణవేత్తలు ఎండగడుతున్నారు. ప్రాజెక్టులను వెంటనే ఆపకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
గిరిజనుల గర్జన
జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, ఒడిశా అటవీ ప్రాంతాల్లో అడవి బిడ్డల ఉనికిపై జరుగుతున్న దాడులను గిరిజనులు గట్టిగా తిప్పికొడుతున్నారు. నీరు, భూమి హక్కుల కోసం గిరిజన సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. మైనింగ్ మాఫియా, కార్పొరేట్ కంపెనీల కబంధ హస్తాల నుంచి తమ జల్ జంగల్ జమీన్ ను కాపాడుకోవడానికి గిరిజనులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాల తీరుపై ఆదివాసులు తిరుగుబాటు చేస్తున్నారు.