సీబీఐ ఉచ్చులో జేఎన్‌టీయూ ప్రొఫెసర్లు – 30 మందికి అక్రమ లబ్ధి… 52 లక్షలు చెల్లింపు

CBI Enquiry on JNTU Professors Transfers
  • వారిని ఇరికించిన ఆ కీలక అధికారి ఎవరు?
  • అధ్యాపక ప్రమోషన్ల వెనుక అసలు దొంగెవరు?
  • ఇప్పటికే వేటు వేసినా కుట్రలు చేస్తున్న అధికారి
  • ప్రమోషన్ల మాటున నిబంధనల ఉల్లంఘన
  • జేఎన్‌టీయూలో బయటపడ్డ చీకటి కోణం!
  • సీబీఐ చేతికి కీలక ఆధారాలతో ఫిర్యాదు
  • అధికారుల కుట్రకు ప్రొఫెసర్ల బలి
  • గత ప్రభుత్వ హయాంలో ఇష్టరాజ్యంగా లూటీ?

సహనం వందే, హైదరాబాద్:

ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే సహజంగానే ఆనందపడతారు. హోదా పెరుగుతుంది.. జీతం పెరుగుతుంది.. ఇన్నాళ్ల కష్టానికి గుర్తింపు లభించిందని భావిస్తారు. కానీ జేఎన్‌టీయూలో కొంతమంది ప్రొఫెసర్లకు మాత్రం ప్రమోషన్లు కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి. కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ కింద అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందిన సుమారు 30 మందికి చెల్లించిన మొత్తాలపై ఇప్పుడు వివాదం మొదలైంది. అర్హత వచ్చిన తేదీ నుంచే కొత్త హోదాకు సంబంధించిన వేతనాలు, బకాయిలు చెల్లించడంపై ఆడిట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా అదనంగా చెల్లించిన రూ.52,88,513ను సంబంధిత ఉద్యోగుల నుంచి తిరిగి వసూలు చేయాలని ఆదేశించారు. మరోవైపు ఈ వ్యవహారంలో జరిగిన చెల్లింపులపై ఆధారాలతో సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఈ డబ్బులు ఎవరి నిర్ణయంతో చెల్లించారు? నిబంధనలు తెలిసిన అధికారులు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? ఉద్యోగుల నుంచి ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తే, చెల్లింపులకు అనుమతించిన అధికారుల బాధ్యత సంగతేంటి?

అర్హత ఒక తేదీ.. ప్రమోషన్ మరో తేదీ!
ఈ వివాదానికి ప్రధాన కారణం రెండు తేదీల మధ్య ఉన్న వ్యత్యాసం. కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ కింద ఉద్యోగికి ప్రమోషన్ పొందడానికి అర్హత వచ్చే తేదీ ఒకటి. కొత్త హోదాలో బాధ్యతలు స్వీకరించే తేదీ మరొకటి. ఈ రెండింటినీ ఒకటిగా పరిగణించి వేతన ప్రయోజనాలు కల్పించడమే ఆడిట్ అభ్యంతరానికి కారణమైంది. ఆడిట్ అధికారులు ప్రస్తావించిన 2001 జూలై 21నాటి జీవో నంబర్ 535 ప్రకారం ప్రమోషన్ ద్వారా లభించే అదనపు ఆర్థిక ప్రయోజనాలు కొత్త బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచే వర్తించాలి. అలాగే 2010 ఫిబ్రవరి 20నాటి జీవో నంబర్ 14 ప్రకారం కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ కింద పదోన్నతుల సమయంలో వేతన నిర్ణయం అమల్లో ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. అయితే కొంతమందికి అర్హత వచ్చిన తేదీ నుంచే కొత్త హోదా ప్రకారం వేతనాలు నిర్ణయించినట్లు ఆడిట్ పరిశీలనలో గుర్తించారు. ఈ కారణంగా ఆ తేదీ నుంచి బాధ్యతలు స్వీకరించే వరకు చెల్లించిన అదనపు మొత్తాలను తిరిగి రికవరీ చేయాలని సూచించారు. ఇదే విషయాన్ని సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇష్టరాజ్యంగా లూటీ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి.

30 మందికి రూ. 52.88 లక్షలు!
ఈ వ్యవహారంలో బయటపడిన మొత్తం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆడిట్ నివేదిక ప్రకారం అదనంగా చెల్లించిన మొత్తం రూ.52.89 లక్షలు. సంబంధిత ఉద్యోగుల పేర్లు, హోదాలు, అర్హత తేదీలు, బాధ్యతలు స్వీకరించిన తేదీలు, తిరిగి వసూలు చేయాల్సిన మొత్తాలను ప్రత్యేక పట్టికలో పొందుపరిచారు. ఇందులో కొంతమంది ప్రొఫెసర్లకు రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షలకుపైగా మొత్తాలు కనిపిస్తున్నాయి. ఒక ప్రొఫెసర్ పేరుతో అత్యధికంగా రూ.8,24,330 రికవరీ చూపించారు. ఉద్యోగుల అర్హత తేదీకి, కొత్త బాధ్యతలు చేపట్టిన తేదీకి మధ్య ఉన్న వ్యవధిని బట్టి ఈ మొత్తం మారుతోంది. కొన్ని కేసుల్లో నెలల వ్యవధి ఉండగా, మరికొన్ని కేసుల్లో సంవత్సరాల వ్యత్యాసం ఉంది. ఈ వ్యవధిలో కొత్త హోదాకు సంబంధించిన అదనపు వేతనాలు చెల్లించడమే రికవరీ భారం పెరగడానికి కారణమని ఆడిట్ నివేదిక పేర్కొంది.

తప్పు ఎవరిది.. శిక్ష ఎవరికి?
ఇక్కడే అసలు ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్ ఇచ్చే ప్రక్రియను నిర్వహించింది ఎవరు? వారి అర్హతలను పరిశీలించింది ఎవరు? కొత్త హోదాకు సంబంధించిన వేతనాలను నిర్ణయించింది ఎవరు? లక్షల రూపాయల బకాయిల బిల్లులను పరిశీలించి చెల్లింపులకు అనుమతి ఇచ్చింది ఎవరు? ఇవన్నీ విశ్వవిద్యాలయ అధికారిక వ్యవస్థలో జరగాల్సిన ప్రక్రియలే. ఉద్యోగులు తమకు అర్హత ఉందని భావించి అధికారుల నిర్ణయం ప్రకారం జీతాలు తీసుకున్నారా? లేక నిబంధనలను పక్కనపెట్టి అధికారులు వేతన ప్రయోజనాలు కల్పించారా? ఆడిట్ అభ్యంతరం అదనపు చెల్లింపులపై ఉన్నప్పటికీ, ఉద్యోగుల వ్యక్తిగత తప్పిదాన్ని నిర్ధారించినట్లు కనిపించడం లేదు. అలాంటప్పుడు ఉద్యోగుల నుంచే మొత్తం వసూలు చేయడం ఎంతవరకు సమంజసం? వేతన నిర్ణయాల్లో పాల్గొన్న అధికారులు, ఆమోదాలు తెలిపిన వారి బాధ్యతను కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారంపై సీబీఐకి ఆధారాలతో ఫిర్యాదు చేయడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆడిట్ ఆదేశాలు.. మరిన్ని కేసులపైనా పరిశీలన!
ఆడిట్ అధికారులు కేవలం రూ.52.88 లక్షలు వసూలు చేయాలని చెప్పి ఆగిపోలేదు. ఇదే తరహాలో మరికొన్ని పదోన్నతుల కేసుల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా వేతన ప్రయోజనాలు కల్పించారా అని పరిశీలించాలని సూచించారు. అదనంగా చెల్లించిన మొత్తాలను ప్రభుత్వ సాధారణ నిధికి జమ చేయడంతోపాటు, తీసుకున్న చర్యల వివరాలను ఆడిట్ విభాగానికి తెలియజేయాలని పేర్కొన్నారు. ఉద్యోగుల వేతనాలను కూడా నోషనల్ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా తిరిగి నిర్ణయించాలని సూచించారు. అదనపు ఆర్థిక ప్రయోజనాలను కొత్త బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచే లెక్కించాలి. ఈ చర్యలను తదుపరి స్థానిక ఆడిట్ తనిఖీలో పరిశీలించనున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇప్పుడు విశ్వవిద్యాలయ యాజమాన్యం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. నిబంధనలు ఉన్నప్పుడు వాటిని ఎందుకు పాటించలేదు? చెల్లింపులకు బాధ్యులైన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఉద్యోగులకు ముందుగా చెల్లించిన మొత్తాలను తిరిగి వసూలు చేయడమే పరిష్కారమా? లేక ఈ నిర్ణయాల వెనుక ఉన్న అధికారుల పాత్రను కూడా విచారిస్తారా? ప్రమోషన్లు ఉద్యోగులకు వరమా లేక అధికారుల తప్పిదాల వల్ల భారంగా మారాయా?

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *