డాక్టర్‌ గారి విస్కీ యాత్ర – మందు కోసం వేల కిలోమీటర్ల ప్రయాణం

Whisky Tour by Doctor
  • 7,500 మంది సభ్యులతో విస్కీ క్లబ్‌ ఏర్పాటు
  • బెంగళూరు కేంద్రంగా దేశవ్యాప్త నెట్‌వర్క్‌
  • అరుదైన రుచులు.. ఆసక్తికర చర్చలు
  • అనేక మంది ప్రముఖులతో గోవాలో విస్కీ పండుగ

సహనం వందే, హైదరాబాద్:

ఒక గ్లాసు విస్కీ కోసం వేల కిలోమీటర్లు ప్రయాణిస్తారా? అందులోని ఒక్కో చుక్క రుచిని ఆస్వాదించడానికి గంటల తరబడి చర్చిస్తారా? ఆ గ్లాసులో కనిపించే రంగు నుంచి వచ్చే సువాసన వరకు ప్రతిదానికీ ఓ అర్థం వెతుకుతారా? అవును.. అలాంటి ఆసక్తే వేల మందిని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఇక్కడ విస్కీ అంటే కేవలం డ్రింక్ కాదు.. అదొక ప్రపంచం! దాని తయారీ వెనుక సాంకేతికత, ఏళ్ల తరబడి సాగే నిల్వ ప్రక్రియ, ప్రాంతాలను బట్టి మారే రుచులు.. ఇలా ప్రతి అంశానికీ ప్రత్యేకమైన కథ ఉంటుంది. ఆ కథలను అన్వేషిస్తూ, అనుభవాలను పంచుకుంటూ సాగుతున్న ఈ అరుదైన క్లబ్‌ గురించి తెలుసుకుందాం.

ఒకే అభిరుచి.. 7,500 మంది!
సింగిల్‌ మాల్ట్‌ అమెచ్యూర్‌ క్లబ్‌.. సంక్షిప్తంగా స్మాక్‌. ప్రస్తుతం ఈ సంఘంలో సుమారు 7,500 మంది సభ్యులున్నారు. విస్కీపై ఆసక్తి ఉన్నవారిని ఒకచోట చేర్చడమే ఈ వేదిక ప్రత్యేకత. ఇందులో విస్కీ తయారీ, రకాలపై లోతైన అవగాహన ఉన్నవారితో పాటు కొత్తగా ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటున్నవారూ ఉన్నారు. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంఘం నెట్‌వర్క్‌ దేశంలోని పలు నగరాలకు విస్తరించింది.

అస్సాం నుంచి అరుదైన విస్కీల అన్వేషణ!
ఈ క్లబ్‌ సభ్యుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. అస్సాంలోని దిబ్రూగఢ్‌కు చెందిన అనుపమ్‌ దత్తా వృత్తిరీత్యా వైద్యుడు. 2016 నుంచి ఆయన ఈ సంఘంలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. విస్కీలోని ప్రత్యేకమైన రుచులు, వాసనలు, తయారీ విధానాలపై ఆసక్తితో వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. తనలాంటి అభిరుచి ఉన్నవారితో అనుభవాలను పంచుకుంటారు. క్లబ్‌ సమావేశాల్లో సభ్యులు విస్కీ రంగు, సువాసన, రుచులను నిశితంగా పరిశీలిస్తూ తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఒకే విస్కీని ఆస్వాదించిన ఇద్దరు వ్యక్తులు భిన్నమైన రుచులను గుర్తించడం కూడా ఇక్కడ ఆసక్తికర చర్చలకు కారణమవుతుంది.

గోవా వేదికగా అరుదైన విస్కీల పండుగ!
ప్రపంచంలోని అరుదైన సింగిల్‌ మాల్ట్‌లను తెలుసుకోవడం, వాటి తయారీ పద్ధతులు, నిల్వ ప్రక్రియల గురించి అవగాహన పెంచుకోవడం ఈ సభ్యుల ఆసక్తి. ప్రముఖ విస్కీ బ్రాండ్లతో కలిసి క్లబ్‌ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గత సెప్టెంబర్‌లో గోవాలో ఇండియా రేర్‌ స్పిరిట్స్‌ విస్కీ టేస్టింగ్‌ సమావేశం జరిగింది. సింగిల్‌ మాల్ట్‌ అమెచ్యూర్‌ క్లబ్‌, డియాజియో సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సభ్యులు హాజరయ్యారు. అరుదైన విస్కీల ప్రత్యేకతలను తెలుసుకుని తమ అనుభవాలను పంచుకున్నారు.

ఒక్కో చుక్క వెనుక ఏళ్ల నిరీక్షణ!
సింగిల్‌ మాల్ట్‌ తయారీలో మాల్టెడ్‌ బార్లీ ప్రధాన ముడిసరుకు. ప్రత్యేక పద్ధతుల్లో తయారు చేసిన అనంతరం నిర్ణీత పద్ధతిలో నిల్వ చేస్తారు. కొన్ని రకాలు ఎన్నో సంవత్సరాల పాటు పాతబడతాయి. ఈ క్రమంలో వాటి రంగు, వాసన, రుచి మారుతూ ఉంటాయి. బంగారు వర్ణం నుంచి ముదురు గోధుమ రంగుల వరకు భిన్నమైన ఛాయలు కనిపిస్తాయి. ఈ సూక్ష్మమైన ప్రత్యేకతలను గుర్తించడం, వాటి వెనుక ఉన్న కథలను తెలుసుకోవడమే ఈ సభ్యుల ఆసక్తి. వైద్యుల నుంచి వివిధ వృత్తులకు చెందిన వ్యక్తుల వరకు ఏడున్నర వేల మందిని కలిపిన ఈ క్లబ్‌.. ఒక అభిరుచి ఎంత పెద్ద అనుబంధంగా మారగలదో చాటుతోంది. ఒక్కో గ్లాసులో ఓ రుచి.. ఒక్కో రుచి వెనుక ఓ కథ.. ఆ కథలను పంచుకోవడానికి ఒక పెద్ద ప్రపంచమే ఈ సింగిల్‌ మాల్ట్‌ అమెచ్యూర్‌ క్లబ్‌!

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *