- విమానం రేంజ్‌లో అత్యాధునిక సౌకర్యాలు
- 200కు పైగా కొత్త రైళ్ల తయారీకి ఏర్పాట్లు
- త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి
సహనం వందే, హైదరాబాద్:
భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. వేగవంతమైన ప్రయాణానికి మారుపేరుగా నిలిచిన వందే భారత్ ఇప్పుడు స్లీపర్ రూపంలో మన ముందుకు వస్తోంది. ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచేలా విమాన స్థాయి సౌకర్యాలతో ఈ రైలు రూపుదిద్దుకుంది. కేవలం వేగమే కాదు విలాసవంతమైన ప్రయాణాన్ని ఇష్టపడే పర్యాటకులకు ఇది ఒక మధురమైన కానుక. భారత రైల్వే వ్యవస్థలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోనుంది.

వేగంలో రికార్డులు సృష్టించిన ట్రయల్ రన్
వందే భారత్ స్లీపర్ రైలు తన సత్తాను చాటింది. కోటా నుంచి నాగ్‌దా సెక్షన్ మధ్య జరిగిన పరీక్షల్లో ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లింది. రైల్వే భద్రతా కమిషనర్ పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రయోగాలు అద్భుతంగా విజయవంతం అయ్యాయి. ఇంత వేగంగా వెళ్తున్నా ప్రయాణికులకు ఎలాంటి కుదుపులు ఉండవని రైల్వే శాఖ నిరూపించింది. ఇది దేశీయ రైల్వే పరిజ్ఞానానికి ఒక నిదర్శనంగా నిలిచింది.
చుక్క నీరు చిందకుండా వాటర్ టెస్ట్…
రైలు వేగాన్ని పరీక్షించడమే కాదు అది ఎంత నిలకడగా ఉందో చూపేందుకు వాటర్ టెస్ట్ నిర్వహించారు. రైలు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న సమయంలో టేబుల్‌పై ఉంచిన నీళ్ల గ్లాసు నుంచి ఒక్క చుక్క కూడా కింద పడలేదు. ఈ వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సాంకేతికత వల్ల ప్రయాణికులు నిశ్చింతగా నిద్రపోవచ్చని ఆయన భరోసా ఇచ్చారు.
విమానం తరహాలో విలాసవంతమైన కోచ్‌లు
ప్రస్తుతం అందుబాటులోకి రానున్న వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. వీటిలో పదకోండు 3టైర్ ఏసీ కోచ్‌లు, నాలుగు 2టైర్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. కేవలం ఒక ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్‌ను కూడా ఇందులో చేర్చారు. ప్రయాణికుల కోసం మెత్తటి బెర్తులు, పై బెర్త్ ఎక్కడానికి సులభంగా ఉండేలా నిచ్చెనలను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ప్రయాణికులు అలసిపోకుండా గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఈ సౌకర్యాలు ఎంతో దోహదపడతాయి.
అత్యాధునిక సౌకర్యాలు… హైటెక్ టాయిలెట్లు
పర్యాటకుల సౌకర్యార్థం ఈ రైలులో ఎన్నో విశేషాలు ఉన్నాయి. రాత్రి వేళల్లో ఇబ్బంది లేకుండా తక్కువ వెలుతురు ఇచ్చే నైట్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ప్రతి ప్రయాణికుడికి విడివిడిగా రీడింగ్ ల్యాంప్‌లు, ఛార్జింగ్ సాకెట్లు ఉంటాయి. విమానాల్లో ఉండే తరహాలో బయో వ్యాక్యూమ్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా దివ్యాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, చిన్నపిల్లల సంరక్షణ కోసం బేబీ కేర్ యూనిట్లు కూడా ఉన్నాయి.
భద్రతకు పెద్దపీట వేస్తూ కవచ్ వ్యవస్థ
వేగంతో పాటు ప్రయాణికుల రక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. రైలు ప్రమాదాలను అరికట్టేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కవచ్ యాంటీ కొలీషన్ టెక్నాలజీని ఇందులో అమర్చారు. ఆటోమేటిక్ డోర్లు, సీసీటీవీ కెమెరాల నిఘా నిరంతరం ఉంటుంది. అత్యవసర సమయంలో డ్రైవర్‌తో నేరుగా మాట్లాడే సదుపాయం కూడా ఉంది. ఇది ప్రయాణికులకు కొండంత అండగా నిలుస్తుంది.
భారీగా పట్టాలెక్కనున్న కొత్త రైళ్లు
భారతీయ రైల్వే రాబోయే కొద్ది ఏళ్లలో 200కు పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం బెమెల్, ఐసిఎఫ్ వంటి సంస్థలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. రష్యన్ భాగస్వామ్యంతో కినెట్ సంస్థ మరికొన్ని రైళ్లను తయారు చేస్తోంది. పాత కాలం నాటి రైళ్ల స్థానంలో వీటిని తీసుకురావడం వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. దూర ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులకు ఈ రైళ్లు వరంలా మారనున్నాయి.