కోర్టు హుకూం… జగన్ కదిలెన్ – ఐదేళ్లకు కోర్టు మెట్లు ఎక్కుతున్న మాజీ సీఎం

ఐదేళ్లకు కోర్టు మెట్లు ఎక్కుతున్న మాజీ సీఎం
  • మినహాయింపు ఇవ్వని సీబీఐ ప్రత్యేక కోర్టు
  • నేడు హైదరాబాదుకు ప్రత్యేక విమానంలో రాక
  • నాంపల్లి కోర్టు వరకు భారీ ర్యాలీకి ఏర్పాట్లు
  • బందోబస్తు ఏర్పాటు చేసిన ప్రభుత్వం

సహనం వందే, హైదరాబాద్:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించలేదు. దీంతో చాలా ఏళ్ల విరామం తర్వాత గురువారం (నేడు) ఆయన హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు. సుదీర్ఘంగా బెయిల్‌పై ఉన్న జగన్… చివరిసారిగా 2020 జనవరి 10న కోర్టుకు వచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత దాదాపు ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పరిపాలనా బాధ్యతలు, భద్రతా కారణాలు చూపుతూ కోర్టుకు రాకుండా మినహాయింపులు పొందుతూ వచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే తాజాగా కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన తప్పనిసరిగా కోర్టు మెట్లెక్కాల్సి వస్తోంది. ఆయన రాక నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బేగంపేటకు ప్రత్యేక విమానంలో వచ్చిన తర్వాత భారీ ర్యాలీతో కోర్టుకు వెళ్ళనున్నారు.

లండన్ పర్యటన… బెయిల్ ఉల్లంఘన
లండన్ పర్యటన కారణంగా జగన్ కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. లండన్ పర్యటన సమయంలో జగన్ తప్పుడు ఫోన్ నంబరు ఇచ్చారని… ఇది బెయిల్ షరతులను ఉల్లంఘించడమేనని సీబీఐ కోర్టు ముందు ఆధారాలను సమర్పించింది. కోర్టు విధించిన షరతులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని సీబీఐ వాదించింది. ఈ నేపథ్యంలో స్పందించిన కోర్టు నవంబర్ 21లోపు తప్పనిసరిగా హాజరు కావాలని జగన్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను తోసిపుచ్చడానికి వీలు లేకుండా పోవడంతో గత ఆరేళ్లలో కోర్టుకు హాజరు కాకుండా ఉండేందుకు ఆయన చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

మినహాయింపు దొరకలేదు!
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భద్రతా కారణాలు చూపి మినహాయింపులు పొందిన జగన్‌కు ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. మాజీ ముఖ్యమంత్రిగా తనకు భద్రతా కారణాల వల్ల మినహాయింపు ఇవ్వాలని ఆయన చేసిన అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆయన కేవలం మాజీ ముఖ్యమంత్రిగా, వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా, పులివెందుల శాసనసభ్యుడిగా మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో భద్రత సమస్యను కారణంగా చూపి కోర్టుకు రాలేనని చెప్పడానికి రాజకీయ అవకాశం లేకుండా పోయిందనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

కేసు నేపథ్యం ఏమిటి?
జగన్‌పై 2011-12లోనే అక్రమాస్తుల కేసు తెరపైకి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 2004-09 మధ్య కాలంలో క్విడ్‌ప్రోక్వో పద్ధతిలో పెట్టుబడులు తీసుకుని జగన్ తన సంస్థలకు అక్రమ ఆస్తులు సమకూర్చుకున్నారనేది కేసులోని ప్రధాన ఆరోపణ. ఈ కేసులో సీబీఐ మొత్తం 11 చార్జిషీట్లు, ఈడీ 9 ప్రాసిక్యూషన్ కంప్లైంట్లు దాఖలు చేశాయి. కేసు దాఖలై దశాబ్దానికి పైగా అవుతున్నా విచారణ ఇప్పటికీ పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. ఈ ఆలస్యంపై సుప్రీంకోర్టు గతంలో అసంతృప్తి వ్యక్తం చేసినా కోర్టుకు హాజరు కాకుండా జగన్ మినహాయింపులు పొందడం విమర్శలకు తావిచ్చింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *