- మొన్న జగన్… నిన్న కేటీఆర్… నేడు తేజస్వి
- ఈ ముగ్గురికీ చెల్లెళ్లతో రాజకీయ రణరంగం
- అన్నలపై షర్మిల… కవిత… రోహిణిల గరం
- ఈ ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల కూతుళ్లే
- బీహార్ ఎన్నికల తర్వాత రోడ్డెక్కిన రోహిణి
- తేజస్విని టార్గెట్ చేస్తూ అగ్గిమీద గుగ్గిలం
సహనం వందే, పాట్నా:
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో లొల్లి మొదలైంది. లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ దానం చేసిన కుమార్తె రోహిణి ఆచార్య ఎదుర్కొంటున్న అవమానాలు, ఆమె సోదరుడు తేజస్వి యాదవ్ వర్గంపై చేసిన విమర్శలు ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ అయింది. తన కిడ్నీని అపరిశుభ్రమైనది అన్నారని రోహిణి ఆవేదన వ్యక్తం చేయడం… అటువంటివారు తమ కిడ్నీలను పేదలకు దానం చేయాలని సవాల్ విసరడం రాజకీయాల్లో ప్రకంపనలు లేపుతుంది. ఈ పరిస్థితి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోని చెల్లెళ్ల పోరాటాలనూ ప్రతిబింబిస్తున్నాయి.
జగన్ పై షర్మిల పోరాటం…
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల సొంత అన్నతో విభేదించి పార్టీని వీడటం… ప్రత్యేకంగా తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం… ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరడం వంటి పరిణామాలు ఈ పోలికకు బలం చేకూరుస్తున్నాయి. రోహిణి సైతం కుటుంబం నుంచి తనను బహిష్కరించారని… పార్టీ ఓటమికి కారణమైన వారిని ప్రశ్నిస్తే తనను పక్కన పెట్టారని బహిరంగంగా ఆరోపించడం… షర్మిలకు దారితీసిన పరిస్థితులనే గుర్తు చేస్తోంది. బీహార్‌లో రోహిణి తన సోదరుడి వర్గాన్ని చర్చకు సవాల్ చేసినట్లుగానే ఇక్కడ షర్మిల తన సొంత రాజకీయ ఉనికి కోసం పోరాడారు.
కేసీఆర్ కుటుంబంలో కవిత…
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, సోదరుడు కేటీఆర్ చెల్లి అయిన కల్వకుంట్ల కవిత విషయంలోనూ పార్టీలో, కుటుంబంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆమె తన సొంత అన్నను, బావను టార్గెట్ చేసి విమర్శించారు. కాగా బీహారులో తనను లక్ష్యంగా చేసుకుని ట్రోల్ ఆర్మీలు దాడి చేస్తున్నట్లు రోహిణి ఆరోపించారు. ఈ కుటుంబ వివాదాలు కేవలం బీహార్‌కు మాత్రమే పరిమితం కాదని… తెలుగు రాజకీయాల్లోనూ రాజకీయాలకు వేదికలవుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి.
అధికారం చేజారితే… బంధాలు ఔట్
తేజస్వి నాయకత్వంలో ఆర్జేడీ 75 సీట్ల నుంచి 25 సీట్లకు పడిపోవడం అత్యంత నిరాశపరిచింది. పార్టీ ఓటమి తరువాత కుటుంబంలో ద్రోహులు పెరిగారని… సోదరిని అవమానించడం సహించబోనని లాలూ మరో కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ హెచ్చరించడం గమనార్హం. బీహార్‌లో రోహిణి, తెలుగు రాష్ట్రాల్లో షర్మిల, కవిత వంటి నాయకులు.. పార్టీలకు, కుటుంబాలకు దూరం కావడం, కొత్త మార్గాలను అన్వేషించడం అనేది భారతీయ రాజకీయాల్లోని వారసత్వ రాజకీయాల చీకటి కోణాన్ని ఎత్తిచూపుతోంది.