ఊరు పొమ్మంది… సర్వే రమ్మంది – వచ్చే ఏడాది భారీ సర్వేకు కేంద్రం ఏర్పాట్లు

  • వలస బతుకు చిత్రానికి రంగం సిద్ధం
  • సంఖ్య మాత్రమే కాదు బతుకు చిత్రం స్కాన్
  • చరిత్రలోనే అతిపెద్ద సర్వేకు రంగం సిద్ధం

సహనం వందే, న్యూఢిల్లీ:
దేశంలో వలస కార్మికులు, వారి కుటుంబ జీవితాలను సమగ్రంగా అర్థం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2026-27 సంవత్సరంలో దేశవ్యాప్తంగా భారీ వలస సర్వే జరగబోతోంది. గతంలో కేవలం ఎంత మంది వలస వెళ్లారనే గణాంకాలకే పరిమితమైన ఈ సర్వే… ఇకపై వలస కార్మికుల జీవిత నాణ్యతను పూర్తిగా తెలుసుకునే లక్ష్యంతో రూపుదిద్దుకుంది. దాదాపు రెండు దశాబ్దాలకు (2007-08) జరుగుతున్న ఈ అధ్యయనం వలస కార్మికుల బతుకు బాగుపడాలనే సంకల్పంతో రూపొందుతోంది.

ఆరు నెలలు బయటికి వెళ్ళినా వలసే…
ఈ కొత్త సర్వే విధానంలో కేవలం శాశ్వతంగా ఊరు మారినవారు మాత్రమే కాకుండా కేవలం ఆరు నెలలు వేరే చోట పని చేసి తిరిగి వచ్చే వలస కార్మికులను కూడా లెక్కలోకి తీసుకోనున్నారు. నిర్మాణ స్థలాలు, పంట కోతలు, రోడ్ల పనుల్లో పాల్గొనే తాత్కాలిక వలస కార్మికుల జీవితాలు కూడా ఈ సర్వే ద్వారా వెలుగులోకి వస్తాయి. అంతేకాకుండా వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు ఎంత డబ్బు పంపుతున్నారు… ఆ డబ్బును వారు ఎలా ఉపయోగిస్తున్నారనే కీలక సమాచారాన్ని కూడా సేకరించనున్నారు. ఈ లెక్కలు రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కొత్త పథకాలు రూపొందించడంలో దిక్సూచిగా మారతాయి.

ఆదాయం నుంచి ఆరోగ్యం వరకు జీవిత చిత్రం
వలస తర్వాత ఆ కార్మికుడి ఆదాయం పెరిగిందా? పిల్లల చదువు మెరుగైందా? మంచి ఇల్లు పొందారా? ఆసుపత్రి సౌకర్యం అందుబాటులో ఉందా? ప్రభుత్వ సంక్షేమ సేవలు వలస ప్రాంతంలో అందుతున్నాయా? అనే విషయాలను ఈ సర్వేలో ప్రతి కార్మికుడి గురించి తెలుసుకుంటారు. ఇప్పటివరకు ఈ వివరాలు ఏ ప్రభుత్వ సంస్థ వద్ద కూడా లేవు. ఈ అధ్యయనం పూర్తయితే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న వలస కార్మికుల జీవితం ఎలా ఉందో దేశం మొత్తం స్పష్టంగా చూడబోతోంది.

మోస్పీ ఆధ్వర్యంలో ఏడాది పాటు సర్వే
2026 జూలై నుంచి 2027 జూన్ వరకు ఒక సంవత్సరం పాటు ఈ కీలక సర్వే జరగనుంది. దీనిని కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (మోస్పీ) నిర్వహించబోతోంది. ఈ శాఖలోని జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) దేశవ్యాప్తంగా ఫీల్డ్ సర్వేలు చేసి వలసల రేటు, కారణాలు, ఆదాయ మార్పులు, విద్య, ఆరోగ్య సౌకర్యాలపై సమగ్ర సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ సర్వే ఫలితాలు 2027 మధ్యలో వచ్చే అవకాశం ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *