- దాని సంగతి తేల్చాలని పార్టీ నిర్ణయం
- రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే పిలుపు
- లక్షలాది మందితో నిర్వహించాలని నిర్ణయం
- ఓటరు జాబితా సవరణపై కాంగ్రెస్ ఫైర్
సహనం వందే, న్యూఢిల్లీ:
బీహార్ ఎన్నికల ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ తీవ్ర అంతర్మధనంలో ఉండిపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పార్టీ వర్గాలకు మింగుడు పడడం లేదు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఎన్నికల సంఘం నిర్వాకమేనని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్ సంగతి తేల్చాలని… పాలక పక్షం పట్ల అది వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో ఎండగట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా వచ్చే నెల మొదటి వారంలో ఈసీకి వ్యతిరేకంగా ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది. రాహుల్ గాంధీతో సమావేశమైన తర్వాత ఈ కీలక నిర్ణయాన్ని ఆ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. దేశంలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్ష పార్టీలను నాశనం చేయడానికి పనిచేస్తుందని ఆరోపించారు.
ఓటు చోరీకి బీజేపీ కుట్ర…
ఓటు చోరీకి బీజేపీ ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఆయుధంగా వాడుకుంటోందని ఖర్గే విమర్శించారు. ‘ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల నమ్మకం ఇప్పటికే సన్నగిల్లిన వేళ ఈసీ తీరు చాలా నిరాశ కలిగించింది. అది తక్షణమే బీజేపీ నీడలో పనిచేయడం లేదని నిరూపించుకోవాలి. రాజ్యాంగబద్ధమైన ప్రమాణాన్ని… పాలకపక్షం పట్ల కాకుండా ప్రజల పట్ల తమ విధేయతను గుర్తుంచుకోవాలి’ అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘ఈసీ చూసీచూడనట్లు వ్యవహరిస్తే ఆ వైఫల్యం పరిపాలనా లోపం మాత్రమే కాదు… కుట్రలో భాగస్వామ్యం అయినట్లే’ అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.
నిర్దేశిత ఓట్లను తొలగించే ప్రయత్నం…
ఎన్నికల సంఘం నిర్దిష్ట వర్గాల ఓట్లను తొలగించడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. ఎస్‌ఐఆర్ లక్ష్యం ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించడమే అని… బీహార్‌లో కూడా ఇదే నిరూపితమైందని ఆయన పేర్కొన్నారు. ‘ఇది ఎన్నికల సంఘం చేస్తున్న కుట్రపూరిత ప్రయత్నం. ఇది పూర్తిగా అనైతికం… ప్రజాస్వామ్యానికి విరుద్ధం’ అని ఆయన మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈసీ వైఖరిని ప్రజల ముందు ఉంచుతుందని… డిసెంబర్ మొదటి వారంలో రామ్‌లీలా మైదాన్‌లో లక్షలాది మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తామని వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న రాష్ట్రాలలో త్వరలో ఎన్నికలు జరగబోయే తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ కూడా ఉన్నాయి.