- ఆవు లేని పాలు… ప్రకృతికి శాపాలు
- అమెరికాలో ఇప్పటికే మొదలైన అమ్మకాలు
- కృత్రిమ పోషకాలు… శరీరం స్వీకరిస్తుందా?
- రసాయనాలతో ఆరోగ్యానికి ముప్పు…
- అధ్యయనం లేని కృత్రిమ పాలతో నష్టం
సహనం వందే, అమెరికా:
పాల పరిశ్రమను కుదిపేసే కొత్త విధానం ఒకటి అమెరికాలో మొదలైంది. ల్యాబ్లో కణాలతో పాలు తయారు చేస్తున్నారు. వీటిని నిజమైన పాలే అని శాస్త్రవేత్తలు చెబుతున్నా ఆరోగ్యం దృష్ట్యా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సహజంగా ఆవు గడ్డి తిని, జీర్ణం చేసుకొని ఇచ్చే పాలలో ఉండే పోషకాలు… కృత్రిమంగా తయారైన ల్యాబ్ పాలల్లో ఉండవని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఆవు పాలు తాగితే శరీరం బలపడుతుంది… కానీ ల్యాబ్ పాలు తాగితే ఏమవుతుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు.
కృత్రిమ పోషకాలను శరీరం స్వీకరిస్తుందా?
సహజ పాలల్లో ప్రోటీన్లు, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు సమపాళ్లలో ఉంటాయి. ఇది ప్రకృతి సహజమైన మార్గానికి నిదర్శనం. కానీ ల్యాబ్‌లో కణాలను పెంచి తయారుచేసే పాలల్లో ఆ సమతుల్యం ఉంటుందా అనేది ప్రశ్నార్థకమే. శాస్త్రవేత్తలు కృత్రిమంగా పోషకాలను కలిపినా వాటిని శరీరం పూర్తిగా స్వీకరిస్తుందా అన్నది సందేహమే. అమెరికాలో ఈ ల్యాబ్ పాలు అమ్మకాలు ఇప్పటికే మొదలయ్యాయి. కానీ వీటి దీర్ఘకాలిక ప్రభావాలపై అధ్యయనాలు లేకపోవడం పెద్ద లోపం. పిల్లలు ఈ పాలు తాగితే ఎముకలు బలహీనమవుతాయేమో… రోగనిరోధక శక్తి తగ్గుతుందేమో అనే భయాలు వ్యక్తమవుతున్నాయి. సహజ పాలు అలర్జీలు కలిగించినా శరీరం ఎదుర్కొంటుంది… కానీ కృత్రిమ పాల ప్రభావం ఏమిటో తెలియదు.
రసాయనాలతో ఆరోగ్యానికి ముప్పు…
ల్యాబ్ పాల తయారీ ప్రక్రియలో రసాయనాలు వాడడం ఆందోళనకరం. కణాలు త్వరగా పెరగడానికి గ్రోత్ ఫ్యాక్టర్లు, యాంటీబయాటిక్స్ కలుపుతారు. ఇవి పాలల్లో మిగిలిపోయి శరీరంలోకి చేరితే క్యాన్సర్, గుండె జబ్బుల ముప్పు పెరగవచ్చని కొందరు వైద్యులు హెచ్చరిస్తున్నారు. సహజ పాలల్లో ఉండే ఎంజైములు, బ్యాక్టీరియా సమతుల్యం ల్యాబ్‌లో సాధ్యం కాకపోవచ్చు. దీనివల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. పిల్లల్లో అలర్జీలు, పెద్దల్లో హార్మోన్ల అసమతుల్యత రావొచ్చు. కంపెనీలు వీటిని సురక్షితమని చెబుతున్నా ఖచ్చితమైన ఆధారాలు చూపలేకపోతున్నాయి. గతంలో జన్యు మార్పిడి ఆహారాల విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఈ ల్యాబ్ పాల విప్లవం డైరీ పరిశ్రమను కుప్పకూల్చే ప్రమాదం ఉంది.