40 ఏళ్లు… 30తో వెళ్ళు – దక్షిణ కొరియాకు విదేశీ మహిళల క్యూ

  • వయస్సు వెనక్కు… చర్మం చమక్కు
  • యవ్వనం కోసం కొరియా దేశం రాక
  • మెరిసిపోయేలా చేస్తున్న డెర్మటాలజిస్టులు
  • శస్త్రచికిత్స లేకుండానే ప్రత్యేక ట్రీట్మెంట్
  • సాల్మన్ చేప డీఎన్ఏ ఇంజెక్షన్లతో మెరుపు
  • బ్యూటీ టూరిజంగా మారిన గంగ్నాం ప్రాంతం

సహనం వందే, సియోల్:
ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మహిళలు ఇప్పుడు యవ్వనం కోసం దక్షిణ కొరియాకు పరుగెడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడి గంగ్నాం ప్రాంతం బ్యూటీ టూరిజంకి కేంద్రంగా మారింది. అమెరికా సహా అనేక పాశ్చాత్య దేశాల నుంచి మహిళలు ఇక్కడికి వస్తున్నారు. కేవలం ముఖానికి మాత్రమే కాకుండా వెల్ ఏజింగ్ అనే సరికొత్త పద్ధతితో వయస్సు తక్కువ కనిపించేలా తయారు కావడం… వృద్ధాప్యాన్ని జయించడమే వారి ప్రధాన ఉద్దేశం. అమెరికాలో ఇలాంటి ఆధునాతన చికిత్సలు లేకపోవడం… ఇక్కడ ధరలు చాలా తక్కువగా ఉండటంతో ఈ ట్రెండ్ అమాంతం పెరిగింది. దక్షిణ కొరియా ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం… 2023-24 వరకు విదేశాల నుంచి డెర్మటాలజీ క్లినిక్‌లకు రావడం ఏకంగా మూడు రెట్లు పెరిగింది. గంగ్నాం రోడ్ల నిండా కాస్మెటిక్ విగ్గులు, కాంటాక్ట్ లెన్స్‌లు, అత్యున్నత స్థాయి బ్యూటీ ఉత్పత్తుల ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. 40 ఏళ్ళున్న వారిని 30 ఏళ్లు కనిపించేలా చేసి పంపిస్తున్నారు.

యాంటీ-ఏజింగ్ కాదు… వెల్-ఏజింగ్
యవ్వనాన్ని తిరిగి తెచ్చుకునే ఈ విహారయాత్ర ఎంత ప్రత్యేకమైనదో చెప్పడానికి ఓ అమెరికన్ మహిళ ఉదాహరణ చాలు. ఆమె తన 40వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ ట్రిప్‌ను ఎంచుకుంది. కొరియాలో వయస్సును ఎదుర్కోవడం (యాంటీ-ఏజింగ్) కాదు… దాన్ని మేనేజ్ చేయడం (వెల్-ఏజింగ్) ముఖ్యం. ఇక్కడి చికిత్సలు శస్త్రచికిత్స లేకుండానే చర్మాన్ని కాపాడుతాయి. ఆమె తన చర్మాన్ని పునరుజ్జీవనం చేసే రేజూరన్ అనే సాల్మన్ చేప డీఎన్ఏ ఇంజెక్షన్‌ను తీసుకుంది. ఇది కొల్లాజెన్‌ను పెంచి మచ్చలను తగ్గిస్తుంది.

సాల్మన్ డీఎన్ఏ మ్యాజిక్…
సియోల్‌లో చర్మాన్ని మార్చే అధునాతన చికిత్సలు ఇప్పుడు ప్రపంచానికి హాట్‌టాపిక్‌గా మారాయి. సర్కిల్ క్లినిక్‌లలో అల్ట్రాసౌండ్ టైటెనర్‌లు ధ్వని తరంగాలను ఉపయోగించి చర్మాన్ని గట్టిగా చేస్తాయి. రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలతో ముఖంలోని టిష్యూను లిఫ్ట్ చేస్తారు. దీనికి శస్త్రచికిత్స అవసరం లేదు. లేజర్లు చర్మం రంగును మెరుగుపరచడానికి, పిగ్మెంటేషన్‌ను సరిచేయడానికి, కొల్లాజెన్‌ను పెంచడానికి లోతైన పొరలకు చేరి పనిచేస్తాయి. ముఖ్యంగా సాల్మన్ డీఎన్ఏ ఇంజెక్షన్లు చర్మం ఎలాస్టిసిటీని అద్భుతంగా పెంచుతాయి. ఈ చికిత్సల ఫలితాలు దీర్ఘకాలికంగా ఉండి చర్మాన్ని మెరిసిపోయేలా యవ్వనంగా ఉంచుతాయి.

లక్ష నుంచి రెండు లక్షల వరకు ఖర్చు…
అమెరికన్ మహిళ తీసుకున్న సాల్మన్ డీఎన్ఏ ఇంజెక్షన్లు, అల్ట్రాసౌండ్ టైటెనర్లు, లేజర్ చికిత్సల ప్యాకేజీకి లక్ష నుండి రెండు లక్షల రూపాయల వరకు మాత్రమే ఖర్చు అయినట్లు అంచనా. ఈ ఖర్చు పాశ్చాత్య దేశాలతో పోలిస్తే దాదాపు సగం కంటే తక్కువ. ఈ ధరల వ్యత్యాసం, చికిత్సల నాణ్యత, డాక్టర్ల అనుభవం ఆ దేశాన్ని బ్యూటీ టూరిజం కేంద్రంగా మార్చాయి. కాన్సిర్జ్ సర్వీసులు, కన్సల్టేషన్‌లు, చికిత్సలు, రికవరీ అన్నీ కలిపి ప్యాకేజీలుగా అందిస్తున్నాయి. సియోల్ ఇప్పుడు యవ్వన ఊట లాంటిది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *