- నెత్తిన పెట్టుకున్న జనమే జగన్ ను పడేశారు
- అదే పరిస్థితి తేజస్వి యాదవ్ కు వచ్చింది
- ఎన్డీఏ కూటమితో జగన్, తేజస్వీలకు చిక్కులు
- ఇద్దరి రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు
సహనం వందే, పాట్నా:
రాజకీయాల్లో కొన్నిసార్లు ప్రజల తీర్పు ఊహించని విధంగా ఉంటుంది. అభిమానం పీక్స్ కు చేరితే ఎన్నికల ఫలితం ‘వార్ వన్ సైడ్’ వలే మారిపోతుంది. ఏడాదిన్నర క్రితం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిలిన గట్టి షాక్ ఇప్పుడు బీహార్‌లో రిపీట్ అయ్యింది. గత ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్… ఎన్డీఏ కూటమి ధాటికి కేవలం 11 సీట్లకే పరిమితమైంది. సరిగ్గా అలాంటి తీర్పు ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని లక్ష్యంగా చేసుకున్న తేజస్వి యాదవ్‌కు తగిలింది. చరిత్రలో కనీవినీ ఎరుగని దెబ్బ ఇది. లాలూ ప్రసాద్ యాదవ్ వారసుడిగా… రెండు సార్లు ఉప ముఖ్యమంత్రిగా… ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా చక్రం తిప్పిన తేజస్వి నేతృత్వంలోని మహా ఘట్ బంధన్ కు బీహార్ ఓటర్లు ఊహించని ఝలక్ ఇచ్చారు.

బీహార్‌లో సునామీ: ఎన్డీఏ గుప్పిట్లో అసెంబ్లీ
మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌లో ఎన్డీఏ కూటమి ఏకంగా 80 శాతానికి పైగా సీట్లు గెలుచుకుని అసెంబ్లీని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలోని కూటమి తిరుగులేని శక్తిగా అవతరించింది. మరోవైపు తేజస్వి యాదవ్ పార్టీ ఆర్జేడీ బీహార్ అసెంబ్లీలో అతి చిన్న పార్టీగా మారిపోయే పరిస్థితి దాపురించింది. మహాఘట్ బంధన్‌కు దక్కింది కేవలం 34 సీట్లు మాత్రమే. గతంలో ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ఉన్న తేజస్వికి ఇప్పుడు కనీసం కూటమి నేతగా మాత్రమే విపక్ష హోదా దక్కే ఛాన్స్ ఉంది. ఈ అనూహ్య పతనం బీహార్ రాజకీయాలను ఒక్కసారిగా ఊపేసింది.
విపక్షం గొంతుకు సంకెళ్లే…
ఎన్నికల ఫలితాలు విశ్లేషిస్తే బీహార్ ప్రజలు తమ వ్యతిరేకతను అధికార పక్షంపై కాకుండా విపక్షంపై చూపించారని తేలిపోయింది. జంబో జెట్ లాంటి అధికార పక్షం ఎన్డీఏ ముందు… కేవలం 34 సీట్లతో ఉన్న విపక్ష కూటమి గొంతు ఎంతవరకు వినిపిస్తుంది? విపక్షానికి కనీసం మైక్ అయినా దక్కుతుందా? అన్న చర్చ ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. సభలో చర్చలు, ప్రశ్నించే హక్కు, కమిటీలలో భాగస్వామ్యం వంటి అంశాలలో చిన్న సంఖ్యలో ఉన్న విపక్షం ఎదురుదెబ్బ తినడం ఖాయం.
లాలూ వారసత్వం ఏం కావాలి?
ఈ ఎన్నికల ఫలితాలు లాలూప్రసాద్ యాదవ్ వారసుడిగా తేజస్వి యాదవ్‌పై తీవ్ర ఒత్తిడి పెంచుతాయి. యువ నాయకుడిగా, విపక్ష నేతగా ఐదేళ్ల అనుభవం ఉన్నా ప్రజలు ఆయన నాయకత్వాన్ని పూర్తిగా తిరస్కరించినట్లు తేలిపోయింది. ఆర్జేడీకి ఇది కేవలం ఎన్నికల్లో ఓటమి మాత్రమే కాదు… రాజకీయ ఉనికికి సంబంధించిన సమస్యగా మారింది. బీహార్ ప్రజల ఈ సంచలన తీర్పు దేశ రాజకీయాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అధికార పక్షానికి తిరుగులేని అధికారాన్ని అప్పగించడం… విపక్షాన్ని నిర్వీర్యం చేయడం అనే ఈ ట్రెండ్ దేశంలోని ఇతర రాష్ట్రాల ఎన్నికల భవిష్యత్తును కూడా ప్రశ్నిస్తోంది. యువ నేతలు జగన్, తేజస్వి యాదవ్ ల రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు అలముకున్నాయి.