ది గర్ల్‌’ట్రెండ్’ – హీరోల హవాకు తెర… హీరోయిన్ మనసే కథ

  • దక్షిణాది ప్రేమ కథా చిత్రాలలో సరికొత్త శకం
  • సూప్ బాయ్ కల్చర్‌పై సినిమా తిరుగుబాటు
  • 12 మంది మహిళలు ఫైనల్ చేశాకే ‘గర్ల్ ఫ్రెండ్’
  • ఈ సినిమా చూసే వారిలో 70% మంది స్త్రీలే

సహనం వందే, హైదరాబాద్:
దశాబ్దాలుగా భారతీయ ప్రేమ కథా చిత్రాలలో హీరోదే అగ్రస్థానం. కథంతా అమ్మాయిని గెలవడానికి హీరో పడే తపన, అతని బాధ, విజయం చుట్టూనే తిరిగేది. హీరోయిన్ పాత్ర కేవలం కథను ముందుకు నడిపే సాధనంగా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒక ముఖ్యమైన మలుపు చోటుచేసుకుంది. ఆమెకు ఏం కావాలి? అనే ప్రశ్న చుట్టూ కథను అల్లుతూ కొత్త తరం దర్శకులు సంప్రదాయ ప్రేమ కథా నిర్మాణాన్ని సమూలంగా మారుస్తున్నారు.

సూప్ బాయ్ కల్చర్‌పై తిరుగుబాటు…
తిరస్కరణకు గురైన ప్రేమికుడి (సూప్ బాయ్) బాధను గొప్పగా చూపించే ట్రెండ్‌కు వ్యతిరేకంగా ఈ కొత్త సినిమాలు వస్తున్నాయి. ది గర్ల్‌ఫ్రెండ్ దర్శకుడు రాహుల్ రవీంద్రన్… ప్రతీకారం తీర్చుకునే హీరోకు చప్పట్లు కొట్టే విధానం నచ్చక కెమెరాను ఆ అమ్మాయి వైపు తిప్పి కథను ఆమె కోణం నుంచి చూపాలని నిర్ణయించుకున్నారు. ది గర్ల్‌ఫ్రెండ్, లవర్, ఇతిరి నేరమ్ వంటి చిత్రాలు బలమైన మహిళా పాత్రలను జోడించడమే కాకుండా ప్రేమ కథా చిత్రం యొక్క ఆత్మనే ప్రశ్నిస్తున్నాయి.

మార్పు కోసం కథన నిర్మాణం
ఈ కొత్త తరహా కథలు కథన నిర్మాణాన్ని మార్చాయి. అడగకుండానే హీరోయిన్‌ను హీరో రక్షించడం వంటివి ఎంత అసౌకర్యంగా ఉంటాయో రాహుల్ రవీంద్రన్ వెల్లడించారు. లవర్ ఫేం ప్రభూరామ్ వ్యాస్… కథ ఇద్దరి వ్యక్తుల గురించి చెబుతూ, ఇద్దరి దృక్కోణాలు ఉన్నప్పుడే ఆ సంబంధంలో నాటకీయత వస్తుందని తెలిపారు. అహంకారం, సంబంధాల డైనమిక్స్ వంటి వాటిని హీరోయిన్ పాత్ర ద్వారా ప్రశ్నించడం ఈ సినిమాల ప్రత్యేకత.

రచయితల బాధ్యత… మహిళల సహకారం
మహిళా పాత్రలను రియారిటీకి దగ్గరగా రాయడం కోసం ఈ దర్శకులు మహిళల నుంచి నిర్మోహమాటమైన అభిప్రాయాన్ని తీసుకున్నారు. రాహుల్ రవీంద్రన్ మొదటి డ్రాఫ్ట్ పూర్తవగానే 12 మంది మహిళా మిత్రులకు పంపగా… వారి బ్రేకప్ కథలు, దారుణ అనుభవాలు తనకు కనువిప్పు కలిగించాయని తెలిపారు. ఈ అభిప్రాయాల వల్లే ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాలో హీరోకు ప్రాయశ్చిత్తం (రిడెంప్షన్) ఇచ్చే భాగాన్ని తొలగించానని, ఎందుకంటే చెడు పనులు చేసిన పురుషులు శిక్ష లేకుండా తప్పించుకోకూడదనే స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

తొలగుతున్న సంకెళ్ళు… పెరిగిన ఆదాయం
ఈ కొత్త ప్రేమ కథలు మహిళలను ఉన్నతంగా చూపడమే కాకుండా, పురుషులకు కూడా భావోద్వేగాలను వ్యక్తం చేయలేని సాంప్రదాయ సిద్ధాంతాల నుంచి స్వేచ్ఛ లభిస్తోంది. సినీ పెద్దలు మొదట్లో అంగీకరించకపోయినా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం… ముఖ్యంగా ది గర్ల్‌ఫ్రెండ్ చూసేందుకు 70 శాతం మహిళా ప్రేక్షకులు రావడం ఈ ట్రెండ్‌ను బలోపేతం చేసింది. తమ కథనాలు ప్రతిధ్వనించే విధంగా ఉంటే మహిళా ప్రేక్షకులు కచ్చితంగా సినిమాను ఆదరిస్తారని ఈ విజయం నిరూపించింది. ఇది కథ చెప్పే విధానంలో ఒక సాంస్కృతిక విప్లవం అని విశ్లేషకులు చెబుతున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *