- టెక్ దిగ్గజం… దొంగల ముఠా!
- వ్యక్తిగత జీవితంపై నిఘా…
సహనం వందే, అమెరికా:
తమ కొత్త ఏఐ సాధనం జెమినిని అడ్డుపెట్టుకుని యూజర్ల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత డేటాను, రహస్య సంభాషణలను గుట్టుగా దొంగిలిస్తోందంటూ అమెరికాలో గూగుల్ సంస్థపై దావా దాఖలైంది. మనం స్నేహితులతో షేర్ చేసుకునే ప్రతి చిన్న మాట… వ్యాపార రహస్యాలు దాగి ఉన్న ప్రతి ఈమెయిల్… పంపే ప్రతి ఫోటో… పత్రం… అన్నీ గూగుల్ నియంత్రణలో ఉన్న ఈ జెమిని ఏఐకి అందుబాటులోకి వెళ్లిపోవడం టెక్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వినియోగదారుల ప్రైవసీకి గూగుల్ తాళం వేసి, ఆ తాళం చెవితోనే అక్రమంగా డేటాను దోచుకుందనేది ఈ ఫిర్యాదు సారాంశం.
రహస్యంగా రంగంలోకి ఏఐ…
గూగుల్ ఈ గోప్యతా ఉల్లంఘనకు పాల్పడిన విధానం చూస్తే దిగ్భ్రాంతి కలగక మానదు. సాధారణంగా యూజర్లు తమకు ఏఐ సేవలు కావాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి దాన్ని స్వయంగా ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ గత అక్టోబర్ నెలలో గూగుల్ తన నియమాలను తుంగలో తొక్కింది. ఎవరికీ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా రహస్యంగా ఈ జెమిని ఏఐ ఫీచర్‌ను అత్యంత కీలకమైన అప్లికేషన్లైన జీమెయిల్, చాట్, మీట్ (వీడియో సమావేశాలు)లో ఆటోమేటిక్‌గా యాక్టివేట్ చేసేసింది. దీని అర్థం ఏమిటంటే నిన్నటి వరకు భద్రంగా ఉన్న మన వ్యక్తిగత సంభాషణలు ఒక్క రాత్రిలో జెమిని ఏఐ చేతిలోకి వెళ్లాయి. యూజర్లు కనీసం తమ డేటాకు ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది.
వ్యక్తిగత జీవితంపై నిఘా…
ఈ దావాలో ప్రస్తావించిన డేటా పరిధి మరింత భయాన్ని కలిగిస్తోంది. జెమిని ఏఐ కేవలం చాట్ సందేశాలను మాత్రమే కాకుండా యూజర్లు జీమెయిల్‌లో పంపిన లేదా అందుకున్న ప్రతి ఒక్క ఈమెయిల్‌ను, వాటికి జతచేసిన (అటాచ్‌మెంట్) పత్రాలు, ఫోటోలు, ఇతర ఫైళ్ల పూర్తి చరిత్రను కూడా యాక్సెస్ చేసింది. దీని ద్వారా మన వ్యక్తిగత ఆరోగ్య సమాచారం, గోప్యమైన కార్యాలయ పత్రాలు, బ్యాంకు వివరాలు, అత్యంత వ్యక్తిగత సంభాషణలు అన్నీ ఒక కృత్రిమ మేధకు… తద్వారా గూగుల్‌కు తెలిసిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనిని కేవలం డేటా సేకరణ అని చెప్పడం కంటే కోట్లాది మంది వ్యక్తిగత జీవితాలపై పెద్ద సంస్థ చేపట్టిన రహస్య నిఘాగా అభివర్ణించవచ్చు. సాంకేతికత పేరుతో జరిగిన ఈ అత్యంత పెద్ద గోప్యతా ఉల్లంఘనపై న్యాయపరమైన చర్యలు తప్పవని న్యాయ నిపుణులు గట్టిగా వాదిస్తున్నారు.
యూజర్‌ను ముంచే ఎత్తుగడ!
గూగుల్ సంస్థ అనుసరించిన మరో మోసపూరిత విధానం ఏంటంటే ఈ టూల్‌ను ఆన్ చేయడం ఎంత సులభమో దాన్ని నిలిపివేయడం (డియాక్టివేట్ చేయడం) అంత కష్టం చేసింది. జెమిని ఏఐని ఆపాలనుకున్న యూజర్లకు దాన్ని సులభంగా ఆపే ఆప్షన్ ఇవ్వలేదు. బదులుగా యూజర్లు గూగుల్ ‘ ప్రైవసీ సెట్టింగ్స్ లోకి లోతుగా వెళ్లి చాలా కష్టపడి దాన్ని డియాక్టివేట్ చేయాల్సి వస్తోంది. ఈ క్లిష్టమైన ప్రక్రియను చూసి ఎక్కువ మంది యూజర్లు నిరాశతో ఆ ప్రయత్నం మానుకుంటున్నారు. తద్వారా వారి డేటాను నిరంతరాయంగా సేకరించవచ్చని గూగుల్ వ్యూహం పన్నిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
చట్టం ఏం చెబుతోంది?
ఈ రహస్య డేటా సేకరణ కాలిఫోర్నియా ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ యాక్ట్‌ను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని న్యాయవాదులు కోర్టులో వాదిస్తున్నారు. ఈ చట్టం ప్రకారం… ‘ఎవరైనా ఇద్దరు చర్చించుకునే సమాచారాన్ని వారి అనుమతి లేకుండా వారి సంభాషణలను రహస్యంగా రికార్డు చేయడం లేదా నిఘా పెట్టడం చట్ట విరుద్ధం’. కానీ గూగుల్ ఇద్దరి అనుమతి తీసుకోకుండా జెమిని ద్వారా వారి సంభాషణలను యాక్సెస్ చేయడం ద్వారా చట్టాన్ని ధిక్కరించింది. ఏఐ టెక్నాలజీ అనేది కేవలం మనకు సాయం చేయడానికే కాకుండా భారీ టెక్ సంస్థలు మన వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా పర్యవేక్షించడానికి కూడా వాడుకునే అవకాశం ఉందని ఈ కేసు ప్రపంచానికి స్పష్టంగా హెచ్చరించింది. ఈ సాంకేతిక యుగంలో గోప్యత ఎంత ప్రమాదంలో ఉందో మరోసారి చాటి చెప్పిన ఈ కేసులో గూగుల్ సమాధానం, కోర్టు తీర్పు అంతర్జాతీయంగా అత్యంత ఆసక్తికరంగా మారింది.