ధోనీ రీలోడింగ్… గంటలకొద్దీ ప్రాక్టీసింగ్ – ఐపీఎల్- 2026 కోసం కఠోరమైన శ్రమ

  • 44 ఏళ్ల వయసులోనూ 5 గంటల సాధన
  • గంటపాటు జిమ్ములో కసరత్తులు
  • తర్వాత 2-3 గంటల పాటు క్రికెట్ ప్రాక్టీస్
  • అనంతరం కొద్దిసేపు స్విమ్మింగ్

సహనం వందే, రాంచీ:
భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన నాయకుడిగా నిలిచిన మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్- 2026 కోసం కఠోర సాధనతో సిద్ధమవుతున్నాడు. 44 ఏళ్ల వయసులో కూడా యువ క్రికెటర్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా రాంచీలోని జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియంలో రోజుకు దాదాపు ఐదు గంటల పాటు చెమటోడుస్తున్నాడు. బైక్‌లపై తన ఇంటి నుంచి స్టేడియంకు చేరుకునే ధోనీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఐపీఎల్ 2025లో సీఎస్‌కే తొలిసారిగా లీగ్ పట్టికలో అట్టడుగున నిలిచి ప్లేఆఫ్స్‌కు చేరకుండానే నిష్క్రమించినా… ధోనీ మాత్రం ఆ ఓటమిని పక్కన పెట్టి ముందడుగు వేస్తున్నాడు. కసిగా శిక్షణ తీసుకుంటున్న ఈ మాజీ కెప్టెన్‌ను చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

సిక్సర్ల కోసం సరికొత్త శిక్షణ షెడ్యూల్…
గత రెండు నెలలుగా ధోనీ దినచర్య పూర్తిగా మారిపోయిందని జేఎస్‌సీఏ అధికారులు వెల్లడించారు. ‘ధోనీ రోజువారీ షెడ్యూల్ మారి రెండు నెలలైంది. సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు స్టేడియానికి వస్తాడు. మొదట ఒక గంట పాటు జిమ్‌లో కఠినమైన వ్యాయామం చేస్తాడు. ఆ తర్వాత ప్యాడ్స్ కట్టుకుని ఏకంగా రెండు గంటలు నెట్స్‌లో పవర్-హిట్టింగ్ శిక్షణ తీసుకుంటాడు. ప్రధాన పిచ్ ఖాళీగా ఉండి మ్యాచ్ లేకపోతే గ్రౌండ్ లోనే మ్యాచ్ వాతావరణాన్ని తలపించేలా సిమ్యులేషన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తాడు. ఈ శిక్షణ పూర్తయ్యాక మరో అరగంట పాటు స్విమ్మింగ్ చేసి సాయంత్రం 6 గంటలకు స్టేడియం నుంచి ఇంటికి బయలుదేరుతాడ’ని జేఎస్‌సీఏ అధికారి ఒకరు తెలిపారు. తాను జీవితంలో ఎప్పుడూ చేసినట్టే ధోనీ ఇప్పుడు కూడా తన పనిని కష్టపడి చేసుకుపోతున్నాడని ఆయన పేర్కొన్నారు.

సామ్సన్ ఎంట్రీ: ధోనీ పాత్ర మారనుందా?
ఐపీఎల్ 2026లో ధోనీ పాత్ర ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజు సామ్సన్ ట్రేడ్ డీల్‌లో సీఎస్‌కేలో చేరనున్నట్లు సమాచారం. 2008 నుంచి సీఎస్‌కేతో ప్రయాణం చేసి ఆ జట్టుకు ఐదు ఐపీఎల్ టైటిళ్లను అందించిన ధోనీ… సామ్సన్ చేరికతో తనపై ఉన్న భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. ధోనీ కొన్ని కీలక మ్యాచ్‌లను ఎంచుకుని ఆడటం, వికెట్ కీపింగ్ బాధ్యతలను సామ్సన్‌కు అప్పగించడం వంటి వ్యూహాలను సీఎస్‌కే అనుసరించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ధోనీ మాత్రం ఐపీఎల్ 2026 కోసం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండేందుకు తన శిక్షణలో ఏ మాత్రం రాజీ పడకుండా కృషి చేస్తున్నాడు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *