- ముఖ్యమంత్రి రేవంత్ వ్యూహానికి బలం
- మైక్రో మేనేజ్‌మెంట్ మాయాజాలం…
- సామాజిక సమీకరణ… ఎంఐఎం మద్దతు
సహనం వందే, హైదరాబాద్:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి, ఆయన అనుసరించిన వ్యూహాలకు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సాధించిన విజయం తిరుగులేని ధైర్యాన్ని ఇచ్చింది. ఇది కేవలం ఒక స్థానం పెరగడం మాత్రమే కాదు… రాష్ట్ర రాజకీయాలలో రేవంత్ రెడ్డి స్థానాన్ని మరింత బలోపేతం చేసిందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత కంటోన్మెంట్, ఆ తర్వాత ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో సిట్టింగ్ బీఆర్ఎస్ స్థానాలను కాంగ్రెస్ గెలవడం ఆయన సారథ్యానికి రెండో గొప్ప విజయంగా నిలిచింది. ఈ రెండు విజయాలు రేవంత్ రెడ్డి ప్రతిష్ఠను పెంచడంలో కీలక పాత్ర పోషించాయి.
మైక్రో మేనేజ్‌మెంట్ మాయాజాలం…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉపఎన్నికల్లో అనుసరించిన మైక్రో-మేనేజ్‌మెంట్ వ్యూహమే విజయానికి ముఖ్య కారణం. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా… ఆయన నియోజకవర్గంలోని ఏడు డివిజన్లలో స్వయంగా సభలు, రోడ్ షోలు నిర్వహించి ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు, పాలన పట్ల ప్రజల్లో ఉన్న సంతృప్తిని బలంగా ప్రచారం చేయగలిగారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వాడిన సానుభూతి అస్త్రాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ఆయన విజయం సాధించారు.
సామాజిక సమీకరణ… ఎంఐఎం మద్దతు
నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంలో రేవంత్ రెడ్డి చూపిన తెగువ మంచి ఫలితాన్ని ఇచ్చింది. జూబ్లీహిల్స్‌లో యాదవ, ముస్లిం ఓటర్లు కీలకమైనవారు. బలమైన యాదవ నేపధ్యం ఉన్న నవీన్ యాదవ్‌ను ఎంపిక చేయడంతో పాటు, ఎంఐఎం మద్దతును కూడగట్టడంలో రేవంత్ సఫలమయ్యారు. కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా మైనారిటీ వర్గాన్ని ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నం కూడా కాంగ్రెస్ గెలుపునకు దోహదపడింది. ఈ సామాజిక సమీకరణాలు, వ్యూహాత్మక ఎత్తుగడలు కాంగ్రెస్ విజయాన్ని సులభతరం చేశాయి.
సీనియర్లు నిశ్శబ్దం…
ఈ వరుస విజయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద పట్టును మరింత పెంచాయి. పార్టీలో అంతర్గత విభేదాలు, సీనియర్ నాయకుల నుండి సవాళ్లు ఉన్నప్పటికీ… ఈ గెలుపులు ఆయన నాయకత్వాన్ని ప్రశ్నించే అవకాశం లేకుండా చేశాయి. జూబ్లీహిల్స్ ఓడిపోతే రేవంత్‌ను బాధ్యుడిని చేయాలని చూసిన సీనియర్లకు ఈ విజయం నిరాశ కలిగించింది. రేవంత్ నాయకత్వం ముందు సీనియర్ నాయకులు ప్రస్తుతానికి నిశ్శబ్దంగా వెనక్కి తగ్గక తప్పలేదు.
జీహెచ్ఎంసీ గురి…
జూబ్లీహిల్స్ విజయం హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ కంచుకోటను ఛేదించడంలో కాంగ్రెస్‌కు కీలకమైన మైలురాయి. ఈ విజయం రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలతో సహా స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ దూకుడును పెంచడానికి పునాదిగా ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద జూబ్లీహిల్స్ విజయం రేవంత్ ఇమేజ్‌ను పెంచడంతో పాటు, తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఆయన తిరుగులేని నాయకుడిగా మారారని చెప్పవచ్చు. ఈ విజయం భవిష్యత్తు ఎన్నికలకు మార్గం సుగమం చేసింది.