పోరాడి ఓడిన సివిల్స్ యోధుడు – దశాబ్ద కాలపు ప్రయాణం

  • 12 ప్రయత్నాలు… 5 ఇంటర్వ్యూలు
  • విధి రాత ముందు ఓడిన లక్ష్యం

సహనం వందే, న్యూఢిల్లీ:
ఐఏఎస్ కావాలనేది లక్షలాది మంది యువత కల. అయితే ఆ కల కోసం ఒక దశాబ్దానికి పైగా ఒంటరి పోరాటం చేసిన ఓ వ్యక్తి ఉదంతం ఇప్పుడు ఎంతోమంది హృదయాలను కదిలిస్తోంది. కునాల్ ఆర్ విరుల్కార్ అనే అభ్యర్థి ఏకంగా 12 సార్లు సివిల్స్ పరీక్షలో విజయం సాధించడానికి శ్రమించారు. పట్టుదలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆయన ప్రయాణం 2012లో మొదలైంది. 7 సార్లు ప్రిలిమ్స్ అడ్డంకిని దాటి మెయిన్స్ వరకు చేరుకున్నారు. 5 సార్లు మెయిన్స్‌ను జయించి… ఇంటర్వ్యూ పరీక్షలోనూ పాల్గొన్నారు. కానీ ప్రతిసారీ విధి ఆయన్ని వెక్కిరించింది. ఆఖరికి గమ్యం చేరకుండానే నిరాశే మిగిలింది.

అదృష్టం తప్పిన వేళ
కునాల్ ప్రయాణంలో నిరాశే ఉన్నా ఎన్నో ఆశలు నిండిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2015లో తొలిసారి ఇంటర్వ్యూకు హాజరైనప్పుడు కేవలం 52 మార్కుల తేడాతో విజయాన్ని కోల్పోయారు. అయినా నిరుత్సాహపడకుండా తిరిగి ప్రయత్నించారు. అయితే ఆ తర్వాత రెండేళ్లు (2016, 2017) ప్రిలిమ్స్‌లోనే ఓటమి చవిచూశారు. మళ్లీ ఊపిరి పీల్చుకొని 2018లో ప్రిలిమ్స్, మెయిన్స్ రెండూ దాటి ఇంటర్వ్యూకు వెళ్లారు. కానీ ఆసమయంలో సర్వీస్ దక్కడానికి ఒక్క మార్కు తక్కువ రావడంతో విఫలమయ్యారు. 2023లో చివరి ప్రయత్నంలో కూడా కేవలం 9 మార్కుల స్వల్ప తేడాతో కేంద్ర సర్వీసుల అవకాశం చేజారింది. అంతకు ముందు కూడా 10 మార్కులు, 16 మార్కులు వంటి స్వల్ప తేడాలతో విజయం ఆయన్ని దాటిపోయింది.

జీవితమంటే సంఘర్షణే…
ఇన్ని అపజయాల తరువాత కూడా కునాల్ విరుల్కార్ నిరాశ చెందకుండా తన ప్రయాణాన్ని సివిల్స్ అభ్యర్థులతో పంచుకున్నారు. 12 ప్రయత్నాలు, 7 సార్లు ప్రిలిమ్స్‌లో విజయం, 5 సార్లు ఇంటర్వ్యూకు హాజరైనా.. ఫలితం మాత్రం లేదంటూ కునాల్ చెప్పిన మాటలు ఎంతోమందిని ఆలోచింపజేశాయి. ఈ అసాధారణ పోరాటం చివర్లో… ‘జీవితం అంటేనే సంఘర్షణ’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్య ఎందరికో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూతో ఆయన స్ఫూర్తిదాయక కథనం మళ్లీ చర్చనీయాంశమై లక్ష్యం కోసం పోరాడే ప్రతి యువకుడికి ఒక పాఠంగా నిలుస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *