- మూడు బొమ్మలు… 5.28 కోట్లకు వేలం
- బాబ్ రాస్ మాయ… కోట్లల్లో కొనుగోలు
- ఆశ్చర్యంలో కళాలోకం… సాయానికి సొమ్ము
సహనం వందే, అమెరికా:
అద్భుతమైన ప్రకృతి చిత్రాలను గీసి తనదైన శైలితో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న దివంగత టీవీ హోస్ట్, చిత్రకారుడు బాబ్ రాస్ మాయాజాలం మరోసారి రుజువైంది. ఆయన చిత్రాలకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్ చూసి కళాలోకం ఆశ్చర్యపోతోంది. తాజాగా లాస్ ఏంజిల్స్ లో జరిగిన వేలంలో బాబ్ రాస్ వేసిన మూడు చిత్రాలు కలిపి అక్షరాలా రూ. 5.28 కోట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఎంతో సాధారణ ప్రకృతి చిత్రాలు రికార్డు ధరలు పలుకుతున్నాయి. ఈయన చిత్రాల పవర్ ఏమిటో ఇప్పుడు అందరూ ముక్కున వేలేసుకుని చూస్తున్నారు.


మంచు కుటీరానికి రూ. 2.79 కోట్లు
బాబ్ రాస్ చిత్రాల వేలంలో ధరలు చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. మంచు కప్పిన గుట్టల మధ్య, పచ్చని చెట్ల మధ్య ఉన్న కుటీరాన్ని చిత్రీకరించిన వింటర్స్ పీస్ (1993) అనే చిత్రం ఏకంగా రూ. 2.79 కోట్లు పలికింది. అలాగే నీలం ఆకాశం, పర్వతాల మధ్య ఒక సరస్సు ఒడ్డున ఉన్న అందమైన ఇంటిని చూపించే హోమ్ ఇన్ ది వ్యాలీ (1993) చిత్రం రూ. 2.01 కోట్లకు అమ్ముడైంది. ఇక లోయ గుండా ప్రవహిస్తున్న నదిని, కొండను చూపే క్లిఫ్‌సైడ్ (1990) చిత్రం కూడా రూ. 1.01 కోట్లు ధరను తాకింది. అత్యంత సంక్లిష్టమైన ఆర్టిస్టుల చిత్రాలతో సమానంగా, సాధారణంగా కనిపించే ఈ ప్రకృతి చిత్రాలు ఇంత ధర పలకడం కళా ప్రపంచంలో చర్చనీయాంశమైంది.
ప్రభుత్వ టీవీ కోసం బాబ్ రాస్ సొమ్ము
బాబ్ రాస్ చిత్రాల వేలం వెనుక ఒక మంచి ఉద్దేశం దాగి ఉంది. అమెరికాలోని ప్రభుత్వ ప్రసార సంస్థలకు (పబ్లిక్ బ్రాడ్ కాస్టర్స్) కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల కోత పడింది. వారికి ఆర్థికంగా చేయూత అందించే లక్ష్యంతో బాబ్ రాస్ ఎస్టేట్ ను చూసుకునే సంస్థ అధ్యక్షుడు జోన్ కొవాల్స్కీ మొత్తం 30 చిత్రాలలో మూడింటిని వేలం వేసి అమెరికన్ పబ్లిక్ టెలివిజన్ కు విరాళంగా ఇచ్చారు. ఈ వేలం మొదటి దశ మాత్రమే. మిగిలిన 27 చిత్రాలను బోన్‌హామ్స్ అనే వేలం సంస్థ వచ్చే ఏడాదిలో బోస్టన్, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ లో పలుమార్లు వేలం వేయనుంది. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం డబ్బు బాబ్ రాస్ ది జాయ్ ఆఫ్ పెయింటింగ్ అనే కార్యక్రమాన్ని ప్రసారం చేసిన ప్రభుత్వ టీవీ స్టేషన్ల ఆర్థిక కష్టాలు తీర్చడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా బాబ్ రాస్ మరణానంతరం కూడా తన చిత్రాలతో తనకు ఆశ్రయమిచ్చిన ప్రజా ప్రసార వ్యవస్థకు అండగా నిలబడటం గొప్ప విషయం.