- రాత్రి ఏడు లోపే భోజనం పూర్తి
- ఇలా చేస్తే డైటింగ్ అవసరమే లేదు
- స్పష్టం చేస్తున్న వైద్య నిపుణులు
సహనం వందే, హైదరాబాద్:
ఎప్పుడూ యవ్వనంగా ఉల్లాసంగా ఉండాలంటే ప్రత్యేక డైట్‌లు, ఖరీదైన సప్లిమెంట్లు అవసరం లేదని జీర్ణకోశ వ్యాధి నిపుణులు అంటున్నారు. చాలా సులువైన ఒకే ఒక్క సాధారణ నియమం పాటిస్తే సరిపోతుందని చెపుతున్నారు. ఆ రహస్యం మరేదో కాదు… రాత్రి భోజనాన్ని త్వరగా పూర్తి చేయడమే. 60 ఏళ్లు దాటినా తన యవ్వన శక్తితో ఆకట్టుకుంటున్న అగ్ర నటుడు నాగార్జున అలవాటు కూడా సరిగ్గా ఇదే కావడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
అందుకే నాగార్జున ఫిట్!
నాగార్జున ఆరోగ్య రహస్యాన్ని వైద్యులు ఉదాహరణగా చెబుతున్నారు. నాగార్జున ప్రతీరోజూ రాత్రి 7 గంటలలోపే భోజనం పూర్తి చేస్తారని… అందులో సలాడ్, కొద్దిగా అన్నం, చికెన్ లేదా చేపలు ఉంటాయని తెలిపారు. అక్కినేని ఈ అలవాటును డాక్టర్లు ప్రశంసిస్తున్నారు. ‘ఆయన 60 ఏళ్ల వయస్సులోనూ యవ్వనంగా, ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండటానికి ఇదే అసలు రహస్యం’ అని పేర్కొన్నారు. సూర్యుడు అస్తమించాక ఆహారం మానేయడం అందరూ పాటించదగిన మంచి అలవాటని నిపుణులు చెప్తున్నారు.
ఆహారం తీసుకునే సమయమే కీలకం…
మనిషి ఆరోగ్యానికి ఆహారం తీసుకునే సమయం ఎంతో కీలకమని వైద్యులు వివరిస్తున్నారు. మన శరీరంలోని ప్రతి కణానికీ ఒక నిద్ర విధానం ఉంటుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ కణాలు రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటాయి. సూర్యరశ్మి లేనప్పుడు జీర్ణ హార్మోన్లు కూడా విశ్రాంతిలోకి వెళతాయి. అయితే ఆలస్యంగా ఆహారం తీసుకుంటే… నిద్రించడానికి ప్రయత్నించినా శరీరం ఇంకా జీర్ణక్రియలోనే నిమగ్నమై ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి (బ్లడ్ షుగర్ లెవెల్), ఇన్సులిన్ స్థాయి పెరుగుతాయి.
కొవ్వు నిల్వకు చెక్ పెట్టొచ్చు..
దీర్ఘకాలంలో ఆలస్యంగా తినే అలవాటు జీవక్రియను (మెటబాలిజాన్ని) ప్రభావితం చేసి శరీరంలో కొవ్వు నిల్వను పెంచుతుంది. అనేక శాస్త్రీయ అధ్యయనాలు కూడా దీనిని ధ్రువీకరించాయి. త్వరగా భోజనం ముగించే వారికి మంచి నిద్ర, మెరుగైన ఆరోగ్యం లభిస్తాయి. అంతేకాక ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే… ‘మీరు ఏం తింటున్నారు అనేది ముఖ్యం కాదు… మీరు ఎప్పుడు తింటున్నారన్నది ముఖ్యం’ అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
14-16 గంటల ఉపవాసం: శరీరం రీఛార్జ్!
రాత్రి భోజనం తర్వాత, తదుపరి భోజనానికి మధ్య 14 నుండి 16 గంటల విరామం ఉంచడాన్ని సమయ-నియంత్రిత ఆహారపు అలవాటు (టైమ్-రెస్ట్రిక్టెడ్ ఈటింగ్) అంటారు. ఈ ఉపవాసం వల్ల శరీరం సహజంగా తనను తాను మరమ్మత్తు చేసుకోవడానికి, పునరుద్ధరించుకోవడానికి సాయపడుతుంది. యవ్వనంగా ఉండటానికి సంక్లిష్టమైన ప్రణాళికలు అవసరం లేదు. రాత్రి 7 గంటల లోపు భోజనం పూర్తి చేయడం వంటి సాధారణ నిరంతర అలవాట్లే దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని, చురుకుదనాన్ని కాపాడతాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.