- ఎగ్జిట్ పోల్స్ వెనుక కార్పొరేట్ కుట్ర!
- తెర వెనుక పొలిటికల్ లాబీయింగ్ గోల్
- గోడ దూకే నాయకులకు ఆయుధం!
- కుర్చీ దిగేవరకు యంత్రాంగంపై పట్టు కోసం
సహనం వందే, హైదరాబాద్:
ఎన్నికల ఫలితాల ప్రకటనకు ముందు ఉత్కంఠను అమాంతం పెంచే ఎగ్జిట్ పోల్స్ కేవలం ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే తీర్పు కాదు. ఇది రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం పకడ్బందీగా అల్లిన అంకెల జూదం. వీటి ఉద్దేశం.. రాజకీయ పార్టీలు, కార్పొరేట్ వర్గాలు తమ ఆర్థిక వ్యూహాలను అమలు చేసుకోవడమే. అంతేకాదు కౌంటింగ్‌కు ముందు తమ ప్రేక్షకులను, పాఠకులను నిలుపుకునేందుకు మీడియాకు పనికివస్తాయి. అందుకే దీనిని కేవలం ఉత్కంఠ కోసమే అనుకుంటే పొరపాటే.
గోడ దూకే నాయకులకు ఆయుధం!
కొన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్ వాస్తవ ఫలితాలకు పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. దీని వెనుక బలమైన అనుమానాలు కూడా ఉన్నాయి. రాజకీయ పార్టీలు డబ్బు పెట్టి తమకు అనుకూలంగా పోల్స్‌ను తయారు చేయిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇది బహిరంగ రహస్యం. ఓ పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతోందని పోల్స్ పదేపదే చెబితే… అది ఆ పార్టీకి అనుకూలంగా ఓ బలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. చిన్న పార్టీల నుంచి, స్వతంత్రుల నుంచి మద్దతు కూడగట్టుకోవడానికి లేదా ఓటమి పాలవుతుందని ప్రచారం జరిగే పార్టీ నాయకుల్లో నైరాశ్యం నింపి వారిని తమ వైపునకు లాక్కోవడానికి ఈ అంచనాలు అద్భుతంగా పనిచేస్తాయి. జంప్ జిలానీలు గోడ దూకడానికి ఈ ఫలితాలే ఒక ప్రధాన కారణంగా మారుతున్నాయి.
చివరివరకు యంత్రాంగంపై పట్టు…
అంతేకాదు కొన్ని సందర్భాల్లో అధికారంలో ఉండే పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు తమకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తయారు చేయించుకుంటాయి. ఎన్నికల కౌంటింగ్ జరిగే వరకు ప్రభుత్వంలో అనేక పనులను చక్కబెట్టేందుకు ఈ ఎగ్జిట్ పోల్స్ ను ఉపయోగించుకుంటాయన్న విమర్శలున్నాయి. అధికార యంత్రాంగం చివరి వరకు తమ మాట వినేందుకు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ ఉపయోగపడతాయి.
స్టాక్ మార్కెట్ స్కామ్
ఎగ్జిట్ పోల్స్ వెల్లడి అవ్వగానే స్టాక్ మార్కెట్ అమాంతం కదులుతుంది. దేశంలో స్థిరమైన ప్రభుత్వం వస్తుందని పోల్స్ అంచనా వేస్తే… పెట్టుబడులు, వాణిజ్య వర్గాలు ఉత్సాహాన్ని చూపిస్తాయి. ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది. కొందరు వ్యాపారులు, కార్పొరేట్ పెద్దలు ఈ గెలుపు సమాచారాన్ని ముందుగానే తెలుసుకుని షేర్లు కొని రాత్రికి రాత్రే కోట్లు కొల్లగొడతారు. ఈ మార్కెట్ ఆటకు పోల్స్ తయారుచేసే ఏజెన్సీలు సైతం వంత పాడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డం పెట్టుకుని చేస్తున్న పెద్ద ఆర్థిక మోసం.
తీర్పు పవిత్రతపై నీలినీడలు!
ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అత్యంత పవిత్రమైనది. కానీ ఈ ఎగ్జిట్ పోల్స్… కౌంటింగ్ ఫలితాలు రాకముందే దాని పవిత్రతను ప్రభావితం చేస్తున్నాయి. డబ్బులిచ్చి అనుకూల పోల్స్‌ను చేయించుకోవడమంటే ప్రజాస్వామ్య స్ఫూర్తిని దిగజార్చడమే. ఎప్పుడు ఫలితాలు తారుమారైనా ఈ పోల్ ఏజెన్సీల విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతూనే ఉంది. అందుకే ఈ అంచనాలను కేవలం వినోదంగా మాత్రమే చూడాలి. ప్రజలు వీటి వెనుక ఉన్న రాజకీయ, ఆర్థిక స్వార్థాన్ని అర్థం చేసుకోవాలి. ఇది అంకెల ఆట మాత్రమే. అంతిమ తీర్పు మాత్రం బ్యాలెట్ పెట్టెలోనే ఉంది.