కామినేనికి ‘కోటి’తో చెంపపెట్టు – నల్గొండ జిల్లా వినియోగదారుల ఫోరం తీర్పు

  • డాక్టర్ల నిర్లక్ష్యంతో బాలింత మృతి ఘటనలో…
  • కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశం
  • రెండుసార్లు అనస్థీషియా ఇచ్చిన డాక్టర్లు
  • తర్వాత కోమాలోకి వెళ్లిందని దబాయింపు

సహనం వందే, నల్లగొండ:
నల్గొండ జిల్లాలోని నార్కట్‌పల్లిలో ఉన్న కామినేని ఆసుపత్రి వైద్యులు చేసిన ఘోర నిర్లక్ష్యంపై జిల్లా వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు ఇచ్చింది. డాక్టర్ల తప్పిదం కారణంగా బాలింత మరణించిన కేసులో మృతురాలి కుటుంబానికి ఏకంగా కోటి రూపాయల పరిహారం చెల్లించాలని ఫోరం ఆదేశించడం సంచలనం అయ్యింది.

డెలివరీకి వచ్చి ప్రాణాలు కోల్పోయి…
నల్గొండ జిల్లా చిట్యాల మండలానికి చెందిన అస్నాల స్వాతి డెలివరీ కోసం 2018 జూలై 13న కామినేని ఆసుపత్రిలో చేరింది. డాక్టర్లు ఆమెకు అనస్థీషియా ఇచ్చి శస్త్ర చికిత్స చేసి శిశువును బయటకు తీశారు. అయితే మరుసటి రోజు ఉదయం 9.15 గంటలైనా స్వాతికి స్పృహ రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. డాక్టర్లను అడిగితే మత్తుమందు డోస్ సరిపోకపోవడంతో రెండో డోస్ ఇచ్చామని… అందుకే స్పృహ రావడం ఆలస్యం అవుతుందని బుకాయించారు. గ్రామ పెద్దలు వచ్చి నిలదీయగా అప్పుడు గాని ఆమెను ఐసీయూలోకి తరలించలేదు.

కోమా అంటూ దబాయింపు…
ఐసీయూలో చేర్చిన తరువాత రోజు ఉదయం స్వాతి పడుకున్న బెడ్ రక్తంతో నిండిపోవడాన్ని చూసి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. డాక్టర్లను ప్రశ్నించగా… ఆమె కోమాలోకి వెళ్లిందని, వంద మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని డాక్టర్లు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఆ తరువాత స్వాతి భర్త క్రాంతికుమార్‌తో కాగితంపై బలవంతంగా సంతకం చేయించుకున్నారు. గంటన్నర తరువాత స్వాతి చనిపోయినట్లు ప్రకటించి తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.

కోటి పరిహారం.. ఆసుపత్రికి చెంపపెట్టు
వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె చనిపోయిందని ఆరోపిస్తూ స్వాతి భర్త క్రాంతికుమార్, తండ్రి సత్యనారాయణ నల్గొండ జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. కేసును పూర్తిగా పరిశీలించిన ఫోరం కామినేని డాక్టర్ల నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని తేల్చింది. ఈ మేరకు బాధిత కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని సంచలన తీర్పు ఇచ్చింది. ఈ పరిహారంలో రూ. 90 లక్షలు స్వాతి కుమారుడు దేవాన్ష్ శౌర్య పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేయాలని, మిగిలిన పది లక్షలు ఆమె తండ్రి సత్యనారాయణకు ఇవ్వాలని ఆదేశించింది. ప్రైవేటు ఆసుపత్రుల వైద్య నిర్లక్ష్యానికి ఈ తీర్పు ఒక హెచ్చరికగా మారింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *