ఎడిట్ జీన్స్… డిజైన్ బేబీస్ – మీరు కోరుకున్నట్టు మీ బిడ్డ తయారు

  • ఆరడుగుల ఎత్తు… అందమైన ముఖం
  • ముక్కు… పెదాలు ఎడిట్ చేసుకోవచ్చు
  • అత్యంత మేధస్సును కూడా సృష్టించవచ్చు
  • సైన్స్ ఫిక్షన్లో మాదిరిగా ‘సూపర్ మ్యాన్’ సృష్టి
  • అమెరికాలో ‘ప్రివెంటివ్’ కంపెనీ ప్రయోగాలు
  • భారీగా పెట్టుబడులు పెడుతున్న బిలియనీర్లు
  • దుమ్మెత్తిపోస్తున్న అంతర్జాతీయ శాస్త్రవేత్తలు
  • ధనికుల పిల్లలను సూపర్ మ్యాన్స్ చేసే కుట్ర

సహనం వందే, అమెరికా:
మీరు ఊహించినట్టుగానే మీ బిడ్డ ఉంటే ఎలా ఉంటుంది? చక్కటి ముక్కు… కాంతివంతమైన చర్మం… మంచి రంగు… ఒత్తయిన జుట్టు… ఆరడుగుల ఎత్తు… ఉన్నతమైన మేధస్సు – ఈ లక్షణాలన్నీ మీ ఇష్టానికి అనుగుణంగా ఎంచుకునే అవకాశం లభిస్తే? అదే ఇవాళ ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురిచేస్తున్న డిజైనర్ బేబీస్ కథ. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ కథల్లో మాత్రమే కనిపించే ఈ అద్భుత సృష్టి… నేడు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తున్న ‘ప్రివెంటివ్’ లాంటి స్టార్టప్ కంపెనీల ద్వారా వాస్తవ రూపం దాల్చడానికి ప్రయత్నిస్తోంది.

మీకిష్టమైనట్లు శిశువును డిజైన్ చేసుకోవచ్చు…
గర్భంలో ఉన్న శిశువు డీఎన్ఏను అతి సూక్ష్మంగా మార్చగలిగే క్రిస్పర్ టెక్నాలజీ ఇందుకు ఆధారం. ఈ సాంకేతికత ఒక కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ లాంటిది. మనం అందులో కోడింగ్‌ను ఎడిట్ చేసినట్టుగా పుట్టబోయే బిడ్డ జన్యు క్రమాన్ని సైతం ఎడిట్ చేయవచ్చు. అంటే బిడ్డ డీఎన్ఏలో ఉన్న కొన్ని నిర్దిష్టమైన జన్యు భాగాలను కత్తిరించి (కట్ చేసి) వాటి స్థానంలో కావలసిన లక్షణాలకు సంబంధించిన కొత్త జన్యువులను అమర్చడం సాధ్యమవుతుంది. పిల్లల ముఖాన్ని, ముక్కును, ఇతర శరీర అవయవాలను ఎలాగైనా మార్చుకోవచ్చు. ఆ ప్రకారం ఎడిట్ చేసుకోవచ్చు. వారసత్వ వ్యాధులను తొలగించే మంచి లక్ష్యంతో సాంకేతికత మొదలైనా ఇప్పుడు ధనవంతులు తమ పిల్లలు కేవలం ఆరోగ్యంగా ఉండటం కంటే, ‘సూపర్ మ్యాన్స్’ లా ఉండాలని కోరుకునే ఒక కొత్త, వివాదాస్పద మార్కెట్‌కి దారి తీస్తోంది. డబ్బున్న తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును తామే డిజైన్ చేసుకోడానికి ప్రయత్నిస్తున్న వింత పోకడ ఇది.

సాంకేతికత శాపంగా మారుతుందా?
నిజానికి క్రిస్పర్ వంటి అద్భుతమైన జన్యుమార్పిడి సాంకేతికతను వారసత్వ వ్యాధులకు చెక్ పెట్టడానికి, మానవాళిని అనేక రోగాల బారి నుంచి కాపాడటానికి కనిపెట్టారు. కానీ దీనిని ఇవాళ మానవ లక్షణాలను తమకు నచ్చినట్లుగా మార్చుకునే ఒక స్వార్థపూరిత మార్గంగా వాడుతున్నారు. పిల్లల ఐక్యూ, కండరాల బలం, ఎత్తు లేదా రూపం వంటి లక్షణాలను ఎంచుకునే ఈ ధోరణి సామాజికంగా భయంకరమైన పరిణామాలకు దారి తీస్తుంది. ధనవంతుల పిల్లలు ‘డిజైనర్ బేబీస్’గా అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలిస్తే, సాధారణ ప్రజల పిల్లలు వెనుకబడిన తరగతి పౌరులుగా మిగిలిపోతారు. ఇది కేవలం శాస్త్ర పురోగతి కాదు… సమాజాన్ని డబ్బుతో కాకుండా ‘జన్యువుల’ ఆధారంగా రెండు ముక్కలు చేసే అత్యంత ప్రమాదకరమైన ఆలోచన.

బిలియనీర్ల కుట్ర…
ఈ రహస్య ల్యాబ్‌లు నడుపుతున్న బిలియనీర్లు, టెక్ దిగ్గజాలు తమ చర్యలను మానవాళి కోసం అనే ముసుగులో ప్రచారం చేసుకుంటున్నా దీని వెనుక ఉన్నది కేవలం వారి స్వార్థం మాత్రమే. శిశువులపై జన్యుమార్పిడిని అంతర్జాతీయంగా నిషేధించినా ఆ నిషేధాలు కేవలం కాగితాలకే పరిమితమై ఈ ప్రాజెక్టులు దర్జాగా సాగిపోతున్నాయి. ఈ జన్యు దోపిడీని తక్షణమే ఆపకపోతే సమాజంలో ‘జన్యు విభజన’ జరిగి మానవ హక్కులు పూర్తిగా హననమవుతాయి. శాస్త్రం మానవత్వం కోసం పనిచేయాలి తప్ప మానవ జాతిని డీఎన్ఏ ఆధారంగా చీల్చేందుకు కాదు. ప్రపంచంలోని ప్రభుత్వాలు, ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు తక్షణమే మేల్కొని‌ ఈ ప్రమాదకరమైన సాంకేతిక ఆటను ఆపడానికి కఠినమైన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *