- ఏకపక్ష అంచనాలు… ఏం జరుగుతోంది?
- 2020లో ఎగ్జిట్ పోల్స్ అంచనా తారుమారు
- అప్పట్లో తేజస్వికి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్
- కానీ ఆనాడు ఎన్డీఏ కూటమికే అధిక సీట్లు
- మరి ఈసారి నిజం అవుతాయా లేదా?
సహనం వందే, పాట్నా:
బీహార్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై నెలకొన్న ఏకపక్ష అంచనాలు విమర్శలకు తావిస్తున్నాయి. దైనిక్ జాగరణ్, మాట్రిజ్, పీపుల్స్ ఇన్‌సైట్, చాణక్య స్ట్రాటజీస్, పీపుల్స్ పల్స్ సహా మొత్తం తొమ్మిది ప్రముఖ సర్వే సంస్థలు బీహార్‌లో ఎన్డీయేదే తిరుగులేని అధికారం అని ముక్తకంఠంతో చెప్పాయి. ఈ అంచనాల ప్రకారం సరాసరి ఎన్డీయే కూటమి సుమారు 157 స్థానాలు దక్కించుకుంటుంది. అంటే అధికార పీఠం దక్కించుకోవడానికి అవసరమైన 122 స్థానాల మెజారిటీని చాలా తేలికగా దాటేస్తుందన్న మాట. మరోవైపు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి కేవలం 90 స్థానాలకే పరిమితం అవుతుందని ఎగ్జిట్ పోల్స్ లెక్కలు చెబుతున్నాయి.


మహాకూటమికి భారీ కోత…
ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం… ఈసారి మహాకూటమిలోని ప్రధాన పార్టీలు తమ సొంత బలాన్ని కోల్పోనున్నాయి. గత ఎన్నికల్లో 75 స్థానాలు గెలిచి ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆర్జేడీకి ఈసారి కేవలం 57 నుంచి 69 సీట్లలోపే దక్కవచ్చని సర్వే సంస్థలు అంచనా వేశాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ గతంలో సాధించిన 19 సీట్ల కంటే కూడా తగ్గి 14 స్థానాలకు మించకపోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇది మహాకూటమికి పెద్ద దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఫలితాలు కనుక నిజమైతే బీహార్ రాజకీయాల్లో పెద్ద మార్పు వచ్చినట్లే.
భారతీయ జనతా పార్టీ హవా…
మహాకూటమికి సీట్లు తగ్గితే బీజేపీ ఈసారి బీహారులో పెను మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం బీజేపీ 67 నుంచి 70 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉంది. అదే జరిగితే గతంలో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆర్జేడీని వెనక్కి నెట్టి బీజేపీ రాష్ట్రంలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. ఇక జనతా దళ్ (యునైటెడ్) (జేడీయూ) అధినేత నితీష్ కుమార్ ఈసారి గతంలో కంటే మెరుగైన ఫలితాన్ని ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో 43 సీట్లు మాత్రమే దక్కించుకున్న జేడీయూ… ఈసారి 71 సీట్ల వరకు గెలుచుకోవచ్చని సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఇది నితీష్ కుమార్ రాజకీయ భవిష్యత్తుకు ఊతమిచ్చే అవకాశం ఉంది.
అంచనాలు నమ్మాలా వద్దా?
ఈ ఏకపక్ష ఎగ్జిట్ పోల్ అంచనాల పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అంటే కేవలం అంచనాలు మాత్రమే. గతంలో ఈ అంచనాలు తలకిందులైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా 2020 బీహార్ ఎన్నికల చరిత్రనే తీసుకుంటే అనేక సర్వే సంస్థలు తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాకూటమి విజయం సాధిస్తుందని గట్టిగా చెప్పాయి. ప్రముఖ సర్వే సంస్థలు న్యూస్ 24, టుడేస్ చాణక్య, ఇండియా టుడే-ఆక్సిస్ మై ఇండియా అప్పట్లో మహాకూటమికి భారీ మెజారిటీ అంచనా వేశాయి. కానీ ఆ ఫలితాలు తప్పుగా తేలాయి. అధికారికంగా ఎన్డీయే 125 స్థానాలు గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన ఏకపక్ష ఎన్డీయే అంచనాలు ఎంతవరకు నిజమవుతాయనేది నవంబర్ 14న ఫలితాలు వెలువడ్డాకే తేలనుంది. ఆ రోజు ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.