- ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోనూ టెన్షన్ టెన్షన్
- సాయుధ బలగాలతో గస్తీ… ఓటర్ల కుస్తీ
- మొదటి దశలో బీహార్ లో రికార్డు పోలింగ్
- పేలుడు ఘటనతో రెండో దశపై అనుమానాలు
సహనం వందే, న్యూఢిల్లీ/పాట్నా:
బీహార్ ఎన్నికలు జరగనున్న తరుణంలో దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలో సోమవారం రాత్రి జరిగిన పేలుడు దేశ రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటన ఎన్నికల సమయంలో భద్రతా పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మార్చింది. మొదటి దశలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగిన బీహార్‌లో… ఈ పేలుడు ప్రభావం రెండో దశ ఓటర్లలో భయాన్ని నింపుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ దారుణం నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాన నగరాల్లో పోలీసులు సోదాలు, తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ మొత్తం పరిణామం బీహార్ ఎన్నికల ఫలితాలపై ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది రాజకీయ నిపుణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
రాజకీయ రచ్చ: ఆరోపణలు, ప్రతి ఆరోపణలు
ఎర్రకోట పేలుడు వార్త తెలిసిన వెంటనే రాజకీయ నాయకుల స్పందనలు వేగంగా వచ్చాయి. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్షలు జరిపి దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్రంలో భద్రతా వైఫల్యం లేదని స్పష్టం చేస్తూ అదనపు పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు మహాగఠ్‌బంధన్ నాయకుడు తేజస్వి యాదవ్ ఈ పేలుడును కేంద్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యానికి నిదర్శనగా పేర్కొన్నారు. చిరాగ్ పాశ్వాన్ ఎన్డీఏకు తన మద్దతును పునరుద్ఘాటించారు. ఇలా ఎన్నికల ముందు ఈ ఆరోపణలు-ప్రతి ఆరోపణల యుద్ధం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.
ఓటింగ్‌పై పేలుడు ప్రభావం ఉంటుందా?
మొదటి దశలో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నా… రెండో దశలో జరగబోయే 122 స్థానాల్లో ఈ పేలుడు ఘటన ప్రభావం చూపవచ్చు. బీహార్‌లో భద్రతా బలగాలు పెంచినప్పటికీ మధ్యతరగతి ఓటర్లు భయంతో ఓటు వేయడానికి ఇంటి నుంచి బయటకు వస్తారా అనేది ప్రధాన ప్రశ్న. దేశవ్యాప్తంగా నెలకొన్న ఉద్విగ్న పరిస్థితుల కారణంగా ఓటర్లలో ఆందోళన కనిపిస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం ఈ ఘటన ఎన్నికల ఫలితాల్లో స్వల్ప మార్పునకు దారితీయవచ్చు.