‘లక్ష’ల్లో ఆశ… ‘వంద’తో నిరాశ – భారత్ లో మస్క్ టెస్లా ఆశలు మటాష్

  • లక్షల్లో కార్లు అమ్ముడు పోతాయని భారీ ఆశ
  • జులై నుంచి ఇప్పటి వరకు 144 మాత్రమే సేల్
  • మస్క్ అత్యాశకు బుద్ధి చెప్పిన మార్కెట్
  • దెబ్బకొట్టిన అధిక ధరలు… స్థానిక పోటీ!
  • అమెరికాలో కంటే ఇండియాలో రెట్టింపు ధర

సహనం వందే, న్యూఢిల్లీ:
భారత్‌లో టెస్లా వాహనాల విక్రయాలు చూస్తే దిగ్భ్రాంతి కలగక మానదు. టెస్లాను భారత్‌కు తీసుకొస్తే లక్షల్లో కార్లు అమ్ముడవుతాయని ఎలాన్ మస్క్ పెట్టుకున్న అంచనాలు పటాపంచలయ్యాయి. అక్టోబర్‌లో టెస్లా అమ్మింది కేవలం 40 వాహనాలు మాత్రమే! సెప్టెంబర్‌లో అమ్ముడైన 64 వాహనాలతో పోలిస్తే ఇది ఏకంగా 37% పతనం. జూలై నుంచి ఇప్పటివరకు అమ్మిన మొత్తం కార్లు 144 మాత్రమే. కొన్ని వందల ఆర్డర్లతో టెస్లా చేస్తున్న ఈ మౌన ప్రదర్శన చూస్తుంటే దేశీయ ఈవీ మార్కెట్‌లో విదేశీ దిగ్గజాల ప్రవేశం ఎంత కత్తిమీద సామో అర్థమవుతోంది. భారతీయులు బ్రాండ్‌ను కాదు… ధర, సౌకర్యాన్ని కూడా చూస్తారని టెస్లాకు గట్టి గుణపాఠం నేర్పింది.

అమెరికా ధర కంటే రెట్టింపు…
టెస్లా వాహనాలు భారతీయులకు అందుబాటులో లేకుండా పోవడానికి ప్రధాన కారణం ధరల భారం. టెస్లా మోడల్ వై ధర ఇక్కడ 60 లక్షలు మించి ఉంది. ఇది అమెరికాలోని ధరలతో పోలిస్తే దాదాపు రెండు రెట్లు ఎక్కువ! దిగుమతి సుంకాలు (7% నుంచి 10% వరకు), జీఎస్‌టీ, రోడ్డు పన్నులు… ఇలా అన్నీ కలిసి ధరను ఆకాశానికి చేర్చాయి. భారత్‌లో సగటు ఈవీ ధర సుమారు 22 లక్షలు మాత్రమే ఉన్న నేపథ్యంలో టెస్లా కార్లు లగ్జరీ సెగ్మెంట్‌కు పరిమితమయ్యాయి. మస్క్ కంపెనీ స్థానికంగా తయారీ చేయకపోవడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైంది. ప్రభుత్వం దిగుమతి సుంకాలను తగ్గించినప్పటికీ పూర్తి స్థానికత సాధించకపోతే ధరలు దిగిరావడం కష్టమే. ఫలితంగా టెస్లా కేవలం ధనవంతుల కలల కారుగానే మిగిలిపోయింది.

స్థానిక బ్రాండ్ల ఆధిపత్యం…
టెస్లా బలహీనతను స్థానిక బ్రాండ్లు తమ బలంగా మార్చుకున్నాయి. అక్టోబర్‌లో దేశంలో మొత్తం 16 వేలు ఈవీలు అమ్ముడవగా అందులో టెస్లా భాగం దాదాపు శూన్యం. టాటా, మహీంద్రా, ఎంజీ వంటి దేశీయ కంపెనీలు తక్కువ ధరలకే అధిక ఫీచర్లతో మార్కెట్‌ను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. అంతేకాదు చైనాకు చెందిన బీవైడీ కంపెనీ సైతం అక్టోబర్‌లో దాదాపు 541 వాహనాలను అమ్మింది. టెస్లా మోడల్ వైకి పోటీగా ఉన్న బీఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ వంటి లగ్జరీ బ్రాండ్లు కూడా మెరుగైన సేవా నెట్‌వర్క్‌ను అందిస్తున్నాయి. చైనా, యూరప్‌లలో టెస్లా విక్రయాలు పడిపోతున్న నేపథ్యంలో భారత్‌లోనూ ఆ ప్రపంచ పతనం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. స్థానిక బ్రాండ్ల ధరలు, సేవల ముందు విదేశీ దిగ్గజం ఇక్కడ బలహీనంగా మారింది.

అసంపూర్ణ మౌలిక వసతులు…
టెస్లా విఫలతకు మరొక ప్రధాన కారణం మౌలిక సదుపాయాల కొరత. టెస్లాకు చెందిన సూపర్‌చార్జర్లు ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాలకే పరిమితం. దేశంలో ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్ ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందలేదు, ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లో. సర్వీస్ సౌలభ్యం లేకపోవడం కొనుగోలుదారులను వెనక్కి లాగుతోంది. పూర్తిస్థాయి స్వయం చాలక సాంకేతికతలు (ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్) వంటి మస్క్ కలల ప్రాజెక్టులు ఇక్కడ అమలు కావడం కష్టం. ఈ లోటుపాట్లు టెస్లా భవిష్యత్తును అనిశ్చితంగా మార్చేశాయి. మార్కెట్ డిమాండ్‌ను అర్థం చేసుకోకుండా, పన్నుల భారం తగ్గకుండా కేవలం బ్రాండ్‌ను నమ్ముకొని వచ్చిన టెస్లా ప్రయాణం… ఇక్కడ దెబ్బకు గురైందనే చెప్పాలి.

మార్పు రాకపోతే విఫలమే!
టెస్లా తన వాహనాలను స్థానికంగా ఉత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకుంటే ధరలు దాదాపు రెండు రెట్లు తగ్గే అవకాశం ఉంది. కానీ మస్క్ ఈ విషయంలో చూపుతున్న అలసత్వం వల్ల మార్కెట్ అవకాశాలను కోల్పోతున్నారు. భారత ప్రభుత్వం ఈవీలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ విదేశీ కంపెనీలు స్థానికీకరణకు మొగ్గు చూపకపోతే విజయం సాధించడం అసాధ్యం. టెస్లా ప్రస్తుత పతనం భారతీయ ఈవీ మార్కెట్ స్థానిక బలాన్ని, నిర్ణయాత్మక శక్తిని నిరూపిస్తోంది. పాలసీలో, ధరల్లో మార్పు రాకపోతే టెస్లా ప్రవేశం చరిత్రలో మరో విఫలయత్నంగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *