- రూ. 55 వేల కోట్ల ఆస్తి కాపాడాం
- కబ్జాదారులపై యుద్ధమే చేశాం
- కబ్జాదారుల దావా: 700 కేసులు
సహనం వందే, హైదరాబాద్:
హైదరాబాద్‌లో ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కాపాడడంలో హైడ్రా సాధించిన విజయం అసాధారణమైనది. హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి నేటి వరకు ఏకంగా 181 డ్రైవ్స్ నిర్వహించి 954 కబ్జాలను తొలగించినట్లు కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు ప్రకటించారు. ఈ క్రమంలో మొత్తం 1045.12 ఎకరాల విలువైన భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ సుమారు రూ. 50,000 కోట్ల నుండి రూ. 55,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇందులో ప్రభుత్వ భూములు 531.82 ఎకరాలు, రహదారుల కబ్జాలు 222.30 ఎకరాలు, చెరువుల కబ్జాలు 233.00 ఎకరాలు, పార్కుల కబ్జాలు 35 ఎకరాలు ఉన్నాయి. ప్రకృతిని, ప్రజల ఆస్తులను కాపాడుతూనే… నగర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాము పనిచేస్తున్నామని కమిషనర్ స్పష్టం చేశారు.
కబ్జాదారుల దావా: 700 కేసులు
పేదవారిని అడ్డుపెట్టుకొని బడాబాబులు చేస్తున్న కబ్జాలను హైడ్రా బయటపెడుతోందని కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు ఆరోపించారు. ధనదాహంతో ఇష్టానుసారం ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నవారే హైడ్రాపై దాదాపు 700 వరకు కేసులు పెట్టారని, వ్యక్తిగతంగా తనపై కూడా 31 వరకు కంటెంప్ట్ కేసులు వేశారని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగం, చట్టాలు, న్యాయస్థానాల స్ఫూర్తిని గౌరవిస్తూనే తాము ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. 2024 జూలైకి ముందు నుంచి నివాసం ఉంటున్నవారి ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదని, ఒకవేళ తప్పనిసరి అయితే వారికి ప్రత్యామ్నాయం, పరిహారం అందేలా ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు.
వరద కట్టడి… 96 వేలకు పైగా పనులు పూర్తి!
వర్షాకాలంలో హైదరాబాద్ నగరానికి ప్రధాన సమస్యగా మారే వరద ముప్పును ఈ ఏడాది చాలావరకు నియంత్రించామని హైడ్రా తెలిపింది. వర్షాలు వచ్చాక కాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ఇందుకు కారణమని కమిషనర్ వివరించారు. ఈ వర్షాకాలంలో హైడ్రా మొత్తం 96,972 పనులు చేపట్టింది. ఇందులో 56,330 క్యాచ్‌పిట్స్ క్లీనింగ్, 6,721 నాలాల క్లీనింగ్, 10,692 నీటి నిల్వ పాయింట్లు క్లియర్ చేయడం వంటి కీలకమైన పనులు ఉన్నాయి. అమీర్‌పేట మైత్రీవనం వద్ద గతంలో 5 సెంటీమీటర్ల వర్షం పడినా మునిగిపోయే ప్రాంతంలో నాలా కింద పూడుకుపోయిన పైపులను గుర్తించి తొలగించడం ద్వారా ఇప్పుడు 15 సెంటీమీటర్ల వర్షం పడినా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయగలిగామని తెలిపారు.
దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన ప్రజలకు థాంక్స్…
సామాజిక మాధ్యమాలు వేదికగా కొంతమంది వేల ఇళ్లను హైడ్రా కూల్చిందంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని ర్యాలీలు, ప్రదర్శనల ద్వారా తిప్పి కొట్టిన నగర ప్రజలకు హైడ్రా కృతజ్ఞతలు తెలిపింది. ప్రజల నుంచి వచ్చిన ఈ మద్దతు హైడ్రాకు మరింత స్ఫూర్తినిచ్చిందని కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. హైడ్రా వల్ల లక్షల మందికి లాభం చేకూరిందంటూ నగరవ్యాప్తంగా జరిగిన మేలును వివరిస్తూ ప్రజలు ప్లకార్డులు ప్రదర్శించడం తమకు ఆనందాన్ని ఇచ్చిందని, మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలు కూడా తమ కార్యక్రమాలను ప్రజలవద్దకు చేరవేసిన తీరును అభినందిస్తున్నామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.