- నేతల నీచత్వం… హోటల్లో అశ్లీలం
- లాబీయింగ్ కోసం హోటళ్లకు సరఫరా
- విదేశాల నుంచి వందలాది మంది యువతులు
- నేతల జల్సాలు… దేశమంతా నివ్వెర!
- జాతీయ మీడియా ‘దైనిక్ భాస్కర్’ సంచలనం
- స్ట్రింగ్ ఆపరేషన్ చేపట్టి బట్టబయలు
- నేపాల్, థాయ్‌లాండ్ దేశాల నుంచి గర్ల్స్ రాక
సహనం వందే, పాట్నా:
ఒకవైపు బీహార్‌లో ఎన్నికలు జరుగుతుంటే మరోవైపు తెరవెనుక కొందరు ప్రజా ప్రతినిధులు చేస్తున్న దారుణాలు దేశాన్ని కుదిపేశాయి! ఎన్నికల సమయంలో లాబీయింగ్ కోసం… పెద్ద పెద్ద నేతలను తమ వైపు తిప్పుకునేందుకు అమ్మాయిలను సరఫరా చేయడం నివ్వెరపరిచింది. ప్రముఖ జాతీయ మీడియా ‘దైనిక్ భాస్కర్’ నిర్వహించిన ‘ఆపరేషన్ డర్టీ పాలిటిక్స్’ బయటపెట్టిన రహస్యాలు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వంటి ప్రజాప్రతినిధులు తమ విలాసాల కోసం ఏకంగా అమ్మాయిలను సరఫరా చేసే నెట్‌వర్క్‌ను ఆశ్రయిస్తున్నారట! వేదికలపై నీతులు, నిజాయితీ గురించి గొంతు చించుకునే ఈ నేతలంతా… తెరవెనుక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటే వీరు నిజంగా ప్రజలకు సేవ చేస్తున్నారా? లేక సామాజిక ద్రోహులుగా మారుతున్నారా?

పాట్నాలో వంద మంది అమ్మాయిలతో దందా!
ఈ చీకటి వ్యాపారానికి పాట్నాలోని హోటల్ బెల్లీ గ్రాండ్ ప్రధాన కేంద్రంగా మారిందని తేలింది. సామాన్య నేతల నుంచి అత్యున్నత స్థాయి ఎమ్మెల్యేల వరకు ఉన్న వీఐపీల కోసమే ఈ నెట్‌వర్క్ పనిచేస్తోంది. డిమాండ్‌ను బట్టి ఒకేసారి వంద మంది వరకు యువతులను సరఫరా చేయగల ఈ దందా… నేతల విచ్చలవిడితనాన్ని బట్టబయలు చేసింది. కొందరు టిక్కెట్ల కోసం ఉన్నత స్థాయి నాయకులను ప్రలోభ పెట్టేందుకు యువతులను సరఫరా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు కొందరిని తమ వైపు తిప్పుకునేందుకు కూడా ఇలాంటి కార్యక్రమాలకు తెగించినట్లు తెలుస్తుంది. ప్రజల ఓట్లతో పదవులు దక్కించుకుని ఇలాంటి అశ్లీల కార్యకలాపాల్లో మునిగితేలుతున్న ఈ నేతలను చూసి ప్రజలు ఉగ్రరూపం దాల్చారు.
విదేశీ యువతులపై వల
ఈ వ్యభిచార నెట్‌వర్క్ బీహార్‌కే పరిమితం కాలేదు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పాటు… నేపాల్, థాయ్‌లాండ్ వంటి విదేశాల నుంచి కూడా యువతులను అక్రమంగా రప్పిస్తున్నారు. ముఖ్యంగా పేదరికంలో ఉన్న ప్రాంతాల నుంచి వచ్చిన అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని వారికి వల వేస్తున్నారు. విదేశీ యువతులకు ఎక్కువ డబ్బు చెల్లిస్తూ వారికి ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. అమ్మాయిలతోపాటు డ్రగ్స్ డీల్స్ కూడా జరుగుతున్నాయంటే ఈ నాయకులు నేరుగా నేర ప్రపంచంలో భాగమయ్యారనే కదా అర్థం!
ప్రజలకు ఏం సమాధానం చెప్తారు?
పగలూ రాత్రీ విలాసాలలో మునిగితేలే ఈ నాయకులు రేపు మళ్లీ ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న ఈ నాయకులపై పార్టీలు, ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. ఇందులో భాగమైన నేతలందరినీ బహిష్కరించాలి. లేదంటే ప్రజలు ఈ వ్యవస్థపై శాశ్వతంగా నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. అక్రమార్కులకు ఈ రాజకీయాల్లో స్థానం లేదని గట్టిగా చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది!