జైలు పాలవుతున్న జస్టిస్ – నేరం నిరూపితం కాకుంటే జైల్లోనే జీవితం

  • 70 శాతంపైగా నేరం రుజువు కాని వారే
  • న్యాయవ్యవస్థపై సుప్రీం న్యాయమూర్తి ఫైర్!
  • శిక్ష కంటే ఎక్కువ కాలం జైలులోనే!
  • అపహాస్యం పాలవుతున్న లీగల్ ఎయిడ్
  • లా స్కూళ్లలో సిలబస్ మార్చాల్సిందే!

సహనం వందే, న్యూఢిల్లీ:
భారతీయ న్యాయం కళ్ల గంతలు కట్టుకుని ఉందంటే బహుశా ఇదేనేమో! దేశంలో అత్యున్నత న్యాయస్థానం నుంచి వచ్చిన మాటలు ఇవి. సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమ్ నాథ్ స్వయంగా విడుదల చేసిన నివేదిక ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తోంది. మన జైళ్లలో మగ్గుతున్న మొత్తం ఖైదీల్లో 70 శాతం మందికి పైగా ఇంకా అండర్‌ట్రయల్స్‌ (నేరం రుజువు కానివారు) కావడం వ్యవస్థకు అద్దం పడుతోంది. ఎంతోమంది పౌరులు దోషులుగా తేలకముందే సంవత్సరాల తరబడి జైలు శిక్ష అనుభవిస్తుంటే న్యాయం ఎవరి పక్షాన ఉన్నట్టు?

ఉచిత హక్కు… కానీ దొంగ చూపు!
ఉచిత న్యాయ సాయం (లీగల్ ఎయిడ్) పొందే హక్కు పేదల ప్రాథమిక హక్కు. కానీ ఈ హక్కు గురించి 74 శాతం మందికి తెలియదట! తెలిసిన కొద్దిమంది కూడా కేవలం 7.91 శాతం మంది మాత్రమే దీనిని వాడుకుంటున్నారంటే కారణం ఏంటి? న్యాయవాదులపై నమ్మకం లేకపోవడమే! డబ్బు కట్టకుండా పనిచేసే న్యాయవాది కంటే ప్రైవేటు న్యాయవాది మెరుగనే అపోహ బలంగా నాటుకుపోయింది. దీనికి పూర్తి బాధ్యత ఉచిత న్యాయ సాయం అందించే వ్యవస్థ వైఫల్యమే!

హామీ పత్రం లేక..!
జస్టిస్ నాథ్ చెప్పిన నిజాలు మరింత షాకింగ్‌గా ఉన్నాయి. చాలామంది న్యాయవాదులు సరిగా పత్రాలు లేకుండా, నిందితులు కట్టలేని లేదా తేలేని భారీ హామీ పత్రాలు (శ్యూరిటీలు) కోరుతూ బెయిల్ దరఖాస్తులు వేస్తున్నారు. ఫైనల్‌గా నిందితుడు బెయిల్ మొత్తం చెల్లించలేక, హామీ ఇవ్వలేక తిరిగి జైలు గోడలకే పరిమితం అవుతున్నాడు. బెయిల్ ఇవ్వదగిన చిన్న నేరాలకు పాల్పడినవారు సైతం ఆ చిన్న మొత్తాన్ని చెల్లించలేక అన్యాయంగా జైళ్లలో మగ్గుతుండడం న్యాయం చేసిన ద్రోహం కాక మరేమిటి?

శిక్ష కంటే ఎక్కువ కాలం జైలులోనే!
నమ్మండి నమ్మకపోండి దాదాపు ప్రతిరోజూ చూస్తున్న కేసుల్లో అండర్‌ట్రయల్స్‌ అనుభవిస్తున్న జైలు జీవితం వారు చేసిన నేరానికి చట్టం నిర్ధారించిన గరిష్ట శిక్ష కంటే కూడా ఎక్కువ ఉందట! సకాలంలో విచారణ జరిగితే నిర్దోషిగా విడుదలయ్యేవారు లేదా స్వల్ప శిక్షతో బయటకు వచ్చేవారు. కానీ కేవలం విచారణ జాప్యం కారణంగానే వారు జీవితాన్ని జైల్లో వృథా చేసుకుంటున్నారు. 51 శాతం మందికి అసలు కేసు నడిపించడానికి పత్రాలు కూడా లేవంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ఊహించుకోండి.

లా స్కూళ్లలో సిలబస్ మార్చాల్సిందే!
ఈ వైఫల్యాన్ని చక్కదిద్దాలంటే న్యాయ విద్య నుంచే మార్పు రావాలని జస్టిస్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లా స్కూళ్లు లీగల్ ఎయిడ్ క్లినిక్స్‌ను కేవలం ఓ చెక్ లిస్ట్‌గా చూడకూడదు. న్యాయం అంటే పుస్తకంలో చదివేది కాదని… అండర్‌ట్రయల్ ను చూసి నేర్చుకోవాలని ఆయన సూచించారు. యువ న్యాయవాదుల మొదటి అనుభవం జైలులో ఖైదీని కలవడం నుంచే మొదలవ్వాలి. అప్పుడే మన న్యాయ వృత్తి మారుతుంది. లేదంటే దోషులుగా తేలని 70 శాతం మంది న్యాయం కోసం ఎదురుచూస్తూనే ఉంటారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *