- కేటీఆర్ వల్లే గోపీనాథ్ మరణమని ఆరోపణ
- వారసత్వంపై ఫ్యామిలీలో ముదిరిన ముసలం
- సునీత పోటీపై అత్త, సవతి కొడుకు వ్యతిరేకత
- జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్‌కు షాక్
సహనం వందే, హైదరాబాద్:
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్న తరుణంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఆమె కుటుంబం నుంచే బిగ్ షాక్ తగిలింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వారసత్వంపై కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం చుట్టూ ముసలం ముదిరి అది ఇప్పుడు రాజకీయ వివాదంగా మారింది. ఉపఎన్నికల ప్రక్రియ నడుస్తుండగానే రెవెన్యూ అధికారుల విచారణకు ఈ వివాదం దారితీయడం బీఆర్ఎస్ శిబిరంలో ఆందోళన నింపుతోంది. మాగంటి కుటుంబంలోని ఈ కలహాల ప్రభావం ఈ నెల 11న జరగబోయే ఎన్నికల్లో కారు పార్టీకి తీవ్ర ప్రతికూలంగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు.
కేటీఆర్ వల్లే గోపీనాథ్ మరణం!
గురువారం విచారణకు మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి కూడా హాజరై సంచలన ప్రకటన చేశారు. తన మనవడు ప్రద్యుమ్నకు అన్యాయం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాలినీ దేవి, గోపీనాథ్ పెళ్లి తానే చేశానని… ఇందుకు అనేక సాక్ష్యాలు ఉన్నాయని ఆమె వెల్లడించారు. అంతటితో ఆగకుండా తన కొడుకు గోపీనాథ్ మరణానికి కేటీఆర్ కారణమని మహానంద కుమారి సంచలన ఆరోపణలు చేశారు. సునీత ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం కూడా తనకు తెలియదని… తనతో ఆమెకు మాటలు కూడా లేవని ఆమె పేర్కొన్నారు. తన కుమారుడు గోపీనాథ్ మరణం కూడా ఓ మిస్టరీ అని అనుమానం వ్యక్తం చేసిన మహానంద కుమారి… తన మనవడికి అన్యాయం చేయవద్దని కన్నీటితో విజ్ఞప్తి చేశారు.
అడ్డంగా నిలిచిన మొదటి భార్య…
మాగంటి సునీతకు కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం ఇవ్వడంపై గోపీనాథ్ మొదటి భార్య మాలినీ దేవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన కుమారుడు ప్రద్యుమ్న తారక్ పేరు లేకుండా తప్పుడు సమాచారంతో సునీత ఈ పత్రాన్ని పొందారని ఆరోపిస్తూ ఆమె, ప్రద్యుమ్న ఎన్నికల కమిషన్‌కు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో శేరిలింగంపల్లి తహసీల్దార్ ఈ అంశంపై విచారణ చేపట్టారు. ఈ విచారణలో గోపీనాథ్ మొదటి భార్య మాలినీ దేవి మాట్లాడుతూ… తాను చట్టబద్ధంగా గోపీనాథ్ భార్య అని, ప్రద్యుమ్న ఆయన వారసుడని స్పష్టం చేశారు. తమ ఉనికిని దాచిపెట్టి తీసుకున్న ఈ సర్టిఫికెట్ పూర్తిగా అన్యాయం, చట్టవిరుద్ధం అని ఆమె అన్నారు. తమ దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయని, న్యాయపోరాటం చేస్తామని మాలినీ దేవి ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్‌కు డబుల్ దెబ్బ
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతకు గోపీనాథ్ తరఫు కుటుంబ సభ్యుల నుంచి కనీసం నైతిక మద్దతు కూడా లేదని ఈ విచారణతో తేటతెల్లమైంది. కనీసం సునీత పోటీ చేస్తున్న విషయం కూడా తెలియదంటూ గోపీనాథ్ తల్లి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ప్రచార వ్యూహానికి పెద్ద దెబ్బ. మాగంటి కుటుంబంలో చోటు చేసుకున్న ఈ రాజకీయ కలహాలు బీఆర్ఎస్ ప్రచారానికి తీవ్ర ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. దివంగత ఎమ్మెల్యే పేరుతో ఎన్నికలకు వెళ్లిన కారు పార్టీకి ఆయన తల్లి, మొదటి భార్య, కుమారుడి నుంచే వ్యతిరేకత రావడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీకి ఇది పెద్ద నష్టం కలిగించనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.