- నకిలీ ఉత్పత్తుల ప్రచారంతో లక్ష కోట్లు లూటీ
- నిషేధిత వైద్య ఉత్పత్తుల అమ్మకాలకు ఊపు
- నకిలీ ఇ-కామర్స్ స్కీమ్స్, అక్రమ పెట్టుబడులు
- అక్రమ ఆన్‌లైన్ కేసినోలకు ఉధృత ప్రచారం
- జనాన్ని దోపిడీ చేస్తున్న సోషల్ మీడియా
- 2024లో సుమారు రూ. లక్షన్నర కోట్లు కాజేత
- లక్షమంది ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం
- మూడో వంతు మోసాలు మెటా ద్వారానే…
సహనం వందే, హైదరాబాద్:
మెటా అధినేత జుకర్ బర్గ్ ప్రపంచాన్ని లూటీ చేస్తున్నాడు. తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియాల్లో మోసపూరిత ప్రకటనలను అనుమతించడం ద్వారా ఏడాదికి ఏకంగా లక్షన్నర కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నట్లు రహస్య నివేదికల ద్వారా వెల్లడైంది. ఈ ప్రకటనలు నకిలీ ఇ-కామర్స్ పథకాలు, అక్రమ పెట్టుబడి స్కీములు, అక్రమ ఆన్‌లైన్ కేసినోలు, నిషేధిత వైద్య ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించినవి. అత్యంత విశ్వసనీయ నివేదికల ప్రకారం… 2024 నాటికి మెటా తన మొత్తం వార్షిక ఆదాయంలో 10 శాతం అంటే సుమారు రూ. లక్షన్నర కోట్లు ఏడాదికి సొమ్ము చేసుకుంటుంది. మోసపూరిత, నిషేధిత వస్తువుల ప్రకటనల ద్వారా సంపాదిస్తుంది. ఈ ఒక్క కేటగిరీ నుంచే మెటా ఏటా రూ. 58,100 కోట్లకు పైగా ఆదాయాన్ని పొందుతోందని రహస్య పత్రాలు చెబుతున్నాయి.
చట్టం ఉల్లంఘించినా కఠిన చర్యలు లేవు…
మోసాలు జరుగుతున్నాయని హెచ్చరికలు ఉన్నప్పటికీ మెటా కఠిన చర్యలు తీసుకోవడానికి సంకోచిస్తోంది. ఒక ప్రకటనదారు 95 శాతం మోసానికి పాల్పడ్డాడని ఆటోమేటెడ్ వ్యవస్థలు అంచనా వేస్తే తప్ప ఆ సంస్థను నిషేధించడం లేదు. మోసం చేసే అవకాశం ఉన్నా కానీ 95 శాతం కన్నా తక్కువ అనుమానిత ప్రకటనదారులపై పెనాల్టీగా అధిక ప్రకటనల ధరలు వసూలు చేస్తోంది. అంటే మోసానికి పాల్పడుతున్నా లాభం చేకూరుస్తున్న ప్రకటనదారులను తొలగించడంలో మెటా వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుందని ఈ పత్రాలు సూచిస్తున్నాయి.
పోటీదారుల కన్నా ఘోరం…
ప్రపంచవ్యాప్తంగా మోసాలలో మూడింట ఒక వంతు మెటా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారానే జరుగుతున్నట్లు అంచనా. మోసగాళ్లు తమ కార్యకలాపాల గురించి చర్చించుకునే ఆన్‌లైన్ కమ్యూనిటీల అంతర్గత సమీక్షలో, ‘గూగుల్ కంటే మెటా ప్లాట్‌ఫారమ్‌లలో మోసాల ప్రకటనలు చేయడం సులభం’ అనే నిర్ధారణకు వచ్చారు. సింగపూర్ పోలీసులు 146 మోసాల ఉదాహరణలు ఇచ్చినప్పటికీ వాటిలో 77 శాతం మెటా నిబంధనలను ఉల్లంఘించలేదని సంస్థ పేర్కొంది. 2023లో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వినియోగదారులు దాదాపు లక్ష మోసాల ఫిర్యాదు చేయగా… మెటా వాటిలో 96 శాతాన్ని పట్టించుకోలేదు.
మోసగాళ్లకు రక్షణ కవచం… ఆదాయమే లక్ష్యం
వివాదాస్పద ప్రకటనదారులను పర్యవేక్షించే బృందం కంపెనీ మొత్తం ఆదాయంలో 0.15 శాతం కంటే ఎక్కువ నష్టం కలిగించే చర్యలు తీసుకోకుండా పరిమితి విధించింది. అంతకంటే ఎక్కువ ఉంటే వాటిని పరిగణలోకి తీసుకోరు. ఇంతకంటే దారుణం మరోటి ఉంటుందా? రెగ్యులేటరీ చర్యలు తప్పనిసరి అయినప్పుడు మాత్రమే స్పందించాలని కంపెనీ నాయకత్వం నిర్ణయించుకుంది. ఈ విధానం వినియోగదారుల భద్రత కంటే లాభానికే మెటా అధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేస్తోంది.