రక్తం కోరిన రాజ్యం – సుడాన్‌ను గడగడలాడిస్తున్న ఆర్‌ఎస్‌ఎఫ్

  • ‘మాకు దయ లేదు… చంపడమే మా పని…’
  • జెనోసైడ్ అంటూ విజయగీతాలు!
  • విధ్వంసక యుద్ధంలో లక్షన్నర మంది మృతి
  • యూనివర్సిటీ భవనంలో డజన్ల మృతదేహాలు
  • సామాన్య ప్రజల సామూహికంగా ఉరితీత

సహనం వందే, సుడాన్:
సుడాన్‌ను గడగడలాడిస్తున్న పారామిలటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్) క్రూరత్వం మరోసారి ప్రపంచానికి బహిర్గతమైంది. గత నెలలో ఎల్‌-ఫాషర్ నగరంలో జరిగిన భయంకరమైన మారణకాండ వివరాలను అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది. ఈ దాడిలో 2 వేల మందికి పైగా పౌరులు చనిపోయి ఉండవచ్చని అంచనా. ‘చూడండి… ఇదే మా పని… ఇదే జెనోసైడ్’ అంటూ ఆర్‌ఎస్‌ఎఫ్ ఫైటర్లు తొమ్మిది శవాల పక్కనుంచి వెళ్తూ ఉల్లాసంగా నవ్వుతూ వీడియోలు తీయడం వారి కర్కశత్వానికి పరాకాష్ట.

యుద్ధ నేరాలకు కేంద్రంగా ఎల్‌-ఫాషర్!
గత రెండు సంవత్సరాలుగా సుడాన్ సైన్యం, ఆర్‌ఎస్‌ఎఫ్ మధ్య జరుగుతున్న ఈ విధ్వంసక యుద్ధంలో లక్షన్నర మందికి పైగా చనిపోయినట్లు అంచనా. ఎల్‌-ఫాషర్, డార్ఫర్‌ ప్రాంతంలో సుడాన్ సైన్యం చేతిలో ఉన్న చివరి కంచుకోట. అందుకే ఈ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఆర్‌ఎస్‌ఎఫ్ దాడులు చేసింది. రెండు సంవత్సరాలపాటు నగరాన్ని ముట్టడించిన ఆర్‌ఎస్‌ఎఫ్… చుట్టూ ఇసుక బ్యారికేడ్లను నిర్మించి, సహాయ మార్గాలను పూర్తిగా దిగ్బంధనం చేసింది. ఆహారం, అత్యవసర వస్తువులు నగరంలోకి రాకుండా అడ్డుకోవడమే కాక సామాగ్రిని అక్రమంగా తీసుకురావడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని తలకిందులుగా వేలాడదీసి శిక్షించిన వీడియోలు వారి క్రూరత్వాన్ని ధృవీకరిస్తున్నాయి.

అరాచకానికి హద్దులు లేవు!
అక్టోబరు 26న ఆర్‌ఎస్‌ఎఫ్ బలగాలు చివరి సైనిక స్థావరాలను చేజిక్కించుకుని సైన్యం ప్రధాన కేంద్రాన్ని ఆక్రమించాయి. ఈ సైన్యం వైదొలగగానే నగరంలోకి చొచ్చుకువచ్చిన ఆర్‌ఎస్‌ఎఫ్ అరాచకాన్ని సృష్టించింది. 2003-2005 మధ్య డార్ఫర్‌లో లక్షలాది మందిని చంపిన జంజావీద్ మిలీషియా నుంచి ఉద్భవించిన ఆర్‌ఎస్‌ఎఫ్… ఈసారి కూడా అరబేతర సమూహాలపై అమానుష హింసను ప్రదర్శించింది. సైన్యం పతనం తర్వాత క్షణాల్లోనే ఆన్‌లైన్‌లో దారుణమైన దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. ఒక యూనివర్సిటీ భవనంలో డజన్ల కొద్దీ మృతదేహాలు పడి ఉండగా… అక్కడే ఒంటరిగా కూర్చున్న వృద్ధుడిని ఒక ఫైటర్ దగ్గరగా వెళ్లి కాల్చి చంపిన భయంకర దృశ్యం రికార్డయింది.

మా పని చంపడం మాత్రమే!
నగరం వెలుపల కూడా ఆర్‌ఎస్‌ఎఫ్ ఫైటర్లు తమ కుటిలత్వాన్ని చూపించారు. అబూ లులూ అనే ఆర్‌ఎస్‌ఎఫ్ కమాండర్… నిరాయుధులైన ఖైదీలను నిర్మొహమాటంగా కాల్చి చంపే వీడియోలు సంచలనం సృష్టించాయి. ఒక క్షమాభిక్ష అడిగిన వ్యక్తితో… ‘నాకు దయ లేదు. మా పని కేవలం చంపడం మాత్రమే’ అని అబూ లులూ తేలికగా చెప్పి బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఆర్‌ఎస్‌ఎఫ్ దళాలు పౌరులను వీధుల్లో గుంపులుగా ఉంచి సామూహికంగా ఉరితీసినట్లు ఉపగ్రహ చిత్రాలు కూడా ధృవీకరిస్తున్నాయి. అధికార ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటంగా మీడియా విశ్లేషిస్తుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *