- సాంప్రదాయం కాదు… ఇదో కొత్త ట్రెండ్!
- భజనలకు తాళం వేస్తూ పాటలకు హమ్
- తరాలు మారేకొద్దీ పూజా పద్ధతుల్లో మార్పు
- ఒక వైపు విమర్శలు… మన వైపు ప్రశంసలు
సహనం వందే, ముంబై:
యువతరం ఇప్పుడు భక్తిని కొత్తగా ఆవిష్కరిస్తోంది. ప్రార్థనలు, భజనలు ఇకపై ఆలయాలకే పరిమితం కావడం లేదు. జెన్ జెడ్ యువత సాంప్రదాయ భజన్ సంధ్యలను తమదైన మ్యూజిక్ కల్చర్‌తో మిళితం చేసి ‘భజన్ క్లబింగ్’ అనే కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఈ ట్రెండ్ వేగంగా వ్యాపిస్తూ భక్తి భావానికి ‘యంగ్ వైబ్’ను జోడిస్తోంది. ఇది కేవలం పార్టీ కాదు, ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుకునే సోల్‌ఫుల్ జామ్ సెషన్.
‘బ్యాక్‌స్టేజ్ సిబ్లింగ్స్’తో ట్రెండ్‌కు ఊపు
ఈ కొత్త ఒరవడి వెనుక ప్రచి అగర్వాల్, రాఘవ్ అగర్వాల్ సోదర సోదరి ద్వయం ఉన్నారు. వీరు స్థాపించిన ‘బ్యాక్‌స్టేజ్ సిబ్లింగ్స్’ బృందం ‘బైథక్స్’ పేరుతో లైవ్ సెషన్లను నిర్వహిస్తోంది. ఈ సెషన్లలో హార్మోనియం, తబలా, ఢోలక్ వంటి సాంప్రదాయిక వాద్యాలను ఉపయోగిస్తూ భజనలు పాడతారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఒక వీడియోలో వందలాది మంది యువతీ యువకులు శ్రీ కృష్ణ గోవింద్ హరే మురారి భజన పాడుతూ, చప్పట్లు కొడుతూ, ఆనందంగా ఊగుతూ కనిపించారు. దిమ్ లైట్స్ ఉన్న హాలులో జరిగిన ఈ కార్యక్రమం లివింగ్ రూమ్ జామ్ సెషన్‌ను తలపించింది. భజనలకు కొత్త మార్గాలు చూపిస్తున్న జెన్ జెడ్‌ను ట్రెండ్‌పై సామాజిక మాధ్యమాల్లో భారీ చర్చ మొదలైంది.

ముంబై, బెంగళూరు యువతరం పరుగులు
ముంబైలో జరిగిన కీర్తన్ ఈవెంట్లలో జెన్ జెడ్ యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. మిలీనియల్స్ చాలా తక్కువ మంది ఉండగా… మిగతావారంతా యువకులే. నేలపై కాళ్లు వేలాడదీసుకుని కూర్చుని భజనలకు తాళం వేస్తూ పాటలకు అనుగుణంగా స్వేయ్ అవుతున్న ఈ వాతావరణం… ఎలక్ట్రానిక్ బీట్స్ లేని సంగీత విభావరి (గిగ్) వాతావరణాన్ని గుర్తు చేసింది. భక్తి భావాన్ని అనుభూతి చెందడానికి ఇలాంటి వేదికలు ఎక్కడ ఉన్నాయంటూ బెంగళూరు యువతరం కూడా ఆసక్తిగా ప్రశ్నిస్తోంది. ముఖ్యంగా పండగ సమయాల్లో సాంప్రదాయిక వేడుకలకు బదులు ఇలాంటి సోల్‌ఫుల్ మ్యూజిక్ ఈవెంట్స్ వైపు యువత మొగ్గు చూపుతున్నారు.
పాజిటివ్ వైబ్: విమర్శలున్నా స్వాగతం
సామాజిక మాధ్యమాల్లో ఈ కొత్త ట్రెండ్‌కు మద్దతు వెల్లువెత్తింది. తరాలు మారేకొద్దీ పూజా పద్ధతులు కూడా మారతాయి. యువత కొత్త రూపాన్ని ఇస్తుంటే ఎలాంటి అభ్యంతరం లేదని చాలామంది అభిప్రాయపడ్డారు. ‘భక్తి భావం ముఖ్యం, వేదిక కాదు’ అని మరికొందరు స్పష్టం చేశారు. అయితే కొందరు మాత్రం ఇది క్లబింగ్ కాదని, సత్సంగ్ అని, ట్రెడిషనల్ భజన మండలికి దీనికి పెద్దగా తేడా లేదని, కేవలం సెట్టింగ్ మాత్రమే మారిందని విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించారు. కొంతమంది షూస్ వేసుకుని పాల్గొనడం వంటి చిన్నపాటి అమర్యాద సమస్యలను కూడా ప్రస్తావించారు. అయినప్పటికీ ఈ ‘క్లబింగ్’ను లేదా ‘సత్సంగ్’ను యువతరం భక్తిగా అంగీకరించడం శుభపరిణామమని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడ్డారు.