- 11 అంతస్తులతో తిరుపతి బస్టాండ్
- త్వరలో శంకుస్థాపనకు సీఎం బాబు సన్నాహం
- పీపీపీ పద్దతిలో అల్ట్రా మోడల్ టెర్మినల్
సహనం వందే, తిరుపతి:
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు తిరుపతి సెంట్రల్ బస్టాండ్ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. వెంకన్న భక్తులు రోజుకు లక్షల్లో తరలివచ్చే ఈ పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీని తట్టుకునేలా 11 అంతస్తుల అల్ట్రా మోడల్ బస్ టెర్మినల్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. కేవలం బస్సులు నిలిపే స్థలంగా కాకుండా దివ్యక్షేత్రానికి తగిన విధంగా ఆధునిక వసతులు, హోటళ్లు, రెస్టారెంట్లు, బ్యాంకులు వంటి అన్ని సౌకర్యాలతో ఈ భవనం రూపుదిద్దుకోనుంది. ఆశ్చర్యకరంగా 11వ అంతస్తుపై హెలిప్యాడ్ కూడా నిర్మించనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో శంకుస్థాపన చేయనున్నారు.
150 ప్లాట్‌ఫారాల ఏర్పాటు…
ప్రస్తుతం తిరుమల – తిరుపతికి రోజుకు లక్ష మందికిపైగా ప్రయాణికులు, యాత్రికులు వస్తున్నారు. వీరిలో 60 వేల మందికి పైగా భక్తులు ఆర్టీసీ బస్సుల్లోనే క్షేత్రాన్ని చేరుకుంటున్నారు. ఈ భక్తుల సంఖ్య 2052 నాటికి లక్షన్నరకు చేరే అవకాశం ఉందని అంచనా. ఈ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొత్త టెర్మినల్‌లో 150 బస్ ప్లాట్‌ఫారాలను, విద్యుత్ బస్సులకు ఛార్జింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోనే ఎర్నింగ్ ఫర్ కిలోమీటరులో తిరుపతి రీజియన్ మొదటి స్థానంలో ఉంది. రోజుకు రూ. 2 కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తుండటం ఈ ప్రాంతానికి ఉన్న భక్తి పారవశ్యాన్ని, ప్రాధాన్యతను చెబుతోంది.
కేంద్రం కీలక పాత్ర…
ఈ బస్ టెర్మినల్ ప్రాజెక్టుకు అత్యంత ముఖ్యమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తున్నా దీని నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వానిదే కీలక పాత్ర కావడం చర్చనీయాంశమైంది. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్) ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. అయితే మాస్టర్ ప్లాన్ పూర్తయినా ఇంకా టెండర్ ప్రక్రియ పూర్తి కాకుండానే భాగస్వాములు ఇచ్చిన ఇన్‌పుట్‌ల మేరకు డిజైన్‌లో తుది మార్పులు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తిరుమలేశుని చెంత భక్తులకు సౌలభ్యం అందించే ఈ భారీ ప్రాజెక్టు కీలక ప్రైవేటు భాగస్వామి ఎవరన్నది టెండర్ల ప్రక్రియ పూర్తయితే కానీ తేలదు. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీకి కట్టబెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.